ఆదివారం 31 మే 2020
Business - May 23, 2020 , 00:33:01

మూడు నెలల్లో మూడోసారి

మూడు నెలల్లో మూడోసారి

  • 40 బేసిస్‌ పాయింట్లు తగ్గిన రెపో, రివర్స్‌ రెపో రేట్లు 
  • 20 ఏండ్ల కనిష్ఠస్థాయికి చేరిక
  • ఈఎంఐలపై మరో మూడు నెలలు మారటోరియం 
  •  ప్రస్తుతానికి వృద్ధి ప్రతికూలమే: ఆర్బీఐ

కరోనా కాటుతో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు రిజర్వు బ్యాంకు మరోసారి కీలక వడ్డీ రేట్లను తగ్గించింది. రెపో రేటును 4 శాతానికి, రివర్స్‌ రెపో రేటును 3.35 శాతానికి కుదించింది. ఆర్బీఐ గత మూడు నెలల్లో కీలక వడ్డీ రేట్లను తగ్గించడం ఇది మూడోసారి. టర్మ్‌ లోన్లపై మారటోరియంను మరో మూడు నెలలు పొడిగించిన ఆర్బీఐ.. వర్కింగ్‌ క్యాపిటల్‌ వడ్డీ చెల్లింపులపై విధించిన మారటోరియంను కూడా మరో మూడు నెలలు పొడిగించింది. కార్పొరేట్లకు మరిన్ని రుణాలను అందించేందుకు వీలుకల్పించే బ్యాంక్‌ ఎక్స్‌పోజర్‌ను ఆ కంపెనీల నికర విలువలో 30 శాతానికి పెంచింది. 

ముంబై, మే 22:  కరోనా సంక్షోభంతో కుంగిపోయిన భారత ఆర్థిక వ్యవస్థకు చేయూతనిచ్చేందుకు రిజర్వు బ్యాంకు కీలక వడ్డీ రేట్లను మరోసారి తగ్గించింది. ఇప్పటివరకు 4.4 శాతంగా ఉన్న రెపో రేటును 40 బేసిస్‌ పాయింట్లు కుదించి 4 శాతానికి పరిమితం చేసింది. అలాగే రివర్స్‌ రెపో రేటును కూడా 40 బేసిస్‌ పాయింట్లు కుదించడంతో అది 3.75 శాతం నుంచి 3.35 శాతానికి తగ్గింది. దీంతో గృహ, వాహన, ఇతర రుణాలతోపాటు సేవింగ్స్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గేందుకు అవకాశముంటుంది. రిజర్వు బ్యాంకు ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశంలో బెంచ్‌మార్క్‌ వడ్డీ రేట్ల తగ్గింపునకు నిర్ణయం తీసుకొన్నట్టు ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌  తెలిపారు. రెపో రేటును 40 బేసిస్‌ పాయింట్లు తగ్గించేందుకు ఎంపీసీలోని ఆరుగురు సభ్యు ల్లో ఐదుగురు అనుకూలంగా ఓటేయగా.. చేతన్‌ ఘటే మాత్రం 25 బేసిస్‌ పాయింట్ల కుదింపునకు ఓటేశారని వివరించారు. రిజర్వు బ్యాంకు బెంచ్‌మార్క్‌ వడ్డీ రేట్లను తగ్గించడం మూడు నెలల వ్యవధిలో ఇది మూడోసారి. మార్చి 27న కీలక వడ్డీ రేట్లను 75 బేసిస్‌ పాయింట్లు తగ్గించిన ఆర్బీఐ.. ఏప్రిల్‌లో మరో 25 బేసిస్‌ పాయింట్లు కుదించింది. ప్రస్తుత సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్యాకేజీ ప్రకటన తర్వాత శక్తికాంతదాస్‌.. శుక్రవారం తొలిసారి మీడియాతో మాట్లాడారు. తాజా సవరణతో బెంచ్‌మార్క్‌ వడ్డీ రేట్లు 20 ఏండ్ల కనిష్ఠస్థాయికి చేరాయన్నారు. అవసరమైతే వీటిని మున్ముందు మరింత తగ్గించేందుకు ఎంపీసీ సుముఖంగా ఉన్నదని తెలిపారు.

ఆగస్టు 31 వరకు మారటోరియం

టర్మ్‌ లోన్‌ ఇన్‌స్టాల్‌మెంట్లపై గతంలో విధించిన మారటోరియంను మరో మూడు నెలలు (ఆగస్టు 31 వరకు) పొడిగిస్తున్నట్టు శక్తికాంతదాస్‌ ప్రకటించారు. దీంతో లాక్‌డౌన్‌ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రుణగ్రహీతలకు కొంతమేరకు ఊరట లభిస్తుంది. అయితే ఇది రుణమాఫీ కాదు. కేవలం ఈఎంఐలను వాయిదా వేయడమే. కనుక తప్పనిసరి అయితేనే రుణగ్రహీతలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. మరోవైపు వర్కిం గ్‌ క్యాపిటల్‌ వడ్డీ చెల్లింపులపై విధించిన మారటోరియంను కూడా ఆర్బీఐ మరో మూడు నెలలు పొడిగించింది. మారటోరియం పీరియడ్‌లో పేరుకుపోయే వడ్డీని టర్మ్‌ లోన్‌గా మారుస్తారని, ఈ పీరియడ్‌లో ఈఎంఐలు చెల్లించనివారిని ఎగవేతదారులుగా పరిగణించబోరని శక్తికాంతదాస్‌ వివరించారు. కార్పొరేట్‌ కంపెనీలకు మరిన్ని రుణాలను అందించేందుకు వీలుకల్పించే బ్యాంక్‌ ఎక్స్‌పోజర్‌ను ఆయా కంపెనీల నికర విలువలో 30 శాతానికి పెంచుతున్నట్టు తెలిపారు. ఇప్పటివరకు ఈ ఎక్స్‌పోజర్‌ 25 శాతంగా ఉన్నది. అలాగే ఎగుమతి రుణాల గరిష్ఠ పరిమితిని ఏడాది నుంచి 15 నెలలకు పెంచుతున్నట్టు ఆర్బీఐ గవర్నర్‌ తెలిపారు.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ ప్రతికూలానికి పడిపోనున్నదన్నారు. ద్రవ్యోల్బణంపై అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నయని శక్తికాంత దాస్‌ అన్నారు. 

సీఎస్‌ఎఫ్‌ నిబంధనల సడలింపు

రాష్ర్టాలకు అదనంగా రూ.13,300 కోట్లు

  కరోనా సంక్షోభం నేపథ్యంలో రాష్ర్టాలకు మరిన్ని ఆర్థిక వనరులను సమకూర్చేందుకు రిజర్వు బ్యాంకు కీలక నిర్ణయం తీసుకొన్నది. కన్సాలిడేటెడ్‌ సింకింగ్‌ ఫండ్‌ (సీఎస్‌ఎఫ్‌) నుంచి రాష్ర్టాలు నిధులను ఉపసంహరించుకొనేందుకు నిబంధనలను సడలిస్తున్నట్టు ఆర్బీఐ శుక్రవారం ప్రకటించింది. దీంతో రాష్ర్టాలకు అదనంగా రూ.13,300 కోట్ల నిధులు సమకూరుతాయి. రాష్ర్టాలు తమ అప్పులను చెల్లించేందుకు మిగులు నిధులతో రిజర్వు బ్యాంకు వద్ద సీఎస్‌ఎఫ్‌ను నిర్వహిస్తుంటాయి. కొవిడ్‌-19 సంక్షోభం వల్ల రాష్ర్టాలు ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నందున ఈ పథకంపై సమీక్ష నిర్వహించామని, సీఎస్‌ఎఫ్‌ నుంచి నిధుల ఉపసంహరణకు నిబంధనలను సడలించాలని నిర్ణయించామని ఆర్బీఐ గవర్నర్‌ వెల్లడించారు.

ఆర్బీఐ గవర్నర్‌ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ఈ నిర్ణయంతో బ్యాంకులు వడ్డీరేట్లను తగ్గించేందుకు వీలవుతుంది. అలాగే మారటోరియాన్ని మరో మూడు నెలలు పొడిగిస్తూ తీసుకున్న నిర్ణయం సహేతుకమైనది. కరోనా వైరస్‌తో కుదేలైన ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడానికి ఆర్బీఐ ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నది. 

- సంగీతారెడ్డి, ఫిక్కీ ప్రెసిడెంట్‌

రియల్‌ రంగానికి ఊతమిచ్చే నిర్ణయాలను తీసుకోవడంలో రిజర్వు బ్యాంకు విఫలమైంది. ఈ మారటోరియంతో రియల్‌ రంగం ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం లభించదు.

- సతీష్‌ మగర్‌, క్రెడాయ్‌ జాతీయ అధ్యక్షుడు

మారటోరియాన్ని మరో మూడు నెలలు పొడిగిస్తూ తీసుకున్న నిర్ణయంతో ఎన్‌బీఎఫ్‌సీలకు భారీ ఊరట లభించినట్లు అయింది. కార్పొరేట్ల రుణ పరిమితిని 25 శాతం నుంచి 30 శాతానికి పెంచడాన్ని స్వాగతిస్తున్నాం.  

- చంద్రజిత్‌ బెనర్జీ, సీఐఐ డైరెక్టర్‌ జనరల్‌

దేశ ఆర్థిక వ్యవస్థ త్వర గా కోలుకునేందుకు ఈ నిర్ణయాలు దోహదం చేస్తాయి. ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడి లో పెట్టడానికి ప్రభుత్వం, ఆర్బీఐ కృషి చేస్తున్నాయి. 

- రజనీశ్‌ కుమార్‌, ఎస్బీఐ చైర్మన్‌


logo