ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Business - Aug 10, 2020 , 02:26:53

రుణ పునర్‌ వ్యవస్థీకరణతో ఒరిగేదేమిటి

రుణ పునర్‌ వ్యవస్థీకరణతో ఒరిగేదేమిటి

కరోనా కాటుతో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టేందుకు రిజర్వు బ్యాంకు పలు చర్యలు చేపడుతున్నది. ఈ చర్యల్లో భాగంగానే కార్పొరేట్‌, రిటైల్‌ రుణగ్రహీతలకు ఆర్బీఐ భారీ ఊరటనిచ్చింది. ప్రస్తుత సంక్షోభం వల్ల రాబడులు తగ్గి అప్పులు తీర్చలేక సతమతమవుతున్న వీరిని ఏకకాల రుణ పునర్‌వ్యవస్థీకరణతో ఆదుకొనేందుకు ఆర్బీఐ ఆమోదం తెలిపింది. దీంతో ఈ ఏడాది మార్చి 1 వరకు సక్రమంగా బకాయిలు చెల్లించిన కంపెనీలు, వ్యక్తుల రుణాలను పునర్‌వ్యవస్థీకరించే వెసులుబాటు వాణిజ్య బ్యాంకులకు లభించింది. అయితే ఈ పథకానికి ఏ రకమైన వ్యక్తిగత రుణాలు అర్హమన్న దానిపై రిజర్వు బ్యాంకు స్పష్టత ఇవ్వకపోవడంతో రుణగ్రహీతల్లో అయోమయం నెలకొన్నది. ఈ గందరగోళాన్ని తొలగించేందుకు ప్రత్యేక కథనంతో ‘నమస్తే తెలంగాణ’ చేస్తున్న ప్రయత్నమిదీ..

ఇప్పటికే ఉన్న రుణ ఒప్పంద నిబంధనలను మార్చడాన్నే క్లుప్తంగా రుణ పునర్‌వ్యవస్థీకరణ అంటారు. ఈ ప్రక్రియలో రుణదాతకు చెల్లించాల్సిన అసలు అప్పును, వడ్డీని మార్చేందుకు వీలుంటుంది. అంటే అప్పు తీర్చేందుకు ఇచ్చిన గడువును మరింత పొడిగించవచ్చు. లేదంటే అతను చెల్లించాల్సిన వడ్డీని తగ్గించవచ్చు. ఇదంతా రుణదాతలు, రుణగ్రహీతల పరస్పర అంగీకారంతో కేసులవారీగా జరుగుతుంది. కొవిడ్‌-19 లాంటి పెను సంక్షోభం లేదా ఇతర తీవ్రమైన ఇబ్బందుల కారణంగా అప్పు తీర్చలేని పరిస్థితి ఏర్పడినప్పుడు రుణగ్రహీతల అప్పులను పునర్‌వ్యవస్థీకరిస్తారు. దీంతో నెలవారీగా చెల్లించాల్సిన కిస్తీ తగ్గి రుణగ్రహీతకు ఉపశమనం లభించడంతోపాటు రుణదాత ఆస్తుల నాణ్యతనూ కాపాడుకొనేందుకు వీలవుతుంది.

పరిష్కార ప్రణాళికకు డెడ్‌లైన్లు ఏమిటి..

ఈ పునర్‌ వ్యవస్థీకరణ పథకం కింద ఈ ఏడాది చివరిలోగా ఏ సమయంలోనైనా పరిష్కార ప్రణాళికను మొదలుపెట్టవచ్చని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఈ ప్రణాళికను మొదలుపెట్టిన తర్వాత వ్యక్తులకైతే 90 రోజుల్లోగా, కంపెనీలు లేదా వ్యాపార సంస్థలకైతే 180 రోజుల్లోగా దీన్ని అమలు చేయాల్సి ఉంటుందని మార్గదర్శకాలు పేర్కొంటున్నాయి. కానీ అంతకంటే ముందే రుణ సంస్థలు ఈ ప్రణాళికను మొదలు పెట్టవచ్చు. ఆ విధంగా వ్యక్తిగత రుణగ్రహీతలకు ఈ ఏడాది డిసెంబర్‌ 1న పరిష్కార ప్రణాళికను మొదలుపెట్టినట్టయితే వచ్చే ఏడాది ఫిబ్రవరి 28వ తేదీలోగా దాన్ని అమలు చేయాల్సి ఉంటుంది.

ఎన్‌బీఎఫ్‌సీల నుంచి తీసుకున్న రుణాలను పునర్‌వ్యవస్థీకరిస్తారా..

అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ బ్యాంకులతోపాటు భారత్‌లో పనిచేస్తున్న విదేశీ బ్యాంకులు, స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులు, లోకల్‌ ఏరియా బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, ప్రాథమిక (అర్బన్‌) సహకార బ్యాంకులు, రాష్ట్ర సహకార బ్యాంకులు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. వీటితో బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ)లు, హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు, ఆలిండియా ఫైనాన్షియల్‌ సంస్థలకు కూడా ఆర్బీఐ అనుమతి ఇచ్చింది.

నిబంధనలు, ప్రయోజనాలేమిటి..

అప్పులను క్రమం తప్పకుండా తిరిగి చెల్లిస్తున్నవారు, ఈ ఏడాది మార్చి 31 నాటికి 30 రోజుల కంటే ఎక్కువ ఓవర్‌డ్యూ లేనివారు మాత్రమే ఈ పథకం ద్వారా లబ్ధి పొందేందుకు అర్హులు. పునర్‌వ్యవస్థీకరణ ప్రక్రియలో నిబంధనలను మార్చడం ద్వారా రుణాల చెల్లింపును రీషెడూల్‌ చేయడంతోపాటు ఆ రుణాలపై చెల్లించాల్సిన వడ్డీని మరో చిన్న రుణంగా మార్చవచ్చు. లేదంటే దానిపై గరిష్ఠంగా రెండేండ్ల వరకు మారటోరియం విధించవచ్చు. అంతేకాకుండా ఈ పథకానికి అర్హులైన వ్యక్తిగత రుణగ్రహీతలను ఎగవేతదారులుగా పరిగణించరు.

అన్ని రుణాలు అర్హమేనా..

కరోనా సంక్షోభంతో ఒత్తిడిని ఎదుర్కొంటున్న అన్ని రకాల వ్యక్తిగత, కార్పొరేట్‌ రుణాలకు కొన్ని నిబంధనలతో ఈ పునర్‌వ్యవస్థీకరణ పథకం వర్తిస్తుంది. అయితే ఫైనాన్షియల్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు, మొత్తం అప్పులు రూ.25 కోట్ల కంటే తక్కువగా ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎంఎస్‌ఎంఈ) సంస్థలకు చెందిన రుణగ్రహీతలతోపాటు వ్యవసాయ రుణాలు, ప్రభుత్వ సంస్థలకు, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలకు (పీఏసీఎస్‌లకు), రైతు సేవా సంఘాలకు చెల్లించాల్సిన రుణాలు ఈ పథకానికి అర్హమైనవి కావు.

ఎవరు అర్హులు..

వ్యక్తిగత రుణగ్రహీతలందరికీ పునర్‌వ్యవస్థీకరణ పథకాన్ని వర్తింపజేయవచ్చని రిజర్వు బ్యాంకు మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి. కన్జ్యూమర్‌ క్రెడిట్‌, ఎడ్యుకేషన్‌ లోన్‌, స్థిరాస్తుల వృద్ధికి సంబంధించిన రుణాలు, షేర్లు, డిబెంచర్ల లాంటి వాటిలో పెట్టుబడులు పెట్టేందుకు తీసుకొన్న రుణాలు ఈ కోవలోకి వస్తాయి. వీటితోపాటు గృహోపకరణ రుణాలు, క్రెడిట్‌ కార్డు రుణాలు, వాహన రుణాలు (వాణిజ్య అవసరాలకు తీసుకున్న రుణాలు మినహా), బంగారం లేదా ఆభరణాలు, స్థిరాస్తులు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, షేర్లు, బాండ్లపై రుణాలు (వ్యాపార, వాణిజ్య అవసరాలకు తీసుకున్న రుణాలు మినహా) పొందినవారు కూడా ఈ పథకం ద్వారా లబ్ధి పొందేందుకు వీలుంటుంది.


logo