సోమవారం 01 జూన్ 2020
Business - May 03, 2020 , 02:16:37

బ్యాంకర్లతో దాస్‌ భేటీ

బ్యాంకర్లతో దాస్‌ భేటీ

న్యూఢిల్లీ, మే 2: ఆర్బీఐగవర్నర్‌ శక్తికాంత దాస్‌ శనివారం వివిధ బ్యాంకుల అధిపతులతో సమావేశమయ్యారు. కరోనాతో ఆర్థిక వ్యవస్థలో ఏర్పడిన ఒత్తిడిని తగ్గించేందుకు తాము తీసుకున్న పలు నిర్ణయాల అమలు, మార్కెట్‌ పరిస్థితులపై ఈ సందర్భంగా చర్చించారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన ఈ భేటీలో ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ బ్యాంకుల ఎండీ, సీఈవోలు పాల్గొన్నట్లు సమావేశం అనంతరం ఆర్బీఐ ఓ ప్రకటనలో తెలియజేసింది. కాగా, లాక్‌డౌన్‌లోనూ బ్యాంకింగ్‌ కార్యకలాపాలు ఎలాంటి విఘాతం లేకుండా నడుస్తుండటంపట్ల దాస్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. ఇందుకు సిబ్బందిని అభినందించారు. ఇక ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు, ఆర్థిక రంగ స్థిరీకరణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఎన్‌బీఎఫ్‌సీ లు, సూక్ష్మ రుణ సంస్థలు, హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు, ఎంఎఫ్‌లకు చేయూత పై ఆరా తీశారు. అలాగే లాక్‌డౌన్‌ తర్వాత వ్యవస్థలోకి రుణాల రూపంలో మరింత నగదును చొప్పించడం, ప్రత్యేకంగా ఎంఎస్‌ఎంఈలకు పెద్ద ఎత్తున రుణాల మంజూరు ఆవశ్యకతను వివరించారు. రుణాల ఈఎంఐలపై ప్రకటించిన మారటోరియం అమలుపైనా సమీక్ష జరిపారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం ఉన్న నేపథ్యంలో విదేశాల్లోని బ్యాంక్‌ శాఖల పనితీరు గురించీ దాస్‌ అడిగి తెలుసుకున్నారు. 


logo