శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Business - Feb 18, 2020 , 01:43:42

ఆగొద్దు అంతే

ఆగొద్దు అంతే
  • దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి సంస్కరణలు వేగంగా కొనసాగాలి
  • పీటీఐ ఇంటర్వ్యూలో ఆర్బీఐ గవర్నర్‌ దాస్‌

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: దేశ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న మందగమనం పోవాలంటే కేంద్ర ప్రభుత్వ సంస్కరణలు కొనసాగుతూనే ఉం డాలని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అన్నారు. సోమవారం ఇక్కడ పీటీఐకిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ జీడీపీ పురోగతికి నిర్మాణాత్మక సంస్కరణలు చేపట్టాలని సూచించారు. 11 ఏండ్ల కనిష్ఠ స్థాయి నుంచి వృద్ధిరేటు కోలుకోవాలంటే ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే నిర్ణయాలు ఎన్నో తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మార్కెట్‌లో క్షీణించిన డిమాండ్‌, వినియోగ సామర్థ్యాన్ని తిరిగి బలపరిచేందుకు ఇటీవలి బడ్జెట్‌లో ప్రయత్నాలు జరిగాయన్నారు.


ఈ నెల 1న పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2020-21)గాను బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భూ, కార్మిక సంస్కరణలు ముఖ్యమని, వ్యవసాయ మార్కెటింగ్‌లో ప్రభావవంతమైన చర్యలు తీసుకోవడం, నైపుణ్యాభివృద్ధిపై దృష్టి పెట్టడం ప్రధానమన్నారు. ఏపీఎంసీ చట్టంలో చెప్పుకోదగ్గ సవరణలు కూడా అవసరమేనన్నారు. ఇక సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థ (ఎంఎస్‌ఎంఈ)ల ప్రగతికి చర్యల కొరత కనిపిస్తున్నదన్న దాస్‌.. రూ.25,000 కోట్ల తొలి లాంగ్‌ టర్మ్‌ రివర్స్‌ రెపో ఆపరేషన్‌ (ఎల్‌టీఆర్‌వో) కోసం రూ.1.94 లక్షల కోట్ల బిడ్లు దాఖలైయ్యాయని చెప్పారు.


మందగమనాన్ని ఎప్పుడో గుర్తించాం

గతేడాది ఫిబ్రవరిలోనే దేశ ఆర్థిక మందగమనాన్ని గుర్తించామని దాస్‌ తెలిపారు. అందుకే జీడీపీని పరుగులు పెట్టించేందుకు తమ వంతు సాయంగా వరుసగా ఐదు ద్రవ్యసమీక్షల్లో కీలక వడ్డీరేట్లను తగ్గించామని చెప్పారు. కానీ డిసెంబర్‌లో ద్రవ్యోల్బణం పెరుగుతుందన్న సంకేతాలు అందడంతో కోతలకు విరామం ఇచ్చామన్నారు. ఈ నెల ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలోనూ రెపో, రివర్స్‌ రెపోల జోలికి వెళ్లలేదని వివరించారు. అక్టోబర్‌-డిసెంబర్‌ త్రైమాసిక జీడీపీ గణాంకాలు.. జూలై-సెప్టెంబర్‌లో నమోదైన 4.5 శాతం కంటే తక్కువగా ఉండొచ్చన్న అంచనాలు వినిపిస్తున్న నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరం జీడీపీ కోలుకుంటుందని దాస్‌ అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) దేశ వృద్ధిరేటును 5 శాతంగానే అంచనా వేసిన ఆర్బీఐ.. వచ్చే ఆర్థిక సంవత్సరానికి 6 శాతానికి పెంచిన విషయం తెలిసిందే. ఇక దేశ, విదేశీ ఆర్థిక విపత్కర పరిస్థితులు కార్పొరేట్‌ రంగంలో మొండి బకాయిల (నిరర్థక ఆస్తులు లేదా ఎన్‌పీఏ)పై ప్రభావం చూపుతున్నాయని చెప్పారు. అలాగే టెలికం సంస్థల ఏజీఆర్‌ బకాయిల అంశాన్ని నిశితంగా గమనిస్తున్నట్లు తెలిపారు.


సార్స్‌ కంటే కరోనా పెద్దదే

చైనాలో విజృంభిస్తూ ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌పై దాస్‌ స్పందిస్తూ ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం చాలా ఎక్కువేనని అభిప్రాయపడ్డారు. 2003లో తలెత్తిన సార్స్‌ సమస్య కంటే కరోనా తీవ్రంగా ఉందన్న ఆయన వృద్ధిరేటును ఈ వైరస్‌ పెద్ద దెబ్బే తీస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో చైనా పాత్ర కీలకమని, అలాంటి ఆ దేశ ఆర్థిక పరిస్థితులనే ఇప్పుడు కరోనా వైరస్‌ తలకిందులు చేసేలా భయపెడుతున్నదని వ్యాఖ్యానించారు. చైనా ఆర్థిక మందగమనం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై సహజంగానే ఉంటుందని గుర్తుచేశారు. ఇప్పటికే అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) చీఫ్‌ కరోనాపై ఆందోళన వెలిబుచ్చారని, దానివల్ల అన్ని దేశాలు ఈ వైరస్‌పై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. రిజర్వ్‌ బ్యాంక్‌గా తామూ వైరస్‌ వ్యాప్తిని, దాని ప్రభావాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని చెప్పారు.


logo