గురువారం 06 ఆగస్టు 2020
Business - Jul 28, 2020 , 00:23:25

వృద్ధి బలోపేతానికి వెనుకాడం

వృద్ధి బలోపేతానికి వెనుకాడం

  • ఎలాంటి నిర్ణయాలనైనా తీసుకుంటాం: ఆర్బీఐ గవర్నర్‌ దాస్‌
  • దేశ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ మౌలికాభివృద్ధితోనే సాధ్యం

న్యూఢిల్లీ, జూలై 27: దేశ ఆర్థిక పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్‌ శక్తికాంత దాస్‌ తెలిపారు. వృద్ధిరేటు బలోపేతానికి ఎలాంటి చర్యలనైనా తీసుకుంటామని, ఈ విషయంలో వెనుకాడబోమని స్పష్టం చేశారు. సోమవారం వ్యాపార, పారిశ్రామిక సంఘం సీఐఐ నిర్వహించిన కార్యక్రమంలో దేశీయ పరిశ్రమనుద్దేశించి దాస్‌ మాట్లాడారు. మౌలిక రంగాన్ని బలోపేతం చేయడం ద్వారా కరోనా వైరస్‌తో స్తంభించిన దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి పునరుద్ధరించవచ్చని ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. భారతీయ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లోకి మరిన్ని పెట్టుబడులు వచ్చేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ క్రమంలోనే మౌలికాభివృద్ధికి భారీ ఎత్తున పెట్టుబడులు అవసరమన్న ఆయన దీనికి ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాలు చాలా కీలకమని పేర్కొన్నారు. మెగా ప్రాజెక్టులు పూర్తయితే ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడిన పడగలదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగంలో ఇటీవలి సంస్కరణలు కొత్త అవకాశాలకు తెర లేపాయని, భారత ఆర్థిక వ్యవస్థ ప్రగతికి ఇవి ప్రధానం కాగలవని వ్యాఖ్యానించారు. అలాగే భారత్‌లో అంతర్జాతీయ ఉత్పాదక సంస్థల భాగస్వామ్యం 1 శాతం పెరిగినా.. దేశ తలసరి ఆదాయం 1 శాతానికిపైగా పెరుగగలదని చెప్పారు. అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌, బ్రిటన్‌లతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను త్వరగా పూర్తి చేసుకోవాలన్న ఆయన వ్యూహాత్మక వాణిజ్య విధానంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఇక డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ కదలికలను చాలా దగ్గరగా గమనిస్తున్నామని స్పష్టం చేశారు. కార్పొరేట్‌ బాండ్ల జారీ ఈ ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో లక్ష కోట్ల రూపాయలను తాకిందన్న ఆయన కరోనా నేపథ్యంలో మొండి బకాయిల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, మూలధన సమీకరణపై దృష్టి పెట్టాలని బ్యాంకులకు సూచించారు. కాగా, దేశీయ గనుల రంగం.. జీడీపీ ప్రగతికి ఎంతగానో దోహదపడగలదని నీతి ఆయోగ్‌కు సూచించినట్లు సీఐఐ తెలియజేసింది.

84,545 బ్యాంక్‌ మోసాలు

షెడ్యూల్డ్‌ కమర్షియల్‌ బ్యాంకులు, కొన్ని ఆర్థిక సంస్థల్లో గత ఆర్థిక సంవత్సరం (2019-20) దాదాపు 84,545 మోసాలు జరిగాయని ఆర్బీఐ తెలియజేసింది. వీటి విలువ సుమారు రూ.1.85 లక్షల కోట్లుగా ఉందని పేర్కొన్నది. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కార్యకర్త అభయ్‌ కోలార్కర్‌కు ఈ మేరకు వివరాలను అందజేసింది. అయితే ఈ మోసాల్లో ఎంతమంది బ్యాంక్‌ ఉద్యోగుల ప్రమేయం ఉంది?, నష్టమెంత? అన్న వివరాలు స్పష్టంగా లేవన్న ఆర్బీఐ.. మోసాల విలువ దాదాపు రూ.4,500 కోట్లుగా ఉండవచ్చన్నది. సుమారు 2,14,480 ఫిర్యాదులు కస్టమర్ల నుంచి ఆర్బీఐ అంబుడ్స్‌మెన్‌ కార్యాలయాలు అందుకున్నట్లు పేర్కొన్నది. వీటిలో ఎస్బీఐ ఖాతాదారుల నుంచి అత్యధికంగా 63,259 ఫిర్యాదులున్నాయి. ఆ తర్వాత హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ (18,764), ఐసీఐసీఐ బ్యాంక్‌ (14,582), పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (12,469), యాక్సిస్‌ బ్యాంక్‌ (12,214) ఉన్నాయి. 


logo