ఎన్పీఏల గుదిబండ

- 24 ఏండ్ల గరిష్ఠం
- సెప్టెంబర్ నాటికి 14.8 శాతానికి చేరొచ్చని అంచనా
- బ్యాంకుల మొండి బకాయిలపై ఆర్బీఐ ఆందోళన
ముంబై, జనవరి 11: దేశంలోని వాణిజ్య బ్యాంకుల మొండి బకాయిలు మరింత పెరగవచ్చని రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) ఆందోళన వ్యక్తం చేసింది. గతేడాది సెప్టెంబర్ చివరి నాటికి బ్యాంకుల మొత్తం రుణాల్లో 7.5 శాతంగా ఉన్న స్థూల నిరర్థక ఆస్తులు (జీఎన్‌పీఏలు).. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి కనీసం 13.5 శాతానికి (22 ఏండ్ల గరిష్ఠానికి) చేరుకోవచ్చని తాజాగా విడుదల చేసిన ఆర్థిక స్థిరత్వ నివేదిక (ఎఫ్ఎస్ఆర్)లో ఆర్బీఐ అంచనా వేసింది. స్థూల ఆర్థిక పరిస్థితి మరింత దిగజారితే జీఎన్‌పీఏ నిష్పత్తి 14.8 శాతానికి (24 ఏండ్ల గరిష్ఠానికి) ఎగబాకవచ్చని ఈ నివేదిక స్పష్టం చేసింది. 2020 సెప్టెంబర్ చివరి నాటికి 9.7 శాతంగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకు (పీఎస్బీ)ల జీఎన్‌పీఏ నిష్పత్తి ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి కనీసం 16.2 శాతానికి.. ప్రైవేట్ రంగ బ్యాంకు (పీవీబీ)ల జీఎన్‌పీఏ నిష్పత్తి 4.6 శాతం నుంచి కనీసం 7.9 శాతానికి.. విదేశీ బ్యాంకు (ఎఫ్బీ)ల జీఎన్‌పీఏ నిష్పత్తి 2.5 శాతం నుంచి కనీసం 5.4 శాతానికి చేరుకోవచ్చని తెలిపింది. తీవ్రమైన ఒత్తిడి ఏర్పడిన పక్షంలో జీఎన్‌పీఏ నిష్పత్తి పీఎన్‌బీల్లో 17.6 శాతానికి, పీవీబీల్లో 8.8 శాతానికి, ఎఫ్‌బీల్లో 6.5 శాతానికి పెరిగినా ఆశ్చర్యపడనక్కర్లేదని పేర్కొన్నది.
బ్యాలెన్స్ షీట్లకు ముప్పు: దాస్
కొవిడ్-19 సంక్షోభం.. బ్యాంకుల బ్యాలెన్స్ షీట్లను కుంగదీయడంతోపాటు వాటి మూలధన తగ్గుదలకు దారితీసే ప్రమాదం ఉన్నదని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ప్రత్యేకించి నియంత్రణ పరంగా బ్యాంకులకు ఇచ్చిన వెసులుబాట్లను ఉపసంహరించుకున్న ఈ ముప్పు మరింత పెరిగే అవకాశమున్నదని ఆర్థిక స్థిరత్వ నివేదిక ముందుమాటలో ఆయన అభిప్రాయపడ్డారు. ద్రవ్యపరమైన, రుణ వితరణకు సంబంధించిన నిబంధనలను సరళతరం చేయడం బ్యాంకుల ఆర్థిక పరామితులకు దన్నుగా నిలిచిందని, కానీ నేడు అందుబాటులో ఉన్న గణాంకాలు బ్యాంకులపై ఉన్న ఒత్తిడిని వాస్తవిక రీతిలో ప్రతిబింబించడం లేదని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులను అందిపుచ్చుకొని మూలధన అవసరాలను అధిగమించేందుకు, వ్యాపార విధానాలను మార్చుకునేందుకు బ్యాంకులు కృషి చేయాలని, ఇది భవిష్యత్తులో వాటికి ఎంతో ఉపయోగపడుతుందని శక్తికాంత దాస్ సూచించారు.
తాజావార్తలు
- అతివేగం.. మద్యం మత్తు
- ఓటీపీలు తెలుసుకొని ఖాతా ఖాళీ
- ఒకరి పాన్‌కార్డుపై మరొకరికి రుణం
- భక్తజన జాతర
- అవుషాపూర్ మహిళల విజయాన్ని రాష్ట్ర వ్యాప్తం చేయాలి
- ఆర్యవైశ్యులకు ఎనలేని ప్రాధాన్యం
- ఏ ఇంటి చెత్త ..ఆ ఇంట్లోనే ఎరువు..
- కుల వృత్తులకు పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి
- కరోనా వారియర్లు నిజమైన దేవుళ్లు
- దివ్యాంగ క్రీడాకారుల కోసం..