శనివారం 06 జూన్ 2020
Business - Apr 28, 2020 , 00:52:30

ఫండ్స్‌కు ఆర్బీఐ బూస్ట్‌

ఫండ్స్‌కు ఆర్బీఐ బూస్ట్‌

  • రూ.50 వేల కోట్ల ప్రత్యేక నిధి
  • బ్యాంకుల ద్వారా మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలకు రుణాలు

ముంబై, ఏప్రిల్‌ 27: మ్యూచువల్‌ ఫండ్స్‌ కోసం ఆర్బీఐ సోమవారం రూ.50 వేల కోట్ల ప్రత్యేక ద్రవ్య సదుపాయాన్ని ప్రకటించింది. ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ రుణ పథకాల మూసివేత నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యతను సంతరించుకున్నది. కరోనా వైరస్‌ నేపథ్యంలో దేశీయ స్టాక్‌ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మార్కెట్‌ పెట్టుబడుల ఆధారంగా నడిచే మ్యూచువల్‌ ఫండ్‌ పరిశ్రమ విపరీతంగా ఒత్తిడిని ఎదుర్కొంటున్నది. ఇటీవల అమెరికాకు చెందిన ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ మ్యూచువల్‌ ఫండ్‌ భారతీయ మార్కెట్‌లో 6 రుణ పథకాలను మూసేసిన సంగతీ విదితమే. దీంతో పరిశ్రమకు దన్నుగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఈ నిధులను అందుబాటులోకి తెచ్చింది. ‘మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలపై ద్రవ్యపరమైన ఒత్తిడి దృష్ట్యా దాన్ని తగ్గించేందుకే రూ.50 వేల కోట్ల ప్రత్యేక సాయాన్ని అందిస్తున్నాం’ అని ఓ ప్రకటనలో ఆర్బీఐ తెలిపింది.

ఆర్బీఐ ఏం చేస్తుంది?

తొలుత బ్యాంకులకు తక్కువ వడ్డీరేటుకే ఈ నిధులను ఆర్బీఐ అందిస్తుంది. ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందులు, నిధుల కొరతను ఎదుర్కొంటున్న మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలకు బ్యాంకులు ఆ నిధులను వివిధ మార్గాల్లో చేరవేస్తాయి. మే 11 వరకు లేదా రూ.50 వేల కోట్ల నిధుల వినియోగం పూర్తయ్యేదాకా ఏది త్వరగా జరిగితే అప్పటివరకు ఈ ప్రత్యేక సాయం అందుబాటులో ఉంటుందని ఆర్బీఐ తెలియజేసింది. ఫిక్స్‌డ్‌ రెపో రేటు వద్ద 90 రోజులపాటు రెపో కార్యకలాపాలను ఆర్బీఐ నిర్వహించనున్నది. సోమవారం నుంచి శుక్రవారం వరకు నిధులను పొందడానికి బ్యాంకులు ఎప్పుడైనా ఆర్బీఐకి తమ బిడ్లను దాఖలు చేయవచ్చు. పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ తగు చర్యలు తీసుకుంటామని, అవసరమైతే ఏ రకమైన సాయానికైనా వెనుకాడబోమని ఈ సందర్భంగా ఆర్బీఐ స్పష్టం చేసింది.

మదుపరికి ధైర్యం

మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థల కోసం ఆర్బీఐ ప్రకటించిన రూ.50 వేల కోట్ల సాయం.. మదుపరులలో విశ్వాసాన్ని పెంపొందించగలదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కరోనా వైరస్‌ విజృంభణ, లాక్‌డౌన్‌, దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనం, స్టాక్‌ మార్కెట్ల పతనం.. మదుపరులను పెట్టుబడుల ఉపసంహరణకు ఉసిగొల్పుతున్నాయి. దీంతో మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థల చుట్టూ ఒక్కసారిగా సంక్షోభ పరిస్థితులు ఏర్పడ్డాయి. గత నెలాఖరుదాకా దేశీయ మ్యూచువల్‌ ఫండ్‌ పరిశ్రమ ఆధ్వర్యంలోని ఆస్తుల విలువ రూ.22,26,203 కోట్లుగా ఉన్నది.


logo