సోమవారం 10 ఆగస్టు 2020
Business - Jul 21, 2020 , 14:36:22

భ‌విష్య‌త్తులో టాటా అధినేత ఎవ‌రైనా కావొచ్చు..

భ‌విష్య‌త్తులో టాటా అధినేత ఎవ‌రైనా కావొచ్చు..

హైద‌రాబాద్‌: టాటా ట్ర‌స్టుకు సంబంధించి ర‌త‌న్ టాటా కీల‌క విష‌యాన్ని వెల్ల‌డించారు.  భ‌విష్య‌త్తులో టాటా ట్ర‌స్టుకు.. కుటుంబంతో సంబంధం లేని వ్య‌క్తి చైర్మ‌న్ అయ్యే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలిపారు. సుప్రీంకోర్టుకు ఆయ‌న ఈ విష‌యాన్ని చెప్పారు. టాటా ట్ర‌స్టుల‌న్నింటికీ ప్ర‌స్తుతం తానే చైర్మన్ అని, భ‌విష్య‌త్తులో ఎవ‌రైనా కావ‌చ్చు అని, టాటా ఇంటి పేరు ఉన్న‌వాళ్లే కావాల‌ని ఏమీ లేదు అని, ఓ వ్య‌క్తి జీవితం కొంత కాల‌మే ఉంటుంద‌ని, కానీ సంస్థ‌లు మాత్రం ఎల్ల‌కాలం ఉంటాయ‌ని ర‌త‌న్ టాటా అన్నారు. టాటా ట్ర‌స్టుపై టాటా ఫ్యామిలీ స‌భ్యుల‌కే హ‌క్కులు ఉండాల‌న్న నిబంధ‌న ఏదీ లేద‌ని ర‌త‌న్ టాటా చెప్పారు. 

సైర‌స్ ఇన్వెస్ట్‌మెంట్స్ దాఖ‌లు చేసిన పిటిష‌న్‌కు బ‌దులిస్తూ ర‌త‌న్ టాటా ఈ స‌మాధానం ఇచ్చారు. ప్ర‌స్తుతం టాటా స‌న్స్ సంస్థ‌కు చైర్మ‌న్‌గా ఉన్న ఎన్ చంద్ర‌శేక‌ర‌న్‌.. త‌మ కుటుంబ‌స‌భ్యుడు కాదు అని ర‌త‌న్ తెలిపారు. టాటా కుటుంబానికి సంబంధించినంత వ‌ర‌కు టాటా స‌న్స్ కంపెనీపై ఎవ‌రికీ ప్ర‌త్యేక హ‌క్కులు లేవ‌ని, కంపెనీ చ‌ట్టాల ప్ర‌కారం కేవ‌లం షేర్‌హోల్డ‌ర్ హ‌క్కులు మాత్ర‌మే వారికి వ‌ర్తిస్తాయ‌న్నారు.  టాటా స‌న్స్ సంస్థ‌లో త‌న‌కు, త‌న బంధువుల‌కు కేవ‌లం మూడ శాతం వాటా ఉన్న‌ట్లు ఆయ‌న తెలిపారు. టాటా ట్ర‌స్ట్స్ మేనేజ్మెంట్‌ను వ్య‌వ‌స్థీక‌రించేందుకు ర‌త‌న్ టాటా ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు తెలుస్తోంది. వివిధ రంగాలకు చెందిన నిష్ణాతులు, ప్ర‌ముఖుల‌తో క‌మిటీని ఏర్పాటు చేయాల‌ని ర‌త‌న్ టాటా భావిస్తున్నారు. 


logo