గురువారం 24 సెప్టెంబర్ 2020
Business - Aug 09, 2020 , 01:40:02

ప్రపంచ కుబేరుల్లో నాలుగో స్థానం

ప్రపంచ కుబేరుల్లో నాలుగో స్థానం

  • 80.6 బిలియన్‌ డాలర్లతో రిలయన్స్‌ అధినేత
  • బ్లూంబర్గ్‌ బిలియనీర్స్‌ తాజా జాబితా

న్యూఢిల్లీ, ఆగస్టు 8: భారతీయ అపర కుబేరుడు ముకేశ్‌ అంబానీ.. ప్రపంచ సంపన్నుల జాబితాలో దూసుకుపోతున్నారు. బ్లూంబర్గ్‌ బిలియనీర్స్‌ సూచీలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) అధిపతి నాల్గవ స్థానానికి ఎగబాకారు. టాప్‌-500 బిలియనీర్లతో విడుదలైన ఈ తాజా జాబితాలో ముకేశ్‌ సంపద 80.6 బిలియన్‌ డాలర్లుగా ఉన్నది. అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌, మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌, ఫేస్‌బుక్‌ సారథి మార్క్‌ జూకర్‌బర్గ్‌లు మాత్రమే ఈ జాబితాలో ముకేశ్‌ కంటే ముందున్నారు. నిజానికి దశాబ్దాలుగా ప్రపంచ టాప్‌-5 కుబేరుల్లో అమెరికన్లే ఉంటున్నారు. లేదంటే ఒకరిద్దరు యూరోపియన్లకు స్థానం లభిస్తున్నది. ఎప్పుడో ఒకసారి మెక్సికన్‌ కనిపిస్తున్నారు. కానీ ఇప్పుడు ఆసియా ఖండానికి చెందిన, అదీ ఓ భారతీయుడు ఉండటం తొలిసారి.

స్టాక్‌ మార్కెట్‌లో హవా

కరోనాతో కుదేలవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్లకు ఈ ఏడాది రిలయన్సే ఓ ఆశా కిరణంగా నిలిచింది. ముకేశ్‌ భారీ డీల్స్‌.. మదుపరులను అమ్మకాల ఒత్తిడి నుంచి పెట్టుబడుల వైపునకు మళ్లించాయి. ఈ క్రమంలోనే ఈ ఏడాది మార్చిలో రూ.867.82గా ఉన్న ఆర్‌ఐఎల్‌ షేర్‌ విలువ.. ప్రస్తుతం రూ.2,146కు చేరింది. దీంతో గడిచిన 5-6 నెలల్లో రిలయన్స్‌ షేర్‌ విలువ 145 శాతానికిపైగా ఎగబాకినైట్లెంది. ఇదే ప్రపంచ కుబేరుల్లో ముకేశ్‌ అంబానీని టాప్‌-4లో కూర్చోబెట్టింది. మరోవైపు ప్రస్తుతం టాప్‌-5వ స్థానంలో ఉన్న ఆర్నాల్ట్‌కు చెందిన ఎల్‌వీఎంహెచ్‌ కంపెనీ షేర్ల విలువ ఈ ఏడాది 25.1 బిలియన్‌ డాలర్లు పడిపోయింది. ఈ పరిణామం కూడా ముకేశ్‌కు లాభించింది.


logo