సోమవారం 30 మార్చి 2020
Business - Jan 31, 2020 , 01:36:37

బజాజ్‌లో కీలక మార్పులు

బజాజ్‌లో కీలక మార్పులు
  • నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా రాహుల్‌ బజాజ్‌
  • ఆయన సారథ్యంలో రూ.7 కోట్ల నుంచి 12 వేల కోట్లకు

న్యూఢిల్లీ, జనవరి 30: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్‌ ఆటో యాజమాన్యంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఐదు దశాబ్దాల పాటు కంపెనీలో కీలక పదవీ బాధ్యతలు నిర్వహించిన రాహుల్‌ బజాజ్‌ ఇక నుంచి నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. ఏప్రిల్‌ 1, 1970 నుంచి డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న రాహుల్‌ బజాజ్‌ను ఏప్రిల్‌ 1, 2015 నుంచి ఐదేండ్ల పాటు తిరిగి బోర్డు సభ్యుడిగా నియమితులయ్యారు. ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా నియమితులైన ఆయన పదవి కాలం మార్చి 31 నాటికి పూర్తికానున్నాది. ఆర్థిక ఫలితాల సందర్భంగా గురువారం సమావేశమైన కంపెనీ బోర్డు ఈ కీలక నిర్ణయం తీసుకున్నది. 1965లో రూ.7.2 కోట్ల టర్నోవర్‌గా ఉన్న బజాజ్‌ గ్రూపు టర్నోవర్‌ ఆయన సారథ్యంలో రూ.12 వేల కోట్ల టర్నోవర్‌కు ఎదిగింది. ఆయన కుమారుడు రాజీవ్‌ బజాజ్‌ రంగ ప్రవేశం చేసిన 2005 నుంచి బజాజ్‌కి దూరంగా ఉంటూ వచ్చిన రాహుల్‌..భవిష్యత్తులో పూర్తిగా వైదొలుగనున్నారు. మరోవైపు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.7,639.66 కోట్ల ఆదాయంపై రూ.1,322.44 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభాన్ని ఆర్జించింది బజాజ్‌ ఆటో.  కన్సాలిడేటెడ్‌ లాభాల్లో 8.33 శాతం పెరుగగా, ఆదాయంలో మూడు శాతం వృద్ధిని నమోదు చేసుకున్నది. గత త్రైమాసికంలో 12,02,486 యూనిట్ల వాహనాలను విక్రయించింది. 


logo