న్యూఢిల్లీ, ఏప్రిల్ 29:ప్రముఖ వాహన సంస్థ బజాజ్ ఆటో చైర్మన్ పదవికి రాహుల్ బజాజ్ రాజీనామా చేశారు. ఆయన స్థానంలో నిరాజ్ బజాజ్ నియమితులయ్యారు. చైర్మన్ పదవికి రాజీనామా చేసినప్పటి కంపెనీ గౌరవ చైర్మన్‌గా రాహుల్ వ్యవహరించనున్నారు. ఈ నియామకం వచ్చే నెల 1 నుంచి ఐదేండ్ల పాటు అమలులో ఉండనున్నదని సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది. చైర్మన్‌తోపాటు నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పదవికి రాజీనామా ఈ నెల 30 నుంచి అమలులోకి రానున్నది. 1972 నుంచి చైర్మన్‌గా వ్యవహరిస్తున్న రాహుల్ బజాజ్ నాయకత్వంలో సంస్థ అన్ని విభాగాల్లో మెరుగైన పనితీరు కనబరిచింది.
15 శాతం పెరిగిన లాభం
మరోవైపు, బజాజ్ ఆటో ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.1,551 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. 2019-20 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.1,354 కోట్ల లాభంతో పోలిస్తే 15 శాతం అధికం. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 26 శాతం పెరిగి రూ.8,596 కోట్లకు చేరుకున్నట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది. అలాగే రూ.10 ముఖ విలువ కలిగిన ప్రతిషేరుకు రూ.140 లేదా 1,400 శాతం డివిడెండ్‌ను బోర్డు ప్రతిపాదించింది.