ఆదివారం 09 ఆగస్టు 2020
Business - Jul 13, 2020 , 14:46:59

రిలయన్స్ జియోలో క్వాల్కామ్ వెంచర్స్ పెట్టుబడి

రిలయన్స్ జియోలో క్వాల్కామ్ వెంచర్స్ పెట్టుబడి

న్యూఢిల్లీ : ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ జియో ప్లాట్‌ఫామ్‌లో క్వాల్కామ్ వెంచర్స్ రూ .730 కోట్లు పెట్టుబడి పెట్టనున్నది. ఈ పెట్టుబడితో జియో ప్లెట్‌ఫామ్ లో క్వాల్కామ్ వెంచర్స్ వాటా 0.15 శాతంగా ఉంటుంది. ఈ మేరకు రిలయన్స్ ఇండస్ట్రీస్, జియో ప్లాట్‌ఫాంలు ఒక ప్రకటన విడుదల చేశాయి.

జియో ప్లాట్‌ఫామ్‌ల కోసం క్వాల్కామ్ వెంచర్స్ పెట్టుబడి కోసం రూ. 4.91 లక్షల కోట్ల ఈక్విటీ విలువతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఒప్పందం జియో ప్లాట్‌ఫామ్‌ల ఎంటర్‌ప్రైజ్ విలువను రూ. 5.16 లక్షల కోట్లకు చేరుస్తున్నది. క్వాల్కామ్ వెంచర్స్ అనేది క్వాల్కమ్ ఇన్కార్పొరేటెడ్ సంస్థ యొక్క పెట్టుబడి విభాగం.

రూ. 1,18,318.45 కోట్లు సేకరించిన జియో

జియో ప్లాట్‌ఫామ్‌లలో 25.24 శాతం వాటాను విక్రయించడం ద్వారా ఆర్‌ఐఎల్ రూ. 1,18,318.45 కోట్లను సేకరించింది. ఈ మొత్తాన్ని 13 పెట్టుబడుల ద్వారా సేకరించారు. ఫేస్‌బుక్ ఇందులో అతిపెద్ద పెట్టుబడిగా ఉంది. జియో ప్లాట్‌ఫామ్స్‌లో 9.99% వాటా కోసం ఫేస్‌బుక్ రూ. 43,573.62 కోట్లు పెట్టుబడి పెట్టింది. దీనితోపాటు సిల్వర్ లేక్, విస్టా ఈక్విటీ, జనరల్ అట్లాంటిక్, కేకేఆర్, ముబాడాలా, అబుదాబి ఇన్వెస్ట్మెంట్, టీపీజీ, ఎల్ కాటర్టన్, పీఐఎఫ్, ఇంటెల్ క్యాపిటల్, క్వాల్కామ్ వెంచర్స్ కూడా పెట్టుబడులు పెట్టాయి.

జియో ప్లాట్‌ఫాంలు రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క డిజిటల్ అనుబంధ సంస్థ. సంస్థ ఆర్ఐఎల్ గ్రూప్ యొక్క డిజిటల్ వ్యాపార ఆస్తులైన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్, జియో యాప్స్, హాప్టిక్, రివైర్, ఫైండ్, నౌఫ్లోట్స్, హాత్వే, డీఏఎన్ వంటి అనేక సంస్థలను నిర్వహిస్తున్నది.


logo