బుధవారం 23 సెప్టెంబర్ 2020
Business - Aug 12, 2020 , 23:58:05

పీఎన్‌బీకి ఉద్దేశపూర్వక షాక్‌లు

పీఎన్‌బీకి ఉద్దేశపూర్వక షాక్‌లు

రూ.37 వేల కోట్లకుపైగా రుణాలను ఎగ్గొట్టిన 1,787 బడా కంపెనీలు

న్యూఢిల్లీ: ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారులతో దేశీయ బ్యాంకులకు వాటిల్లుతున్న నష్టాలు నానాటికీ భారీగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది జూన్‌ నెలాఖరు నాటికి విన్సమ్‌ డైమండ్‌ అండ్‌ జువెల్లరీ, గీతాంజలి జెమ్స్‌, ఏబీజీ షిప్‌యార్డ్‌ లాంటి 1,787 బడా కంపెనీలు తమకు రూ.37,020.27 కోట్ల బకాయిలను ఎగ్గొట్టినట్టు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) ప్రకటించింది. ఈ జాబితాలో ప్రముఖ ఆర్థిక నేరగాడు మెహుల్‌ చోక్సీ నేతృత్వంలోని గీతాంజలి జెమ్స్‌ రూ.5,064.84 కోట్ల ఎగవేతతో అగ్రస్థానాన్ని దక్కించుకోగా.. గీతాంజలి గ్రూపునకే చెందిన గిలీ ఇండియా, నక్షత్ర బ్రాండ్లు (రూ.2,556 కోట్లు), చండీగఢ్‌కు చెందిన కుడోస్‌ కెమీ లిమిటెడ్‌ (రూ.1,418 కోట్లు) వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. రూ.1,000 కోట్లకు పైగా రుణాలను ఎగ్గొట్టిన ఇతర బడా సంస్థల్లో ఏబీజీ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ (రూ.1,193.37 కోట్లు), జతిన్‌ మెహతా నేతృత్వంలోని విన్సమ్‌ డైమండ్‌ అండ్‌ జువెల్లరీ (రూ.1,036.85 కోట్లు) ఉన్నట్టు పీఎన్‌బీ తన వెబ్‌సైట్‌లో వెల్లడించింది. వీటితోపాటు స్టెర్లింగ్‌ గ్లోబల్‌ ఆయిల్‌ రిసోర్సెస్‌ లిమిటెడ్‌ (రూ.755 కోట్లు), జూమ్‌ డెవలపర్స్‌ (రూ.702 కోట్లు), లిక్కర్‌ కింగ్‌ విజయ్‌ మాల్యాకు చెందిన కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ (రూ.522.48 కోట్లు), జస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ పవర్‌ లిమిటెడ్‌ (రూ.453.96 కోట్లు) భారీగా రుణాలను ఎగ్గొట్టినట్టు ఆ బ్యాంకు ప్రకటించింది. 


logo