మంగళవారం 26 మే 2020
Business - May 20, 2020 , 23:44:38

రెడ్డీస్‌ 500 శాతం డివిడెండ్‌

రెడ్డీస్‌ 500 శాతం డివిడెండ్‌

  • క్యూ4లో 76 శాతం పెరిగిన లాభం   
  •  రూ.4,432 కోట్లకు చేరుకున్న ఆదాయం

హైదరాబాద్‌, బిజినెస్‌ డెస్క్‌: ప్రముఖ ఔషధాల తయారీ సంస్థ డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌ అంచనాలకుమించి ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన మూడు నెలలకాలానికిగాను సంస్థ రూ.764.20 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే సమయంలో నమోదైన రూ.434.40 కోట్ల లాభంతో పోలిస్తే 76 శాతం వృద్ధి నమోదైంది. అంతర్జాతీయంగా జనరిక్‌ ఔషధాలు భారీ వృద్ధిని నమోదు చేసుకోవడం, పన్ను వాయిదా పడటంతో లాభాలు దూసుకుపోవడానికి కారణమని కంపెనీ ప్రెసిడెంట్‌, సీఎఫ్‌వో సౌమెన్‌ చక్రవర్తి తెలిపారు. జనవరి-మార్చి మధ్యకాలానికిగాను కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 10 శాతం ఎగబాకి రూ.4,431.8 కోట్లకు చేరుకున్నట్లు ఆయన చెప్పారు. క్రితం ఏడాది ఇది రూ.4,016.60 కోట్లుగా ఉన్నది. వాటాదారులకు భారీ ఊరటనిచ్చే నిర్ణయాన్ని సంస్థ ప్రకటించింది. గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను రూ.5 ముఖ విలువ కలిగిన ప్రతిషేరుకు రూ.25 లేదా 500 శాతం తుది డివిడెండ్‌ను సంస్థ ప్రకటించింది. ఇందుకు సంబంధించి కంపెనీ బోర్డు బుధవారం సమావేశమై గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. అంతర్జాతీయంగా జనరిక్‌ ఔషధాలను విక్రయించడం ద్వారా రూ.3,640 కోట్ల ఆదాయం సమకూరినట్లు ఆయన చెప్పా రు.  “గడిచిన ఆర్థిక సంవత్సరం అన్ని విభాగాల్లో మెరుగైన వృద్ధిని సాధించాం. కీలక ఔషధాలను మార్కెట్లోకి విడుదల చేయడం, ఉత్ప త్తి సామర్థ్యం పెంచుకోవడంతో వ్యాపార రంగంలో రాణించగలిగాం” అని కంపెనీ కో-చైర్మన్‌, ఎండీ జీవీ ప్రసాద్‌ వెల్లడించారు. 

  • ఉత్తర అమెరికాలో రూ.1,807 కోట్ల  విక్రయాలు జరిపింది.
  • యూరప్‌లో అమ్మకాల ద్వారా రూ.344.6 కోట్లు లభించాయి
  • భారత్‌లో రూ.683.90 కోట్ల విక్రయాలు జరిపింది. 
  • అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సేల్స్‌  రూ.804.2 కోట్లు లభించాయి. 
  • ప్రపంచవ్యాప్తంగా జనరిక్‌ ఔషధాలు విక్రయించడంతో సంస్థకు రూ.3,639.8 కోట్లు సమకూరాయి.
  • కంపెనీ షేరు ధర 3.11 శాతం లాభపడి రూ.3,814 వద్ద ముగిసింది. 


logo