గురువారం 29 అక్టోబర్ 2020
Business - Sep 22, 2020 , 02:55:33

పీఎస్‌బీలను ప్రైవేటీకరించాలి

పీఎస్‌బీలను ప్రైవేటీకరించాలి

న్యూఢిల్లీ: దేశీయ బ్యాంకింగ్‌ వ్యవస్థ ప్రస్తుతం అనేక సమస్యలతో సతమతమవుతున్నదని రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌, మాజీ డిప్యూటీ గవర్నర్‌ విరల్‌ ఆచార్య ఆందోళన వ్యక్తం చేశారు. వీటిని పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే నడుము బిగించాల్సిన అవసరమున్నదని పేర్కొన్నారు. ప్రభుత్వ రంగంలోని కొన్ని బ్యాంకు (పీఎస్‌బీ)లను ప్రైవేటీకరించడంతోపాటు నిరర్థక ఆస్తుల (ఎన్‌పీఏ) సమస్యను పరిష్కరించేందుకు బ్యాడ్‌ బ్యాంక్‌ను ఏర్పాటు చేయాలని, బ్యాంకుల పాలనా వ్యవహారాల్లో ప్రభుత్వ ప్రమేయాన్ని తగ్గించుకోవాలని సూచించారు. పదేపదే మూలధన నిధులను సమకూర్చాలిసన అవసరం లేకుండానే బ్యాంకుల పాలనా వ్యవహారాలను, వాటి పనితీరును మెరుగుపరిచేందుకు ఈ సంస్కణరలు ఎంతో అవసరమన్నారు. ‘ఇండియన్‌ బ్యాంక్స్‌: ఏ టైమ్‌ టు రిఫార్మ్‌' పేరుతో సంయుక్తంగా రూపొందించిన ఓ పత్రంలో రాజన్‌, ఆచార్య ఈ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ‘ఆర్థిక, సాంకేతిక నైపుణ్యం కలిగిన ప్రైవేట్‌ పెట్టుబడిదారులను బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి తీసుకురావాలి. బ్యాంకుల్లో భారీ వాటాలను సొంతం చేసుకోకుండా కార్పొరేట్‌ సంస్థలను నిరోధించి పరస్పర ప్రయోజనాలకు తావులేకుండా చూడాలి’ అని ఆ పత్రంలో ఉద్ఘాటించారు.

మొండి బాకీలకు మందు ఇదీ..

మొండి బాకీల సమస్యను పరిష్కరించేందుకు రాజన్‌, ఆచార్య మూడు సూచనలు చేశారు. రుణదాతలకు, దివాలా తీసిన సంస్థలకు మధ్య నిర్దేశిత కాలవ్యవధిలోగా చర్చలకు వీలుకల్పించి కోర్టు వెలుపలే సమస్య పరిష్కారమయ్యేలా చూసేందుకు తగిన వ్యవస్థలను అందుబాటులోకి తీసుకురావాలని, అక్కడ సమస్య పరిష్కారం కానప్పుడే నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించేలా చూడాలని అన్నారు. అంతేకాకుండా నిరర్థక ఆస్తుల అమ్మకం కోసం ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం పరిశీలన జరుపాలని, దీనికి తోడుగా బ్యాడ్‌ బ్యాంకులను ఏర్పాటుచేసి ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌కు సమాంతరంగా ప్రోత్సహించాలని పేర్కొన్నారు.logo