సోమవారం 10 ఆగస్టు 2020
Business - Jul 10, 2020 , 00:44:51

భారత్‌లో పెట్టుబడులు పెట్టండి

భారత్‌లో పెట్టుబడులు పెట్టండి

  • వ్యవసాయ, రక్షణ, అంతరిక్ష్య రంగాల్లో అపార అవకాశాలు
  • ఇండియా గ్లోబల్‌ వీక్‌ 2020లో అంతర్జాతీయ సంస్థలకు ప్రధాని మోదీ పిలుపు

న్యూఢిల్లీ, జూలై 9: భారత్‌లో పెట్టుబడులకు కొదవే లేదని, ఆరోగ్యకర, ఆదర్శనీయ పోటీ వ్యాపార పరిస్థితులుంటాయని, వీటిని అందిపుచ్చుకోవాలంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అంతర్జాతీయ సంస్థలకు పిలుపునిచ్చారు. గురువారం జరిగిన ‘ఇండియా గ్లోబల్‌ వీక్‌ 2020’లో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరోనా వైరస్‌తో కుప్పకూలిన దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి గ్లోబల్‌ కంపెనీల పెట్టుబడులతో నిర్మించాలన్న ఆశయాన్ని కనబరిచారు. ఈ క్రమంలోనే దేశంలో పెట్టుబడులకు అనువైన వాతావరణం ఉందని తెలియజేశారు. వ్యవసాయ, రక్షణ, అంతరిక్ష్య రంగాల్లో పెట్టుబడులకు అపార అవకాశాలున్నాయని తెలిపారు. తమ ప్రభుత్వం తీసుకున్న సంస్కరణలతో ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయని మోదీ అన్నారు. జీడీపీలో కీలకమైన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలకు ఆర్థిక చేయూతనిస్తున్నారు.

మోదీ ప్రసంగంలో ముఖ్యాంశాలు...

  • ప్రపంచ వృద్ధిలో ఇకపైనా భారత్‌ది కీలక పాత్రే
  • భారతీయుల ప్రతిభ, భారత సంస్కరణలపైనే గ్లోబల్‌ జీడీపీ పురోగతి ఆధారం
  • ప్రతిభకు పుట్టినిల్లు భారత్‌, నూతన సాంకేతికతకు త్వరగా రూపాంతరం చెందడం మన ప్రత్యేకత
  • భారతీయ టెక్నాలజీ పరిశ్రమ, నిపుణుల దశాబ్దాల కృషి ప్రశంసనీయం
  • భారతీయులు సహజమైన సంస్కర్తలు.. ప్రతీ సవాల్‌ను భారత్‌ అధిగమించిందని చరిత్రే చెప్తున్నది
  • అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయగల సమర్థులు భారతీయులు
  • కరోనాతో చతికిలబడ్డ దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి సమర్థవంతమైన ఉద్దీపనలను ప్రకటించాం
  • విశ్వ ఆర్థికాభివృద్ధికి ఏం కావాలో అది చేయడానికి భారత్‌ సిద్ధం


logo