పరిశ్రమలకు పెద్దపీట

- విద్యుత్, శాంతిభద్రతల సమస్యలకు శాశ్వత పరిష్కారం.. దేశంలో ఎక్కడా లేనివిధంగా టీఎస్ ఐ-పాస్
- ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో అభృవృద్ధిలో దూకుడు.. కేంద్ర ప్యాకేజీలతో ఎవ్వరికీ లేని ప్రయోజనం
- రాష్ట్రంపై మోదీ సర్కారు చిన్నచూపు.. ఎఫ్టీఐఐసీ అవార్డుల కార్యక్రమంలో మంత్రి కే టీ రామారావు
- అభివృద్ధి, సంక్షేమంలో దూసుకెళ్తున్న రాష్ట్రం
హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): పారిశ్రామిక రంగానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నదని పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కే తారక రామారావు పునరుద్ఘాటించారు. అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రం వేగంగా ముందుకు సాగుతున్నదని, సాగునీరు, తాగునీటి రంగంలో దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రగతి సాధించామని తెలిపారు. ముఖ్యంగా విద్యుత్, శాంతిభద్రతల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించినట్లు చెప్పారు. శనివారం తెలంగాణ వాణిజ్య, పారిశ్రామిక మండళ్ళ సమాఖ్య (ఎఫ్టీఐఐసీ) ఆధ్వర్యంలో ఫ్యాప్సీ భవన్లో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై పారిశ్రామికవేత్తలకు ఎక్సలెన్స్ అవార్డులిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టినవారి పరిస్థితి ఎలా ఉంటుందని ఏడేళ్ల క్రితం సర్వత్రా సందేహాలు వ్యక్తం చేశారని, దీనివల్ల పారిశ్రామికవేత్తలేకాదు వాటిల్లో పనిచేసే ఉద్యోగులు, కార్మికులు కూడా చాలా ఇబ్బంది పడేవారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత పరిస్థితి పూర్తిగా మారిపోయిందని, సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం మొదటి ఆరు నెలల్లోనే విద్యుత్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించిందని గుర్తుచేశారు. ఒక్క విద్యుత్ సమస్యే కాదని, కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం అన్ని రంగాల్లోనే ఎంతో అభివృద్ధిని సాధించిందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఇన్నోవేషన్, క్వాలిటీ ఆఫ్ లీవింగ్, స్కిల్ డెవలప్మెంట్, ఉద్యోగ కల్పన.. ఇలా ఏ రంగంలో చూసుకున్నా దేశంలోని టాప్-3 రాష్ర్టాల్లో మన రాష్ర్టానికి చోటు దక్కుతున్నదని, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి ఇదొక నిదర్శనమన్నారు.
ఎక్కడా లేనివిధంగా టీఎస్-ఐపాస్....
దేశంలో ఎక్కడా లేనివిధంగా టీఎస్ ఐ-పాస్ విధానాన్ని ప్రవేశపెట్టి సింగిల్ విండో ద్వారా పరిశ్రమలకు 15రోజుల్లోగా అనుమతులిస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. ఈ టీఎస్ ఐ-పాస్ ద్వారా 13,826 పరిశ్రమలకు అనుమతులు ఇచ్చినట్లు, తద్వారా రూ.2.60 లక్షల కోట్లకు పైచిలుకు పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. వీటిద్వారా సుమారు 14.5 లక్షలమందికిపైగా ఉద్యోగావకాశాలు లభించాయన్నారు.
దేశాన్ని తయారీ రంగం హబ్‌గా తీర్చిదిద్దాలి..
చైనా నుంచి కంపెనీలు ఇతర ప్రాంతాలకు తరలుతున్నట్లు చెప్తున్నారని, భారత్ తయారీ రంగంలో డెస్టినేషన్‌గా మారితే అవి ఇక్కడికి వస్తాయని మంత్రి కేటీఆర్ అన్నారు. కేంద్రం సహకరిస్తే తెలంగాణలో 19వేల ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఫార్మాసిటీకి మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశముందన్నారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు పేరుతో దేశంలోనే అతిపెద్ద టెక్స్టైల్ పార్కును వరంగల్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అయినా ఫార్మాసిటీకి , టెక్స్టైల్ పార్కుకు కేంద్రం ఎటువంటి సహకారం అందించడం లేదన్నారు. హైదరాబాద్‌కు 20 13లో ఐటీఐఆర్ ప్రాజక్టు మంజూరైందని, కేంద్రం దీన్ని ఏం చేసిందో అర్థం కావడం లేదన్నారు.
ఇండస్ట్రీకి బంపర్ ఆఫర్
80 % స్థానికులకు ఉద్యోగాలిస్తే రాయితీలు !
కార్పొరేట్ సంస్థలకు మంత్రి కేటీఆర్ బంఫర్ ఆఫర్ ఇచ్చారు. స్థానిక ప్రజలకు భారీగా ఉద్యోగావకాశాలు కల్పించే సంస్థలకు అదనపు రాయితీలు ఇస్తామని ప్రకటించారు. పారిశ్రామిక వేత్తలు సాధ్యమైనంత ఎక్కువ మంది స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించాలని సూచించారు. పలు రాష్ర్టాలు 75% ఉద్యోగాలు స్థానికులకే కేటాయించాలని విధాన నిర్ణయాలు చేశాయని, కానీ మన రాష్ట్రంలో అటువంటి నెగిటివ్ విధానం చేయకపోయినప్పటికీ ఉద్యోగాల్లో 80% స్థానికులకు ఇచ్చేందుకు ప్రయత్నించాలని కోరారు. ఇలాచేస్తే మేము అదనపు రాయితీలు కల్పిస్తామన్నారు. ఇక తెలంగాణ అకాడమీ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్)తో కలిసి పనిచేయాలని పారిశ్రామికవేత్తలకు విజ్ఞప్తిచేశారు. దీనిద్వారా మన అవసరాలకు తగ్గట్టుగా యువతకు శిక్షణను ఇప్పిస్తామన్నారు. ఉత్పాదక రంగానికి రాష్ట్రంలో మంచి అవకాశాలు ఉన్నాయని, పెద్ద పెద్ద బహుళజాతి కంపెనీలు ఇక్కడి సంస్థలతో భాగస్వామ్యమై ఇక్కడ కూడా వాటిని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కృషిచేస్తున్నదన్నారు. ఏయే రంగంలో ఇటువంటి అవకాశాలు ఉన్నాయో గుర్తించి ప్రభుత్వానికి జాబితా ఇవ్వాలని పారిశ్రామికవేత్తలకు మంత్రి కేటీఆర్ సూచించారు.
కేంద్రం చేతల్లో చూపాలి
కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్ పేరుతో పరిశ్రమలకు రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించినప్పటికీ ఒక్కరికి కూడా ఆ ప్రయోజనం దక్కలేదని మంత్రి కేటీఆర్ అన్నారు. కేంద్రం మాటలకు పరిమితం కాకుండా చేతల్లో చూపాలన్నారు. పరిశ్రమలను ఆదుకునేందుకు వచ్చే బడ్జెట్లోనైనా చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థను, జీడీపీని మళ్లీ పట్టాలెక్కించేందుకు కృషిచేయాలన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణకు మంచి ర్యాంకులు ఇస్తున్నప్పటికీ కేటాయింపుల విషయంలో మాత్రం చిన్నచూపు చూస్తున్నదని విమర్శించారు. ఇండస్ట్రియల్ కారిడార్, హైస్పీడ్ రైలు, డిఫెన్స్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కారిడార్ మంజూరు కావడం లేదని, వీటిపై కేంద్రానికి లేఖలు రాసినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
తాజావార్తలు
- రాష్ట్రంలో కొత్తగా 168 కరోనా కేసులు
- మోదీ ర్యాలీలో గంగూలీ.. ఆయన ఇష్టమన్న బీజేపీ
- ఎములాడ రాజన్న.. మోదీ మనసు మార్చు
- చంద్రుడిని చుట్టొద్దాం.. దరఖాస్తు చేసుకోండి
- శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత
- తప్పుకున్న నీరా టండన్.. బైడెన్‌కు చుక్కెదురు
- దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు
- అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 15 మంది దుర్మరణం
- శంషాబాద్ విమానాశ్రయంలో బుల్లెట్ల కలకలం
- 9 నుంచి ఇంద్రకీలాద్రిపై మహాశివరాత్రి ఉత్సవాలు