పీఎన్బీ, బీవోబీ ప్రైవేటీకరణ?

- మరో జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ కూడా.. బడ్జెట్ సంకేతాలు
ముంబై, ఫిబ్రవరి 2: ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ దిశగా మోదీ సర్కారు అడుగులు వేస్తున్నది. ప్రపంచ స్థాయి బ్యాంకుల ఏర్పాటు లక్ష్యంతో ఇప్పటికే బ్యాంకుల విలీనాలకు తెరతీసిన కేంద్రం.. ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా ప్రైవేటీకరణకు సిద్ధమవుతున్నది. ఈ క్రమంలోనే పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ)లను ప్రైవేటీకరించవచ్చని సమాచారం. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2021-22)గాను సోమవారం లోక్‌సభలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగానే రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులతోపాటు ఓ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలో వాటాలను విక్రయించనున్నామని చెప్పారు. ఐడీబీఐ బ్యాంక్‌లో ప్రభుత్వ వాటాల అమ్మకం ప్రక్రియ కూడా వచ్చే ఆర్థిక సంవత్సరం పూర్తవుతుందన్నారు. అయితే ప్రైవేటీకరణకు రానున్న ఆ రెండు ప్రభుత్వ బ్యాంకుల పేర్లను సీతారామన్ ప్రకటించకపోయినా.. అవి పీఎన్బీ, బీవోబీలేనన్న అంచనాలు జోరుగా వినిపిస్తున్నాయి.
బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర పేర్లూ పైకొస్తున్నాయి. పీఎన్బీలో యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ విలీనం అవగా, బీవోబీలో విజయా, దేనా బ్యాంక్‌లు కలిసిపోయిన సంగతి విదితమే. మరోవైపు బ్యాంకింగ్ సంస్కరణలకు సంబంధించి బడ్జెట్ ప్రకటనల నేపథ్యంలో బీఎస్ఈలో బీవోబీ, పీఎన్బీ షేర్ల విలువ 8.6, 7 శాతం చొప్పున పెరిగాయి. చాలా వాణిజ్య బ్యాంకుల షేర్లూ మదుపరులను ఆకట్టుకున్నాయి.
వ్యతిరేకిస్తున్న యూనియన్లు
ప్రభుత్వ రంగ సంస్థల్లో, ముఖ్యంగా బ్యాంకుల్లో పెట్టుబడుల ఉపసంహరణను బ్యాంక్ యూనియన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అఖిల భారత బ్యాంక్ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం మాట్లాడుతూ బ్యాంకుల ప్రైవేటీకరణ, బీమా రంగంలో ఎఫ్‌డీఐ పరిమితి పెంపు ప్రతిపాదనలు సరికావన్నారు. త్వరలోనే ఆందోళనలకు దిగుమతామని హెచ్చరించారు.
తాజావార్తలు
- అల్లరి నరేష్‌కు దిల్ రాజు బంపర్ ఆఫర్
- ప్రేమోన్మాది ఘాతుకం..
- అధునాతన 5జీ సేవలకు గూగుల్క్లౌడ్తో జత కలిసిన ఇంటెల్
- బైక్‌ను ఢీకొట్టిన బొలెరో.. ఇద్దరు దుర్మరణం
- చిలీకి నౌకను నిర్మించిన భారత సంస్థ ఎల్ అండ్ టీ
- అనసూయను ఆశ్చర్యంలో ముంచేసిన అభిమాని
- రోహిత్ శర్మ అర్ధసెంచరీ
- తొలిరోజు పాఠశాలలకు 10 శాతంలోపే విద్యార్థులు
- టీఆర్ఎస్తోనే నిరంతర అభివృద్ధి : పల్లా రాజేశ్వర్ రెడ్డి
- గురువాయూర్‌లో ఏనుగులకు పరుగుపందెం