గురువారం 09 ఏప్రిల్ 2020
Business - Jan 08, 2020 , 12:07:27

పరిశ్రమను వేధించడం లేదు

పరిశ్రమను వేధించడం లేదు

న్యూఢిల్లీ, జనవరి 6: కొన్ని అక్రమ సంస్థలు, కొంతమంది అవినీతి కార్పొరేట్లపై తీసుకుంటున్న చర్యలను మొత్తం కార్పొరేట్‌ రంగంపై ప్రభుత్వ అణిచివేతగా భావించవద్దని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కోరారు. కొందరు తమ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని, కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణను తప్పుబడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఇక్కడ కిర్లోస్కర్‌ బ్రదర్స్‌ శత వసంతాల వేడుకలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ పారదర్శకమైన వాతావరణంలో స్వేచ్ఛగా సంపదను సృష్టించేలా పరిశ్రమను ప్రోత్సహించడమే తమ లక్ష్యమని తెలిపారు. పారిశ్రామికాభివృద్ధికి అడ్డుపడటం లేదని స్పష్టం చేశారు. గడిచిన ఐదేండ్లలో తమ ప్రభుత్వం నిజాయితీగా పనిచేసిందని, పారిశ్రామిక రంగానికి అనుకూల చట్టాలను తేవడంలో కృషి చేసిందని చెప్పారు. పన్నుల వ్యవస్థను సరళతరం చేయడమేగాక, జవాబుదారీతనాన్ని పెంచామని గుర్తుచేశారు. నూతన చట్టాలను తెచ్చామని, కార్పొరేట్‌ పన్నును గణనీయంగా తగ్గించి భారీ పెట్టుబడులకు ఊతమిచ్చామన్నారు.

ఈ దశాబ్దం భారతీయ పారిశ్రామికవేత్తలదే

ఈ దశాబ్దం భారతీయ పారిశ్రామికవేత్తలదేనని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను 5 లక్షల కోట్ల డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నది ఎన్నో కలలను సాకారం చేయడానికేనని చెప్పారు. ఈ క్రమంలోనే నిరాశావాదాన్ని విడనాడాలని దేశీయ పరిశ్రమకు మోదీ పిలుపునిచ్చారు. వ్యాపార, పారిశ్రామిక రంగాలకు అన్నివిధాలా తమ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

పారిశ్రామికవేత్తలతో భేటీ

దేశంలోని ప్రముఖ వ్యాపార, పారిశ్రామికవేత్తలతో ప్రధాని మోదీ సోమవారం భేటీ అయ్యారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2020-21)గాను ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెడుతున్న క్రమంలో ఈ సమావేశం జరిగింది. ఇందులో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ, రతన్‌ టాటా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న పలు సవాళ్లు, వృద్ధిరేటు పురోగతికి, ఉద్యోగ-ఉపాధి కల్పనకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అదానీ గ్రూప్‌ సారథి గౌతమ్‌ అదానీ, భారతీ ఎయిర్‌టెల్‌ చైర్మన్‌ సునీల్‌ భారతీ మిట్టల్‌, మహీంద్రా గ్రూప్‌ అధిపతి ఆనంద్‌ మహీంద్రా, వేదాంత రిసోర్సెస్‌ చైర్మన్‌ అనిల్‌ అగర్వాల్‌, టాటా సన్స్‌ చైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌, టీవీఎస్‌ చైర్మన్‌ వేణు శ్రీనివాసన్‌, ఎల్‌అండ్‌టీ అధినేత ఏఎం నాయక్‌ తదితరులు ఈ భేటీలో ఉన్నారు. జూలై-సెప్టెంబర్‌ లో జీడీపీ ఆరేండ్ల కనిష్ఠానికి పతనమైన నేపథ్యంలో ఇప్పటికే ఓసారి వివిధ సంస్థల సీఈవోలతో మోదీ సమావేశమైనది తెలిసిందే.


logo