గురువారం 03 డిసెంబర్ 2020
Business - Aug 14, 2020 , 02:30:00

నిజాయితీకి ప్రయోజనం

నిజాయితీకి ప్రయోజనం

 • పారదర్శకత పెంపునకు కేంద్రం చర్యలు
 • నిజాయితీగా పన్నులు చెల్లించేవారికి ప్రయోజనాలు
 • ఫేస్‌లెస్‌ అసెస్‌మెంట్‌, ట్యాక్స్‌పేయర్స్‌ చార్టర్‌ అమలు
 • సెప్టెంబర్‌ 25 నుంచి ఫేస్‌లెస్‌ అప్పీల్‌ సదుపాయం
 • ప్రత్యేక ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

ప్రత్యక్ష పన్ను చెల్లింపుల్లో కీలక సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం అంకురార్పణ చేసింది. పన్ను విధానాన్ని మరింత సులభతరం చేయడంతోపాటు నిజాయితీగా పన్నులు చెల్లించే వారిని ప్రోత్సహించేందుకు పారదర్శక విధానాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ‘ట్రాన్స్‌పరెంట్‌ ట్యాక్సేషన్‌-హానరింగ్‌ ద హానెస్ట్‌' పేరుతో ప్రత్యేక ప్లాట్‌ఫామ్‌ను ప్రవేశపెట్టింది. ఫేస్‌లెస్‌ అసెస్‌మెంట్‌, ఫేస్‌లెస్‌ అప్పీల్‌, ట్యాక్స్‌పేయర్స్‌ చార్టర్‌ అనే మూడు ప్రధాన సంస్కరణలతో కూడిన ఈ ప్లాట్‌ఫామ్‌ను ప్రధాని నరేంద్రమోదీ గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. 

న్యూఢిల్లీ, ఆగస్టు 13: ప్రత్యక్ష పన్ను చెల్లింపుల్లో కీలక సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం అంకురార్పణ చేసింది. పన్ను విధానాన్ని మరింత సులభతరం చేయడంతోపాటు నిజాయితీగా పన్నులు చెల్లించే వారిని ప్రోత్సహించేందుకు పారదర్శక విధానాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ‘ట్రాన్స్‌పరెంట్‌ ట్యాక్సేషన్‌-హానరింగ్‌ ది హానెస్ట్‌' పేరుతో ప్రత్యేక ప్లాట్‌ఫామ్‌ను ప్రవేశపెట్టింది. ఫేస్‌లెస్‌ అసెస్‌మెంట్‌, ఫేస్‌లెస్‌ అప్పీల్‌, ట్యాక్స్‌పేయర్స్‌ చార్టర్‌ అనే మూడు ప్రధాన సంస్కరణలతో కూడిన ఈ ప్లాట్‌ఫామ్‌ను ప్రధాన మంత్రి నరేంద్రమోదీ గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా  ప్రారంభించారు. వీటిలో ఫేస్‌లెస్‌ అసెస్‌మెంట్‌, ట్యాక్స్‌పేయర్స్‌ చార్టర్‌ గురువారం నుంచే అమల్లోకి వచ్చాయి. ఫేస్‌లెస్‌ అప్పీల్‌ సదుపాయం సెప్టెంబర్‌ 25 నుంచి అందుబాటులోకి వస్తుంది.

మరిన్ని సంస్కరణలు

కరోనా సంక్షోభంతో మందగించిన దేశ ఆర్థిక వ్యవస్థను పునర్‌నిర్మించేందుకు ఈ ప్లాట్‌ఫామ్‌ ద్వారా పన్ను వ్యవస్థలో మరిన్ని సంస్కరణలను తీసుకురానున్నట్టు మోదీ ప్రకటించారు. ప్రత్యక్ష పన్ను విధానాన్ని మరింత సులభతరం చేయడంతోపాటు నిజాయితీగా పన్నులు చెల్లించేవారికి ప్రయోజనం కల్పించాలన్న లక్ష్యంతో ఈ ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేశామన్నారు. ‘ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి పన్ను సంస్కరణలు ఎంతో అవసరం. అందుకే ఈ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించాం. దీని ద్వారా సులభంగా ఫిర్యాదులు చేయవచ్చు. దేశంలో పన్ను చెల్లింపుదారుల సంఖ్య మరింత పెరిగేందుకు ఈ ప్లాట్‌ఫామ్‌ దోహదం చేస్తుంది. నిజాయితీగా పన్నులు చెల్లించేవారికి ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. పన్ను సంస్కరణల్లో పాలసీ ఆధారిత పరిపాలన అవసరం’ అని మోదీ పేర్కొన్నారు.


సీమ్‌లెస్‌, పెయిన్‌లెస్‌, ఫేస్‌లెస్‌గా.. 

ఆదాయ పన్నుతోపాటు కార్పొరేట్‌ పన్ను రేట్లను ఇప్పటికే భారీగా తగ్గించామని మోదీ చెప్పారు. పన్నుల వ్యవస్థను నిరంతరాయం (సీమ్‌లెస్‌)గా, పెయిన్‌లెస్‌ (బాధ లేనిది)గా, ఫేస్‌లెస్‌ (వ్యక్తిగత ప్రమేయం లేనిది)గా ఉండేలా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్నామని తెలిపారు. సీమ్‌లెస్‌ అంటే.. పన్ను చెల్లింపుదారుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించి వారిలో గందరగోళాన్ని తొలిగించేందుకు ఆదాయ పన్ను విభాగం కృషిచేయాలన్నారు. పెయిన్‌లెస్‌ అంటే.. టెక్నాలజీ నుంచి నిబంధనల వరకు అన్నీ సులభతరంగా ఉండాలని తెలిపారు. ఫేస్‌లెస్‌ అంటే.. పన్ను చెల్లింపుదారుడు, ట్యాక్స్‌ అధికారి ఎవరు అనేదానికి సంబంధమే ఉండకూడదని స్పష్టం చేశారు. 

ఇప్పటికీ పన్ను చెల్లింపుదారుల సంఖ్య తక్కువే

ఇప్పటికే తమ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల కారణంగా గత ఏడేండ్లలో ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేసేవారి సంఖ్య సుమారు 2.5 కోట్లు పెరిగిందని మోదీ చెప్పారు. అయినప్పటికీ ఇది చాలా తక్కువేనని పేర్కొన్నారు. 130 కోట్ల మంది జనాభా ఉన్న భారత్‌లో పన్ను చెల్లింపుదారుల సంఖ్య మరిం త పెరగాలని అన్నారు. 2012-13 మదింపు సంవత్సరానికి సంబంధించిన అని పన్ను రిటర్నుల్లో 0.94 శాతం రిటర్నుల స్క్రూటినీ జరిగిందని, 2018-19లో ఈ సంఖ్య  నాలుగు రెట్టు తగ్గి 0.26 శాతానికి పడిపోయిందని తెలిపారు.

ఫేస్‌లెస్‌ అసెస్‌మెంట్‌ అంటే..

ఇప్పటివరకు మనం ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంత ఆదాయ పన్ను విభాగం మన రిటర్నులు, అప్పీళ్ల స్క్రూటినీ, నోటీసుల జారీ, సర్వే, జప్తు లాంటి పనులను చూసుకొనేది. ఈ పనుల్లో ఆ ప్రాంతానికి చెందిన ఐటీ అధికారి కీలక పాత్ర పోషించేవారు. తాజా సంస్కరణలతో ఈ విధానం దాదాపుగా అంతమైపోతుంది. కొత్త విధానంలో ఇకపై స్క్రూటినీ కేసులను దేశంలోని ఏ ప్రాంతంలో ఉన్న ఏ అధికారికో ర్యాండమ్‌గా కేటాయిస్తారు. ఆ అధికారి ఎవరో పన్ను చెల్లింపుదారులకు తెలిసే ఆస్కారముండదు. ఆ అధికారి నుంచి వచ్చే ఆదేశాలను వేరే రాష్ర్టానికి చెందిన బృందం సమీక్షిస్తుంది. ఈ టీమ్‌లో ఎవరు ఉండాలన్న విషయాన్ని అధికారులు కాకుండా ర్యాండమ్‌గా కంప్యూటర్‌ నిర్ణయిస్తుంది. కృత్రిమ మేధస్సు, డాటా అనలిటిక్స్‌ లాంటి ఆధునిక సాంకేతికతల వినియోగంతో స్క్రూటినీ పూర్తవుతుంది. దీని వల్ల పన్ను చెల్లింపుదారులతోపాటు ఆదాయ పన్ను విభాగానికీ చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఈ విధానంలో పన్ను చెల్లింపుదారులు ఐటీ కార్యాలయానికి లేదా ఆ విభాగ అధికారి వద్దకు వెళ్లాల్సిన పని ఉండదు. అంటే పన్ను చెల్లింపుదారులు ఐటీ విభాగంలోని అధికారులతో పరిచయాలను పెంచుకొని వారిపై ఒత్తిడి తీసుకురావడానికి వీలుండదు.

కేవలం ఒక్కశాతం మందే..

గడిచిన ఐదేండ్లలో ఆదాయ, ఇతర పన్ను చెల్లింపులు జరిపిన వివరాలను కేంద్రం విడుదల చేసింది. ప్రస్తుతం పన్ను చెల్లిస్తున్న వారిలో రూ.50 లక్షల కంటే అధిక ఆదాయం ఆర్జిస్తున్న వారి వాట కేవలం ఒక్క శాతం మాత్రమే. అలాగే పాన్‌తో ఆధార్‌ అనుసంధానం చేసుకున్నవారు, పాన్‌ కార్డు తీసుకున్న వారి వివరాలను పొందుపరిచింది. భారత్‌లో 1.5 కోట్ల మంది పన్ను చెల్లిస్తుండగా, వీరిలో కేవలం ఒక్కశాతం మంది రూ.50 లక్షలపై ఆర్జిస్తున్నారు. ఈ ఏడాది చివరినాటికి పాన్‌ కార్డుల సంఖ్య 50 కోట్లకు చేరుకునే అవకాశం ఉంది. 


పన్ను పరిపాలనలో మైలురాయి: నిర్మలా

పన్ను పరిపాలన వ్యవస్థలో ఈరోజు ఒక మైలురాయిగా నిలిచిపోనున్నదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యానించారు. నిజాయితీగా పన్నులు చెల్లించేవారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు ఫేస్‌లెస్‌ ట్యాక్స్‌ స్క్రూటినీ అసెస్‌మెంట్‌ను ప్రవేశపెట్టినట్లు చెప్పారు.  ఇప్పటికే పన్ను చెల్లింపుల్లో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామని, ముఖ్యంగా కార్పొరేట్‌ ట్యాక్స్‌ను 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి ప్రస్తావించారు.

ట్యాక్స్‌ పేయర్స్‌ చార్టర్‌


పన్ను చెల్లింపులకయ్యే వ్యయాన్ని తగ్గించడంతోపాటు ఆదాయ పన్ను చెల్లింపుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని ట్యాక్స్‌ పేయర్స్‌ చార్టర్‌ హామీ ఇస్తున్నది. దీని వల్ల నిజాయితీగా పన్నులు చెల్లించి దేశ ప్రగతికి తోడ్పడే వారితోపాటు ఆదాయ పన్ను విభాగానికీ అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఈ చార్టర్‌ ప్రకారం ఐటీ విభాగం నుంచి పన్ను చెల్లింపుదారులు ఏమి ఆశించవచ్చంటే..

 • సమస్యల పరిష్కారంలో పన్ను చెల్లింపుదారునికి అవసరమైన అన్ని రకాల సహాయాన్ని ఐటీ విభాగం అందజేస్తుంది.
 • ప్రత్యేక కారణాలేమైనా ఉంటే తప్ప ప్రతి పన్ను చెల్లింపుదారుడినీ నిజాయితీపరుడిగా పరిగణిస్తుంది.
 •  అప్పీళ్ల విషయంలో పన్ను చెల్లింపుదారులకు నిస్పాక్షిక సమీక్ష వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తుంది.
 •  పన్ను చెల్లింపు నిబంధనలను పాటించేందుకు అవసరమయ్యే కచ్చితమైన సమాచారాన్ని పన్ను చెల్లింపుదారులకు అందజేస్తుంది.
 •  చట్ట ప్రకారం ప్రతి ఐటీ ప్రొసీడింగ్‌ విషయంలో నిర్దేశిత సమయంలోగా నిర్ణయం తీసుకొంటుంది.
 •  చట్ట ప్రకారం పన్ను బకాయి మొత్తాన్ని మాత్రమే ప్రభుత్వం వసూలు చేస్తుంది.
 • విచారణ, పరిశీలన లేదా ఏదైనా చర్య అమలు విషయంలో ఐటీ విభాగం అతి దురుసుకు పోకుండా చట్ట ప్రకారమే వ్యవహరిస్తుంది.
 • పన్ను చెల్లింపుదారుడు సమర్పించిన ఏ సమాచారాన్నైనా చట్టం అనుమతిస్తే తప్ప బహిర్గతం చేయదు.
 • అధికారులు చేపట్టే ప్రతి చర్యకు ఐటీ విభాగం     వారినే బాధ్యులుగా చేస్తుంది.
 •  పన్ను చెల్లింపుదారుడు తనకు నచ్చిన అధీకృత ప్రతినిధిని ఎంచుకొనేందుకు ఐటీ విభాగం అనుమతిస్తుంది.
 •  ఫిర్యాదు దాఖలు చేసేందుకు, సమస్యను సకాలంలో పరిష్కరింపజేసు కొనేందుకు అవసరమైన వ్యవస్థను పన్ను చెల్లింపుదారునికి అందుబాటులో ఉంచుతుంది.
 •   నిష్పాక్షికమైన వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చి పన్ను సమస్యలను నిర్దేశిత సమయంలోగా ఐటీ విభాగం పరిష్కరిస్తుంది.
 •   పీరియాడిక్‌ పద్ధతిలో సేవలు అందించేందుకు పాటించాల్సిన ప్రమాణాలను ఐటీ విభాగం ప్రచురిస్తుంది.
 •    పన్ను చెల్లింపునకు అయిన ఖర్చును చట్టం అమలు సందర్భంగా ఐటీ విభాగం పరిగణనలోకి తీసుకొంటుంది.

ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి పన్ను సంస్కరణలు ఎంతో అవసరం. అందుకే ఈ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించాం. దీని ద్వారా సులభంగా ఫిర్యాదులు చేయవచ్చు. దేశంలో పన్ను చెల్లింపుదారుల సంఖ్య మరింత పెరిగేందుకు ఈ ప్లాట్‌ఫామ్‌ దోహదం చేస్తుంది. నిజాయితీగా పన్నులు చెల్లించేవారికి ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. పన్ను సంస్కరణల్లో పాలసీ ఆధారిత పరిపాలన అవసరం. 

-ప్రధాని నరేంద్రమోదీ

పన్నుల చట్టంలో ఫేస్‌లెస్‌ అసెస్‌మెంట్‌ తీసుకురావడం అతిపెద్ద సంస్కరణలాంటిది. ట్యాక్స్‌పేయర్స్‌ చార్టర్‌తో పన్ను చెల్లింపుదారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. 

- ఉదయ్‌ కొటక్‌, సీఐఐ ప్రెసిడెంట్‌

నిర్మాణాత్మక సంస్కరణల్లో ఇదొక మైలురాయి. దేశవ్యాప్తంగా ఉన్న పన్ను చెల్లింపుదారులకు ఈ నిర్ణయం మరింత బూస్ట్‌నివ్వనున్నది. 

- సంగీతా రెడ్డి, ఫిక్కీ ప్రెసిడెంట్‌

ప్రత్యక్ష పన్ను విధానంలో సంస్కరణలు తీసుకొచ్చారు. పన్ను చెల్లింపుదారులు, కేంద్ర ప్రభుత్వం మధ్య అంతరాలు తొలుగేందుకు ఆస్కారం ఉన్నది. 

- దీపక్‌ సౌద్‌, అసోచామ్‌ సెక్రటరీ జనరల్‌