ఆదివారం 24 మే 2020
Business - Jan 25, 2020 , 23:45:46

15 బిలియన్‌ డాలర్లు

15 బిలియన్‌ డాలర్లు

2022 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యంపై భారత్‌, బ్రెజిల్‌ లక్ష్యం

న్యూఢిల్లీ, జనవరి 25: భారత్‌, బ్రెజిల్‌ దేశాలు 2022 నాటికి 15 బిలియన్‌ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ మేరకు శనివారం ఇరు దేశాల మధ్య ఒప్పందాలు జరిగాయి. బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్‌ మెస్సియాస్‌ బోల్సోనారో భారత్‌లో పర్యటిస్తున్న నేపథ్యంలో ఈ ఒప్పందాలు కుదరగా, చమురు, గ్యాస్‌, గనులు తదితర కీలక రంగాల్లో పరస్పర భాగస్వామ్యానికి ఉభయ దేశాలు అంగీకరించాయి. భారత్‌, బ్రెజిల్‌ దేశాల సంయుక్త జీడీపీ విలువ దాదాపు 4.5 లక్షల కోట్ల డాలర్లుగా ఉన్నది. ఈ దేశాల మొత్తం జనాభా 150 కోట్లు. గత ఆర్థిక సంవత్సరం (2018-19)లో భారత్‌, బ్రెజిల్‌ ద్వైపాక్షిక వాణిజ్యం విలువ 8.2 బిలియన్‌ డాలర్లుగా ఉన్నది.


ఇందులో బ్రెజిల్‌కు భారత్‌ నుంచి జరిగిన ఎగుమతుల విలువ 3.8 బిలియన్‌ డాలర్లుగా ఉండగా, బ్రెజిల్‌ నుంచి భారత్‌కు వచ్చిన దిగుమతులు 4.4 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. బ్రెజిల్‌ అధ్యక్షుడితో జరిగిన చర్చల సందర్భంగా భారత్‌లో మౌలిక, ఆహార శుద్ధి, జీవ ఇంధనం, పునరుత్పాదక శక్తి, పశు సంరక్షణ, వ్యవసాయ రంగాల్లో పెట్టుబడులకు గొప్ప అవకాశాలున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. భారీ పెట్టుబడులతో రావాలని బ్రెజిల్‌ వ్యాపార, పారిశ్రామిక రంగాలకు పిలుపునిచ్చారు. బ్రెజిల్‌ అధ్యక్షుడు సైతం భారత పరిశ్రమలను తమ దేశంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు.


logo