సోమవారం 30 మార్చి 2020
Business - Mar 16, 2020 , 00:43:50

ఔషధానికి సుస్తి!

ఔషధానికి సుస్తి!
  • వైరస్‌ దెబ్బకు ఫార్మా రంగం కుదేలు
  • ఆగిన ముడి సరుకు సరఫరా
  • నిలిచిపోయిన చైనా దిగుమతులు
  • ప్రశ్నార్థకంగా ఉత్పాదకత

కరోనా వైరస్‌ వ్యాపార, పారిశ్రామిక రంగాలనూ పట్టి పీడిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా వేల ప్రాణాలను బలిగొంటున్న ఈ మహమ్మారి.. దేశీయ పరిశ్రమను ముఖ్యంగా ఔషధ రంగాన్ని కుదేలు చేస్తున్నది. చైనా నుంచి ముడి సరుకు దిగుమతులు నిలిచిపోవడంతో ఉత్పాదకత ప్రభావితం అవుతున్నది. ప్రపంచ కర్మాగారంగా ప్రసిద్ధి చెందిన చైనాలోనే కరోనా పురుడు పోసుకున్న విషయం తెలిసిందే. దీంతో అక్కడి తయారీ రంగం దాదాపుగా మూతబడింది. అన్ని రకాల పరిశ్రమలు స్తంభించిపోయాయి. ఫలితంగా భారత్‌సహా ఇక్కడి నుంచి దిగుమతులు చేసుకుంటున్న ఎన్నో దేశాలపై ఈ ప్రభావం కనిపిస్తున్నదిప్పుడు. చైనా నుంచి చౌకగా ముడి సరుకు లభిస్తుండటంతో చాలా దేశాలు అక్కడి నుంచే దిగుమతి చేసుకుంటున్నాయి. అయితే కరోనా దెబ్బకు అంతా తలకిందులైంది. 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: బల్క్‌ డ్రగ్స్‌, ఫార్మా రంగ పరిశ్రమపై వైరస్‌ ప్రభావం అధికంగా కనిపిస్తున్నది. చైనాలో ఇప్పుడున్న పరిస్థితుల్లో పరిశ్రమలను తెరవడం సాధ్యమేనా? తెరిచినా అక్కడి నుంచి ముడి సరుకులను ఇక్కడికి దిగుమతి చేసుకోవడంపై ఎలాంటి ఆంక్షలు ఉంటాయి? అన్న అనుమానాలు సర్వత్రా నెలకొన్నాయి. దీంతో కరోనా వైరస్‌ అదుపులోకి వచ్చి చైనాలో సాధారణ పరిస్థితులు నెలకొనేదాకా ఇబ్బందులు తప్పవన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసలే కరోనా ధాటికి చైనా అతలాకుతలమైంది. తయారీ నిలిచిపోవడంతో చైనా సైతం ఔషధాల కొరతను ఎదుర్కొంటున్నది. దీంతో తమ అవసరాలకే ఆ దేశం తొలి ప్రాధాన్యతను ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అప్పటిదాకా దేశీయ అసరాల సంగతి ఏంటన్న ప్రశ్నలు.. భవిష్యత్తుపై భరోసా లేకుండా చేస్తున్నాయి. నిజానికి పారసిటమల్‌ వంటి మందుల కొరత లేదని కేంద్రం చెబుతున్నా.. వైరస్‌ బాధితులు ముదిరితే పరిస్థితి ఏంటన్నదానిపై ఆందోళనలు లేకపోలేదు. ఇప్పటికే దేశం నుంచి విదేశాలకు ఔషధ ఎగుమతులపై మోదీ సర్కారు ఆంక్షలు పెట్టిన విషయం తెలిసిందే.

సమస్యల్లో ఎగుమతులు

మరికొన్ని నెలలపాటు ఔషధ రంగాన్ని కరోనా ప్రభావిత సమస్యలు వెంటాడే అవకాశముందని నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి పరిశ్రమలపై ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. బల్క్‌ డ్రగ్‌, ఫార్మా పరిశ్రమ ఉత్పత్తులపై ఏప్రిల్‌ తరువాత ప్రభావం ఉంటుందంటున్న విశ్లేషకులు.. ఇతర దేశాలు ఇచ్చిన ఆర్డర్లపై ఈ పరిస్థితుల ప్రభావం పడవచ్చని అంటున్నారు. అత్యవసరాల కోసం ముడి సరుకు సిద్ధంగా ఉందని పరిశ్రమ చెప్తుండగా, వచ్చే నెలలోనూ వైరస్‌ ఉధృతి కొనసాగితే కష్టాలు తప్పవన్న సంకేతా లు అందుతున్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ఆంక్షలతో ఔషధ ఎగుమతులకు బ్రేకు లు పడ్డాయి. ఈ క్రమంలో చైనా పరిస్థితులు మెరుగుపడకుంటే యావత్‌ పరిశ్రమపై తీవ్ర ప్ర భావం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 




వనరులపై దృష్టి పెట్టాలి

దేశీయ అవసరాలకు అనుగుణంగా మందుల తయారీని పెంచుకునేందుకు కేంద్రం అనుమతి ఇవ్వాలని బల్క్‌ డ్రగ్స్‌ పరిశ్రమల ప్రతినిధి ఈశ్వర్‌రెడ్డి నమస్తే తెలంగాణకు తెలిపారు. కేంద్రం దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆయా కంపెనీల నుంచి వివిధ శాఖల అధికారులు సమాచారాన్ని సేకరించారని ఆయన వివరించారు. కేంద్రం వెంటనే స్పందిస్తే దేశీయ అవసరాలకు కొరత ఉండదన్నారు. బల్క్‌ డ్రగ్‌ పరిశ్రమలకు అవసరమైన ముడి సరుకు చైనా నుంచి రావాల్సి ఉందన్న ఆయన పరిస్థితులు ఇంకా మెరుగుపడలేదని గుర్తుచేశారు. ఈ క్రమంలోనే స్థానిక వనరులపై దృష్టి పెట్టి ఉత్పాదకతను పెంచుకునే మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఉందన్నారు. లేనిపక్షంలో రాబోయే రోజుల్లో ఉత్పత్తి సామర్థ్యం దెబ్బతినే వీలుందన్నారు. మరోవైపు దేశీయంగా తయారయ్యే వ్యాక్సిన్లు, మందుల ఎగుమతులపై కేంద్రం విధించిన నిషేధం.. రాష్ట్ర కంపెనీల ఆర్థిక పరిస్థితులను ప్రభావితం చేయవచ్చన్నారు.


కరోనాపై అవగాహన కోసం..

పరిశ్రమల్లో పనిచేసే ఉద్యోగులు, కార్మికుల ఆరోగ్యంపై యాజమాన్యాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాయి. ఒక్కో పరిశ్రమలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు, కార్మికులు పనిచేస్తుంటారు. వారికి కరోనాపై అవగాహన కల్పించడానికి యాజమాన్యాలు వివిధ చర్యలు చేపడుతున్నాయి. ఈ మేరకు సీఐఐ తెలంగాణ శాఖ అధ్యక్షుడు రాజు నమస్తే తెలంగాణకు తెలిపారు. ముందుగా వారిలో భయాన్ని తొలగించడానికి చర్యలు తీసుకుంటున్నారు. ప్రత్యేక మాస్క్‌లను అందిస్తున్నారు. పరిశ్రమ పరిసరాలు పూర్తిగా శుభ్రంగా ఉండేలా సూచనలు చేస్తున్నారు. చర్యలు చేపట్టారు. ఆర్థిక లావాదేవీల నిమిత్తం ఇతర దేశాల నుంచి ప్రతినిధులు, కంపెనీల బృందాలు వస్తుంటాయి. ఈ నేపథ్యంలో వారిపైనా ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు. ఉద్యోగులెవరు కూడా ఆందోళన చెందకుండా భరోసా కల్పిస్తున్నారు. అనుమానితులకు ఆరోగ్య పరీక్షలు చేస్తుండగా, షెక్‌ హ్యాండ్‌లకు స్వస్తి పలుకాలని చెప్తున్నారు. కాగా, కరోనా వైరస్‌ను అరికట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని రాజు ప్రశంసించారు.   ప్రభుత్వ చర్యలకు తమ వంతు సహకారం అందిస్తామన్నారు.




ఫార్మా షేర్లు ఢమాల్‌

కరోనా దెబ్బకు కకావికలమవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్లలో ఔషధ రంగ షేర్లు నేలచూపులు చూస్తున్నాయి. మదుపరుల నిరాదరణకు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నాయి. ఒకప్పుడు బంగారు గుడ్లను పెట్టే బాతుగా ఇన్వెస్టర్లకు కనిపించిన ఫార్మా రంగం.. ఇప్పుడు సంపదను హరించేదిగా గోచరిస్తున్నది. గ్లెన్‌మార్క్‌ ఫార్మాస్యూటికల్స్‌, పిరామల్‌ ఎంటర్‌ప్రైజెస్‌, లుపిన్‌, బయోకాన్‌, క్యాడిలా హెల్త్‌కేర్‌, అరబిందో ఫార్మా, సిప్లా, దివిస్‌ లాబొరేటరీస్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌, సన్‌ ఫార్మా షేర్లు నష్టాలను ఎదుర్కొంటున్నాయి. నిఫ్టీ ఫార్మా సూచీ 7.29 శాతం దిగజారి 6,436.75 వద్దకు చేరింది.


logo