గురువారం 02 ఏప్రిల్ 2020
Business - Jan 28, 2020 , 00:17:43

రెడ్డీస్‌ నష్టం 570 కోట్లు

రెడ్డీస్‌ నష్టం 570 కోట్లు
  • దెబ్బతీసిన ఉత్పత్తి సంబంధిత వ్యయాలు l 14 శాతం పెరిగిన ఆదాయం

హైదరాబాద్‌, జనవరి 27:రాష్ర్టానికి చెందిన ప్రముఖ ఫార్మా దిగ్గజం డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబోరేటరిస్‌ లిమిటెడ్‌ నష్టాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను  రూ.570 కోట్ల నష్టం వచ్చినట్లు తెలిపింది. 2018-19 ఏడాది ఇదే త్రైమాసికానికిగాను సంస్థ రూ. 485 కోట్ల లాభాన్ని గడించింది. ఉత్పత్తి సంబంధిత వ్యయాలు అధికమవడం వల్లనే లాభాల్లో భారీ గండి పడిందని కంపెనీ వర్గా లు వెల్లడించాయి. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.3,850 కోట్ల నుంచి 14 శాతం పెరిగి రూ.4,384 కోట్లకు ఎగబాకింది. గత త్రైమాసికంలో సంస్థ అన్ని రంగాల్లో మంచి పనితీరు కనబరిచిందని, ఎబిటా మార్జిన్లు మరింత బలోపేతమయ్యాయని రెడ్డీస్‌ కో-చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ జీవీ ప్రసాద్‌ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఉత్పత్తి సంబంధిత నష్టాలు ఒకేసారి నమోదు చేయడం వల్లనే నష్టాలు ప్రకటించాల్సి వచ్చిందని కంపెనీ సీఈవో ఎరేజ్‌ ఇజ్రాయిల్‌ తెలిపారు. ఆర్థిక ఫలితాల విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..నోవారింగ్‌ ఔషధ ఉత్పత్తిని,  అమ్మడానికి ముందే అమెరికాలో ఇతర సంస్థ ఇదే ఔషధాన్ని విడుదల చేయడంతో లాభాలపై ప్రతికూల ప్రభావం చూపిందన్నారు.  దీనిపై వచ్చే ఆదాయం విలువ రూ.1,100 కోట్లు కాగా,  వేరే సంబంధిత రూ.200 కోట్లు ఉన్నాయి. సంస్థ పరిస్థితి ఆశాజనకంగా ఉన్నప్పటికీ ఒకేసారి నష్టాలను ప్రకటించడంతో మదుపరుల్లో ఆందోళన నెలకొన్నది.  


 దన్నుగా నిలిచిన జనరిక్‌ ఔషధాలు

అంతర్జాతీయ మార్కెట్లో సంస్థ మెరుగైన ప్రదర్శణగావిస్తున్నది. గత త్రైమాసికంలో సంస్థ జనరిక్‌ ఔషధాల విక్రయించడం ద్వారా 3,590 కోట్ల రూపాయల నిధులు సమకూరాయి. క్రితం ఏడాదితో పోలిస్తే 15 శాతం అధికం. ముఖ్యంగా యూరప్‌, భారత్‌తోపాటు అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో రెండంకెల వృద్ధిని నమోదు చేసుకోవడం విశేషం. వీటిలో ఉత్తర అమెరికా నుంచి రూ.1,600 కోట్ల ఆదాయం(8 శాతం వృద్ధి) సమకూరగా, భారత్‌ నుంచి రూ.760 కోట్లు, యూరప్‌ నుంచి రూ.310 కోట్లు, అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి రూ.920 కోట్లు సమకూరాయి. ఉత్తర అమెరికా మార్కెట్లోకి ఐదు ఔషధాలు ప్రవేశపెట్టడం సంస్థకు కలిసొచ్చింది. వీటితోపాటు ఫార్మాస్యూటికల్స్‌ సర్వీసెస్‌ అండ్‌ యాక్టివ్‌ ఇంగ్రిడియంట్స్‌ ద్వారా సంస్థకు రూ.690 కోట్లు లభించాయి. 


ఆర్‌ అండ్‌ డీ కోసం రూ.390 కోట్లు

గత ఏడాదిగా సంస్థ ఖర్చులను భారీగా తగ్గించుకుంటున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడు త్రైమాసికాల్లో రూ.335 కోట్ల నిధులను వెచ్చించింది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో పెట్టిన రూ.696 కోట్లతో పోలిస్తే ఇది సగం. అలాగే పరిశోధన అండ్‌ అభివృద్ధి(ఆర్‌ అండ్‌డీ) కోసం మాత్రం భారీగా ఖర్చు చేస్తున్నది. గత త్రైమాసికంలో ఆర్‌ అండ్‌ డీ కోసం రూ.390 కోట్ల నిధులను కేటాయించింది. 


తొమ్మిది నెలల్లో..

ఏప్రిల్‌ నుంచి డిసెంబర్‌ మధ్యకాలంలో సంస్థ ఆశాజనక పనితీరు కనబరిచింది. రూ.13,028 కోట్ల ఆదాయం(15 శాతం వృద్ధి)పై రూ. 1,089 కోట్ల నికర లాభాన్ని(34 శాతం క్షీణత) నమోదు చేసుకున్నది. ప్రస్తుత త్రైమాసికంలో మెరుగైన వృద్ధిని సాధించే అవకాశాలున్నాయని కంపెనీ సీఎఫ్‌వో సౌమెన్‌ చక్రవర్తి తెలిపారు. మరోవైపు, శ్రీకాకుళంలో ఉన్న బల్క్‌ యూనిట్‌పై అమెరికా నియంత్రణ మండలి ఉన్నతాధికారులు తనిఖీ చేస్తున్నట్లు చెప్పారు. దీనిపై మరింత సమాచారం ఇవ్వడానికి ఆయన నిరాకరించారు. ఈ యూనిట్‌పై 2017లో పలు హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. 


logo
>>>>>>