శనివారం 06 మార్చి 2021
Business - Jan 25, 2021 , 21:26:09

రాజ‌స్థాన్‌లో పెట్రోల్ భ‌గ‌భ‌గ‌.. లీట‌ర్ @ రూ.100

రాజ‌స్థాన్‌లో పెట్రోల్ భ‌గ‌భ‌గ‌.. లీట‌ర్ @ రూ.100

న్యూఢిల్లీ: రాజ‌స్థాన్‌లోని శ్రీ గంగాన‌గ‌ర్‌లో ఎక్స్‌ట్రా ప్రీమియం లీట‌ర్ పెట్రోల్ ధ‌ర సోమ‌వారం రూ.100ల‌కు చేరుకోగా, సాధార‌ణ పెట్రోల్ లీట‌ర్ ధ‌ర రూ.97.73 ప‌లుకుతోంది. దీంతో ప్ర‌జ‌లు అత్య‌వ‌స‌రం, విధుల నిర్వ‌హ‌ణ కోస‌మే ఇండ్ల నుంచి బ‌య‌ట‌కు రావ‌డానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. రాజ‌స్థాన్ పొరుగున ఉన్న పంజాబ్‌, హ‌ర్యానా రాష్ట్రాల్లో పెట్రోల్ కొనుగోలు చేయ‌డానికి మొగ్గు చూపుతున్నారు. 

ఇంత‌కుముందు ప‌్రాణాంత‌క క‌రోనా మ‌హ‌మ్మారి ముప్పు నుంచి త‌ప్పించుకోవ‌డానికి ప్ర‌జ‌లంతా కొన్ని నెల‌ల క్రితం వ‌ర‌కు ఇండ్ల‌కే ప‌రిమితం అయ్యారు. మ‌రోవైపు క‌రోనాను నియంత్రించ‌డానికి కేంద్రం విధించిన లాక్‌డౌన్ వ‌ల్ల‌ 2020 మార్చి 25వ తేదీ నుంచి పెట్రోల్‌, డీజిల్ డిమాండ్ ప‌డిపోయింది. తిరిగి జూన్‌, జూలై త‌ర్వాత ఆర్థిక వ్య‌వ‌స్థ పున‌రుత్తేజానికి లాక్‌డౌన్ నిబంధ‌న‌లు స‌డ‌లించ‌డంతో తిరిగి పెట్రోల్‌, డీజిల్ వినియోగం.. దానికి అనుగుణంగా వాటి ధ‌ర‌లు పెరుగుతూ వ‌చ్చాయి. 

తాజాగా 2021లో ఇంధ‌న ధ‌ర‌లు ఆకాశాన్నంటేలా దూసుకువెళుతున్నాయి. గ‌త కొన్ని రోజులుగా డీజిల్‌, పెట్రోల్ ధ‌ర‌లు పెరుగుతూ వ‌స్తున్నాయి. రెండు రోజులుగా మార్పు లేకున్నా ఉత్త‌రాదితోపాటు అన్ని మెట్రో న‌గ‌రాల్లో లీట‌ర్ పెట్రోల్ లేదా డీజిల్ రూ.85 మార్కుకు చేరుకున్నాయి. అయితే దేశ రాజ‌ధాని ఢిల్లీలోనే చౌక‌గా పెట్రోల్, డీజిల్ ల‌భిస్తోంది. 

సోమ‌వారం ఢిల్లీలో లీట‌ర్ పెట్రోల్ రూ.85.70, ముంబైలో రూ.92.28, చెన్నైలో రూ.88.29, కోల్‌క‌తాలో రూ.87.11 ప‌లికింది. ఇక డీజిల్ లీట‌ర్ ధ‌ర ఢిల్లీలో రూ.75.88, ముంబైలో రూ.82.66, చెన్నైలో రూ.81.14, కోల్‌క‌తాలో రూ.79.48కి చేరుకున్న‌ది. ద్వితీయ శ్రేణి న‌గ‌రాల్లో రూ.100ల‌కు పెట్రోల్ ల‌భిస్తోంది. 

రాజ‌స్థాన్‌లోని శ్రీ‌గంగాన‌గ‌ర్‌, హ‌నుమాన్‌గ‌ఢ్‌ల‌లో ప్ర‌జ‌లు పెట్రోల్ కొనుగోలు కోసం బంకుల్లోకి రావ‌డానికే భ‌య‌ప‌డుతున్నారు. దీంతో ఆ రెండు ప‌ట్ట‌ణాల్లో పెట్రోల్ బంకులు మూత‌ప‌డే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. రాజ‌స్థాన్ పొరుగున ఉన్న పంజాబ్‌, హ‌ర్యానా రాష్ట్రాలతో పోలిస్తే ఇంధ‌న ధ‌ర‌లు లీట‌ర్‌పై రూ.8-10 తేడా క‌నిపిస్తోంది. మున్ముందు కేంద్ర చ‌మురు సంస్థ‌లు రిటైల్ పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు పెంచే అవ‌కాశాలే క‌నిపిస్తున్నాయి. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo