ఆదివారం 24 మే 2020
Business - Feb 28, 2020 , 18:36:37

బీఎస్‌-6 రాకతో పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు రెక్కలు

బీఎస్‌-6  రాకతో పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు రెక్కలు

న్యూఢిల్లీ:  వచ్చే ఏప్రిల్‌ 1 నుంచి బీఎస్‌-6  ప్రమాణాలు కలిగిన వాహనాలు మాత్రమే రిజిస్ట్రేషన్‌ చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. పాత వాహనాల రిజిస్ట్రేషన్లకు మార్చి 31వ తేదీ వరకు గడువు విధించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే బీఎస్‌-6 ప్రమాణాలతో రూపొందించిన వాహనాలను ప్రముఖ కంపెనీలు గడువుకు ముందే మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. దీనిలో భాగంగానే దేశీయంగా ఉన్న అన్ని చమురు పంపిణీ సంస్థలు బీఎస్‌-6 ఇంధనాన్ని మాత్రమే సరఫరా చేసేందుకు సన్నద్ధమయ్యాయి. తక్కువ ఉద్గారాలను విడుదల చేసే బీఎస్‌-6 ఇంధనాలను ఏప్రిల్‌ 1 నుంచి సరఫరా చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు చమురు దిగ్గజం ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌(ఐఓసీ) శుక్రవారం వెల్లడించింది. తక్కువ స్థాయిలో సల్ఫర్‌ ఉన్న పెట్రోల్‌, డీజిల్‌ను ఉత్పత్తి చేసేందుకు తమ రిఫైనరీలను రూ.17వేల కోట్లతో అప్‌గ్రేడ్‌ చేశామని దేశంలోనే అతిపెద్ద చమురు పంపిణీ సంస్థ ఐఓసీ ఛైర్మన్‌ సంజీవ్‌ సింగ్‌ వెల్లడించారు. 

దేశం మొత్తం కొత్త ప్రమాణాలతో కూడిన ఇంధనాన్ని వాడనుండటంతో ఏప్రిల్‌ 1 నుంచి ఇంధన ధరలు స్వల్పంగా పెరిగా అవకాశం ఉన్నదని తెలిపారు. ఐతే ఎంతమేర ఆయిల్‌ రేట్లు పెరుగుతాయనే విషయాన్ని ఆయన చెప్పలేదు. ప్రస్తుత బీఎస్‌-4 ఇంధనంతో పోలిస్తే బీఎస్‌-6 ఇంధనంలో కేవలం తక్కువ మోతాదులో  సల్పర్‌  ఉంటుందని పేర్కొన్నారు. ఐతే భారీ స్థాయిలో ఆయిల్‌ ధరలు పెంచి వినియోగదారులపై భారం వేయబోమని ఆయన స్పష్టం చేశారు. భారత ప్రభుత్వ చమురు సంస్థలు తమ రిఫైనరీలను ఆధునీకరించేందుకు సుమారు 35వేల కోట్లను పెట్టుబడిగా పెట్టాయని వివరించారు. logo