ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Business - Feb 14, 2021 , 21:46:57

ప్యాసింజ‌ర్ వెహిక‌ల్స్ ఎగుమ‌తిలో స్వ‌ల్ప రిక‌వ‌రీ!

ప్యాసింజ‌ర్ వెహిక‌ల్స్ ఎగుమ‌తిలో స్వ‌ల్ప రిక‌వ‌రీ!

న్యూఢిల్లీ: క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌భావం త‌ర్వాత తొలిసారి గ‌త నెల‌లో విదేశాల‌కు ప్ర‌యాణికుల వాహ‌నాల ఎగుమ‌తులు స్వల్పంగా పెరిగాయి. ప్ర‌ధానంగా కొన్ని ప్ర‌ధాన దేశాల‌కు భార‌త ఆటోమొబైల్ త‌యారీ సంస్థ‌ల నుంచి క్ర‌మంగా రిక‌వ‌రీ డిమాండ్ పెరుగుతోంది. 2020 జ‌న‌వ‌రితో పోలిస్తే ఈ ఏడాది 1.15 శాతం పెరిగాయి. గ‌తేడాది 36,765 ప్ర‌యాణ వాహ‌నాల‌ను ఎగుమ‌తి చేస్తే, గ‌త నెల‌లో అది 37,187 యూనిట్ల‌కు పెరిగింది. 

2020 ఏప్రిల్‌-జ‌న‌వ‌రి మ‌ధ్య ఇంకా ప్ర‌యాణికుల వాహ‌నాల ఎగుమ‌తులు 43.1 శాతం త‌గ్గుముఖం ప‌ట్టాయి. 2019-20 ఆర్థిక సంవ‌త్స‌రంలో 5,77,036 వెహిక‌ల్స్ ఎగుమ‌తి చేస్తే, ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రంలో 3,28,360 యూనిట్ల‌కు ప‌డిపోయాయని సొసైటీ ఆఫ్ ఇండియ‌న్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చ‌ర‌ర్స్ (సియామ్‌) డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ రాజేశ్ మెన‌న్ చెప్పారు. వాహ‌నాల ఎగుమ‌తి పురోగ‌తి సాధించ‌డానికి ఆయా దేశాల్లో ఆర్థిక రిక‌వ‌రీ కీల‌కం కానున్న‌ది.  

జ‌న‌వ‌రిలో మారుతి సుజుకి కార్ల ఎగుమ‌తులు 29.92 శాతం గ్రోత్ సాధించి 12,345 యూనిట్ల‌కు చేరుకుంటే, హ్యుండాయ్ మోటార్స్ 19 శాతం త‌గ్గి 8,100 కార్ల‌కు ప‌రిమితం అయ్యాయి. నిస్సాన్ మోటార్ ఇండియా కార్ల ఎగుమ‌తులు 4,198 యూనిట్లు జ‌రిగితే, కియా మోటార్స్ 3,618 యూనిట్లు, ఫోర్డ్ ఇండియా 2,983 కార్ల‌ను ఎగుమ‌తి చేసింది. 

ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రం ఏప్రిల్‌-జ‌న‌వ‌రి మ‌ధ్య అత్య‌ధికంగా 82,121 కార్లు ఎగుమ‌తి చేసినా గ‌తేడాదితో పోలిస్తే అది 47.01 శాతం త‌క్కువ‌. మారుతి సుజుకి కార్ల ఎగుమ‌తులు 15.55 శాతం ప‌త‌న‌మై 72,166 యూనిట్ల‌కు ప‌త‌న‌మ‌య్యాయి. ఫోర్డ్ ఇండియా 42,758 కార్లు, కియా మోటార్స్ 32,138, జ‌న‌ర‌ల్ మోటార్స్ ఇండియా 28,619, వోక్స్ వ్యాగ‌న్ ఇండియా 28,368, నిస్సాన్ 21,938 కార్ల‌ను ఎగుమ‌తి చేశాయి. 

దేశీయ మార్కెట్‌లో ప్ర‌యాణ వాహ‌నాల విక్ర‌యాలు గ‌త నెల‌లో 11.14 శాతం పెరిగాయి. 2,48,840 కార్ల నుంచి 2,76,554 యూనిట్ల‌కు విక్ర‌యాలు వ్రుద్ధి చెందాయి. 

VIDEOS

logo