బుధవారం 03 జూన్ 2020
Business - May 18, 2020 , 23:51:13

కేంద్ర ఉద్దీపనలు నేతిబీర చందమే

కేంద్ర ఉద్దీపనలు నేతిబీర చందమే

  • ప్యాకేజీ విలువ జీడీపీలో 1శాతంలోపే
  • బడ్జెట్‌లో ప్రతిపాదించే అంశాలకే కొత్త రంగు 

కరోనా కాటుతో అల్లాడుతున్న సామాన్యులకు ఊరట కల్పించేందుకు, సంక్షోభంలో కూరుకుపోయిన దేశ ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టేందుకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ భారీ ప్యాకేజీని ప్రకటించగానే ప్రజలంతా సంబరపడ్డారు. 130 కోట్ల మంది జనాభాకు రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ అనగానే.. 2014 ఎన్నికల సందర్భంగా మోదీ హామీ ఇచ్చినట్టు ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలో కనీసం రూ.15 వేలు వచ్చిపడతాయని ఎంతో ఆశపడ్డారు. కానీ కరోనా సంక్షోభంతో ప్రజలు ఎదుర్కొంటున్న వర్తమాన సమస్యలకు ఈ ప్యాకేజీ పరిష్కారం చూపడంలేదు. ఇది ‘నేతి బీరకాయ’ లాంటి ప్యాకేజీ అని స్పష్టమవడంతో సగటు భారతీయులంతా ఉసూరుమంటున్నారు. చేతిలో చిల్లిగవ్వ లేక తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న సామాన్య ప్రజలకు మోదీ సర్కార్‌ మొండిచెయ్యి చూపడమే ఇందుకు కారణం. ఈ ప్యాకేజీ లెక్కల్లో చాలా తేడా కొడుతున్నది. బడ్జెట్లో ప్రతిపాదించాల్సిన అనేక అంశాలను ప్యాకేజీలా మూటగట్టి ఉద్దీపనల పేరిట వరుసగా వడ్డించడంలోనే తేడా కనిపిస్తున్నది. రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) ప్రకటించిన లిక్విడిటీ సదుపాయాలను కూడా దీనిలో కలిపేసి మొత్తం రూ.21 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించేసరికి దానిపై నెలకొన్న భ్రమలన్నీ తొలగిపోయాయి. ఈ ప్యాకేజీ విలువ జీడీపీలో కనీసం 1 శాతం కూడా లేదని మోర్గాన్‌స్టాన్లీ, నోమురా, ఫిలిప్‌ క్యాపిటల్‌, హెచ్‌ఎస్‌బీసీ లాంటి ప్రముఖ అంతర్జాతీయ సంస్థలు లెక్కతేల్చాయి. 

నీళ్లు నములుతున్న నిర్మలమ్మ

వాస్తవానికి ఈ ప్యాకేజీ వల్ల ప్రభుత్వంపై పడే ఆర్థిక భారం చాలా తక్కువ. ఈ విషయమై ఎంత గట్టిగా ప్రశ్నించినప్పటికీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సమాధానాలను దాటవేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఇప్పటివరకు కేవలం రెండు నెలలే గడచినందున దీనిపై ఇప్పుడే అంచనాకు రాలేమంటున్నారు. రిజర్వ్‌ బ్యాంకు ప్రకటించిన లిక్విడిటీ చర్యలేవీ ప్రభుత్వంపై భారం మోపేవికావు. అందులో కొన్ని పాలసీ రేట్లలో తీసుకొచ్చిన మార్పుల కారణంగా బ్యాంకుల వద్ద నగదు పెరుగుతుంది. ఇది కేవలం బ్యాంకులకు, ఇతర ఆర్థిక సంస్థలకు ఇచ్చిన వెసులుబాటు మాత్రమే. ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన కింద ప్రకటించిన రూ.1.70 లక్షల కోట్లు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కేటాయించిన రూ.40 వేల కోట్లు, గృహ రుణాల వడ్డీ సబ్సిడీకి కేటాయించిన రూ.70 వేల కోట్లు, వలస కూలీల కోసం ప్రకటించిన రూ.14,502 కోట్లు, స్ట్రీట్‌ వెండర్ల కోసం కేటాయించిన రూ.5 వేల కోట్లు లాంటి కొన్నింటిని మినహాయిస్తే ప్రజల ఖాతాల్లోకి నేరుగా చేరే మొత్తం చాలా తక్కువ. 


ముక్కు పిండి వసూలుచేసేదే టీడీఎస్‌

టీడీఎస్‌ మినహాయింపులను తగ్గించడం వల్ల ప్రభుత్వంపై రూ.50 వేల కోట్ల భారం పడుతుందన్నది ప్యాకేజీలో చెప్పిన లెక్క. కానీ టీడీఎస్‌లో కొంత భాగాన్ని వాయిదావేశారే తప్ప రద్దుచేయలేదు. అంటే చివరగా పన్ను చెల్లించే సమయంలో ముక్కుపిండి వసూలుచేసే మొత్తమే అది. అలాగే మూడు నెలల మారటోరియం వల్ల రుణగ్రహీతలకు వాయిదాల (ఈఎంఐల) భారం పెరుగుతుందే తప్ప ప్రభుత్వానికి జరిగే నష్టమేమీ ఉండదు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ)లకు ఇస్తున్న కొల్లేటరల్‌ గ్యారంటీ వల్ల కూడా ప్రభుత్వంపై భారం పడదు. ముద్రా రుణాలపై ఇంట్రెస్ట్‌ సబ్వెన్షన్‌ కింద మాత్రం సర్కార్‌పై రూ.1,500 కోట్ల భారం పడుతుంది.

సగటు జీవులకు మోదీ సర్కార్‌ మొండిచెయ్యి

ఇచ్చేది అప్పులే

ప్రస్తుతం అనేక కష్టనష్టాలను ఎదుర్కొంటున్న సామాన్య ప్రజానీకానికి ఈ ప్యాకేజీ స్వాంతన కల్పించడంలేదు. వీటి నుంచి బయటపడేందుకు వారికి అప్పులను మాత్రమే ఇస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇది వడ్డీతో కూడిన అప్పే తప్ప ఉచితంగా నయాపైసా ఇవ్వడంలేదు. ఈ కష్టకాలంలో జీతం తగ్గి బాధపడుతున్న వేతనజీవిని మోదీ సర్కార్‌ ఆదుకోలేకపోయింది. పీఎఫ్‌ను తగ్గించుకొని తద్వారా మిగిలే సొమ్ముతో బతకమన్నదే తప్ప వారి వేతనాలను కాపాడలేకపోయింది. బ్యాంకుల నుంచి తీసుకొన్న రుణాల చెల్లింపులను వాయిదా వేసుకోమన్నదే కానీ, కనీసం వడ్డీని కూడా మాఫీ చేయలేదు. ఈ మొత్తం ప్యాకేజీలో సగటుజీవికి అందిన సాయం శూన్యమనే చెప్పాలి. కనీసం రుణభారం కూడా తగ్గలేదు. జీఎస్టీ సహా ప్రత్యక్ష, పరోక్ష పన్నుల్లో ప్రభుత్వం ఒక్కదాన్ని కూడా తగ్గించలేదు. పైపెచ్చు పెట్రోల్‌, డీజీల్‌పై సుంకాలను ఇబ్బడిముబ్బడిగా పెంచి జనానికి వాతలు పెట్టింది. అలాగే, టోల్‌ ట్యాక్స్‌ను కూడా పెంచింది. వీటికితోడుగా త్వరలో కరోనా సెస్‌ విధించినా ఆశ్చర్యపోనక్కరలేదు.

దేశానికి దుర్దినం..

కరోనా సంక్షోభంపై కార్మిక సంఘాలు, సామాజిక ప్రతినిధులతోపాటు ఇతర భాగస్వాములతో చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం సిగ్గుపడుతున్నది. తమ సొంత సిద్ధాంతాలు, ఆలోచనలపై మోదీ సర్కార్‌కు నమ్మకం లేదని దీనిద్వారా రుజువవుతున్నది. ఇది అత్యంత గర్హనీయం. ఎనిమిది కీలక రంగాలను ఆదుకొనేందుకు శనివారం మోదీ సర్కార్‌ ప్రకటించిన విధాన చర్యలు.. ఉద్యోగాల్లో కోతలకు దారితీస్తాయి. తాజా ప్యాకేజీలో తొలి మూడురోజులు వివిధ ఉద్దీపనలతో జనాన్ని ఊరించిన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌.. నాలుగో రోజు ప్రకటనలతో వారి ఆశలను నీరుగార్చారు. ఇది దేశానికి, ప్రజలకు దుర్దినం.

- విర్జేశ్‌ ఉపాధ్యాయ్‌, బీఎంఎస్‌ ప్రధాన కార్యదర్శి

ఇవ్వాల్సింది కొండంత.. ఇచ్చింది గోరంత

ప్రస్తుత సంక్షోభం నుంచి ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించేందుకు మోదీ సర్కార్‌ ప్రకటించిన ఉద్దీపనలు ఏమాత్రం సరిపోవు. ఇవ్వాల్సింది కొండంత.. ఇచ్చింది గోరంత. రూ.20 లక్షల కోట్లతో ఈ ఆర్థిక ప్యాకేజీని ఇస్తున్నామని, దీని మొత్తం విలువ జీడీపీలో 10 శాతమని మోదీ సర్కార్‌ చెప్పింది. వాస్తవానికి ఈ ప్యాకేజీ ద్వారా కేంద్రం ఇచ్చేది రూ.1.86 లక్షల కోట్లే. దీని విలువ జీడీపీలో 0.91 శాతం మాత్రమే. కనీసం 1 శాతం కూడా విదల్చలేదు. కష్టకాలంలో పేదలు, వలసజీవులు, రైతులు, కూలీలు, కార్మికులు, చిరువ్యాపారులు, మధ్యతరగతి ప్రజలకు మోదీ సర్కార్‌ మొండిచెయ్యి చూపింది.   

 - పీ చిదంబరం, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత

 ఆ నిర్ణయంపై పునరాలోచన చేయండి

భారీ పరిశ్రమలు, కార్పొరేట్‌ సంస్థలు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థ (ఎంఎస్‌ఎంఈ)ల చెల్లింపులపై కేంద్ర నిర్ణయాన్ని పునరాలోచించాలి. ఈ కంపెనీలు బకాయిలు చెల్లించకున్నా ఒత్తిడిచేయబోమని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి ప్రకటించడం ఆక్షేపణీయం.

- కరుణేంద్ర జాస్తి, ఎఫ్‌టీసీసీఐ తెలంగాణ శాఖ అధ్యక్షులు 


భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు  నరేంద్రమోదీ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన సంస్కరణలు, ఉద్దీపనలు 2021లో జీడీపీ పతనాన్ని ఆపలేవు. ఈ చర్యల వల్ల తక్షణ ప్రభావమేమీ ఉండదు. వ్యాపార సంస్థలు తమ స్వల్పకాలిక సవాళ్లను ఎదుర్కొనేందుకు ఈ చర్యలు దోహదపడవు. మూడేండ్ల తర్వాత జీడీపీ వృద్ధి చెందేందుకు, దీర్ఘకాలంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు మాత్రమే ఈ చర్యలు ఉపకరించవచ్చు.  

 - బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా, నోమురా


logo