బుధవారం 08 ఏప్రిల్ 2020
Business - Jan 15, 2020 , 00:25:37

ఓయో ఉద్యోగులకు మరో షాక్‌

ఓయో ఉద్యోగులకు మరో షాక్‌
  • ఈ వారం 2,400 మందిపై వేటు
  • మార్చిలో మరికొందరికి ఉద్వాసన

న్యూఢిల్లీ, జనవరి 14: ఆతిథ్య సేవల రంగంలోని ప్రముఖ సంస్థల్లో ఒకటైన ‘ఓయో’ తమ ఉద్యోగుల సంఖ్యను రోజురోజుకూ కుదించుకొంటున్నది. ఇటీవల భారత్‌, చైనాలో 1,800 మంది సిబ్బందికి ‘పింక్‌ స్లిప్పులు’ జారీచేసిన ఓయో.. ఈ వారం భారత్‌లోని తమ మొత్తం సిబ్బందిలో దాదాపు 2,400 మందిపై లేదా దాదాపు 25 శాతం మందిపై వేటు వేయడంతోపాటు మార్చి నెలలో మరికొంత మందికి ఉద్వాసన పలుకనున్నట్టు తెలుస్తున్నది. ఓయో హోటల్స్‌ అండ్‌ హోమ్స్‌ సంస్థ వ్యవస్థాపకుడు రితేశ్‌ అగర్వాల్‌ సోమవారం తమ ఉద్యోగులకు పంపిన అంతర్గత ఈ-మెయిల్‌తో ఈ ఉద్వాసనలు మొదలయ్యాయని, ప్రధానంగా మిడ్‌-మేనేజ్‌మెంట్‌, బిజినెస్‌ డెవలప్‌మెంట్‌, సేల్స్‌ అండ్‌ ఆపరేషన్స్‌ సిబ్బందితోపాటు ఎంపికచేసిన కొన్ని టెక్నాలజీ టీమ్స్‌పై వేటు పడనున్నదని అభిజ్ఞవర్గాలు వెల్లడించాయి.

ప్రస్తుతం భారత్‌లో ఉద్యోగుల సంఖ్యను కనీసం 25 శాతం తగ్గించాలని యోచిస్తున్న ఓయో.. మార్చి నెలలో మరోసారి ఉద్యోగుల కుదింపు ప్రక్రియను చేపట్టేందుకు సిద్ధమవుతున్నదని, అనవసర ఖర్చులను తగ్గించుకోవాలని ఓయో భావిస్తుండటమే ఇందుకు కారణమని కంపెనీ టాప్‌ ఎగ్జిక్యూటివ్‌ ఒకరు తెలిపారు. ప్రస్తుతం ఓయోకు భారత్‌లో 10 వేలమంది, చైనాలో 12 వేలమంది సిబ్బంది ఉన్నారు. ఓయోలో ఇటీవల సాఫ్ట్‌ బ్యాంక్‌ 1.5 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టడంతో కంపెనీ మార్కెట్‌ విలువ 10 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నది.


logo