గురువారం 09 ఏప్రిల్ 2020
Business - Jan 12, 2020 , 01:30:53

ఉద్యోగులకు షాకిచ్చిన ఓయో!

ఉద్యోగులకు షాకిచ్చిన ఓయో!
  • 3 వేల మందిపై వేటు!

న్యూఢిల్లీ, జనవరి 11: ప్రముఖ ఆతిథ్య సేవల సంస్థ ఓయో..ఉద్యోగులకు షాకిచ్చింది. భారత్‌తోపాటు చైనాల్లో వేలమంది సిబ్బందికి పింక్‌ స్లిప్‌ను జారీ చేసింది. అంచనాలకు అందుకోని, పనితీరు సరిగా లేని సిబ్బందిపై వేటు వేస్తున్న సంస్థ.. తాజాగా భారత్‌, చైనాల్లో 1,800 మంది సిబ్బందిని తొలగించినట్లు తెలుస్తున్నది. బ్లూంబర్గ్‌ నివేదిక ప్రకారం..చైనాలో 12,000 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా, వీరిలో ఐదు శాతం అంటే 600 మంది సిబ్బందిపై వేటు వేసిన సంస్థ..భారత్‌లో ఉన్న 10 వేల మంది ఉద్యోగుల్లో 12 శాతం లేదా 1,200 మందిని తొలగించింది. వచ్చే మూడు నుంచి నాలుగు నెలలకాలంలో భారత్‌లో మరో 1,200 మంది సిబ్బందికి ఉద్వాసన పలుకబోతున్నట్లు బ్లూంబర్గ్‌ తన నివేదికలో వెల్లడించింది. కంపెనీ వ్యవస్థాపకుడు రితేష్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ.


పనిచేయడానికి సురక్షితమైన ప్లాట్‌ఫాంను తీర్చిదిద్దడంలో భాగంగా ఉద్యోగులకు అన్ని అవకాశాలు ఇచ్చినట్లు, వీటిలో మంచి మెరిట్‌ సాధించినవారికి ఎలాంటి ఢోకా లేదని, కానీ, పనితీరు కనబర్చని వారిపై వేటు వేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. కంపెనీ పునర్‌ వ్యవస్థీకరణలో భాగంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని, వీటిలో అనవసర ఖర్చులు తగ్గించుకోవడానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు, దీంట్లోభాగంగా సిబ్బందిపై పెట్టే ఖర్చు అధికంగా ఉండటంతో తొలుత వీటిపై దృష్టి సారించినట్లు చెప్పారు. దీంతోపాటు చైనాలో సంస్థకు వ్యతిరేకంగా అక్కడి హోటల్‌ యజమానులు ఆందోళన బాట పట్టడం కూడా ఇందుకు కారణమన్నారు. లాయల్టి చెల్లింపుల విషయంలో ఓయోకు అక్కడి హోటల్‌ ఓనర్ల మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. ఓయోలో సాఫ్ట్‌ బ్యాంక్‌ ఇటీవల 1.5 బిలియన్‌ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టడంతో కంపెనీ మార్కెట్‌ విలువ 10 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నది.


logo