శనివారం 06 జూన్ 2020
Business - Apr 16, 2020 , 00:58:07

గగనతలం గడబిడ

గగనతలం గడబిడ

  • ప్రమాదంలో 20 లక్షల ఉద్యోగాలు
  • దేశీయ విమానయాన రంగంపై కరోనా తీవ్ర ప్రభావం
  • హెచ్చరించిన ఐఏటీఏ

భారతీయ విమానయాన రంగం పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినైట్లెంది. అసలే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న దేశీయ విమానయాన సంస్థలు.. కరోనా దెబ్బకు రెక్కలు తెగిన పక్షుల్లా కూలబడ్డాయి. ఎగిరేందుకు వీల్లేకుండా లాక్‌డౌన్‌ ఆంక్షలు వచ్చిపడగా.. దేశ, విదేశీ సర్వీసులన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో ఈ రంగంలో లక్షలాది ఉద్యోగాలు పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత విమానయాన, దాని అనుబంధ రంగాల్లో 20 లక్షలకుపైగా ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయని అంతర్జాతీయ విమానయాన రవాణా సంఘం  (ఐఏటీఏ) చెప్తున్నది.

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 15: దేశీయ విమానయాన రంగాన్ని కరోనా వైరస్‌ కుదిపేస్తున్నది. తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న విమాన పరిశ్రమను లాక్‌డౌన్‌ పరిస్థితులు దారుణంగా దెబ్బతీశాయి. దీనివల్ల విమానయాన, దాని అనుబంధ-ఆధారిత రంగాల్లో 20 లక్షలకుపైగా ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయని అంతర్జాతీయ విమానయాన రవాణా సంఘం (ఐఏటీఏ) బుధవారం హెచ్చరించింది. దేశంలో వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్‌ కట్టడికి కేంద్ర ప్రభుత్వం గత నెల 24 నుంచి 21 రోజుల లాక్‌డౌన్‌ను అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. అయితే మే 3దాకా ఈ లాక్‌డౌన్‌ కొనసాగుతుందని మోదీ సర్కారు తాజాగా నిర్ణయం తీసుకున్న సంగతీ విదితమే. 

ఈ క్రమంలో ఆదాయం లేక విమానయాన సంస్థలకు ఉద్యోగుల జీతాలను చెల్లించడం సవాల్‌గా మారిందని ఐఏటీఏ తెలిపింది. వేతనాల్లో కోత పెట్టడం, ఉద్యోగులనే తొలగించే దిశగా వెళ్లే పరిస్థితి ఏర్పడుతున్నదని చెప్పింది. ఇప్పటికే చాలా సంస్థలు జీతాల్లేని సెలవులను ఉద్యోగులకు బలవంతంగా ఇచ్చేస్తున్నాయని గుర్తుచేసింది. ప్రస్తుతం కార్గో విమానాలు మినహా ప్యాసింజర్‌ విమానాలు ఎగరడం లేదు. ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తున్న కరోనా అంతానికి మొత్తం రవాణా వ్యవస్థను స్తంభింపజేయడమే ఉత్తమమని కేంద్రం భావించింది. అందుకే విమానయాన రంగం విజ్ఞప్తులను పక్కకు పెట్టింది. దీంతో పాక్షికంగానైనా ఈసారి వెసులుబాటు లభిస్తుందనుకున్న విమాన పరిశ్రమకు నిరాశే ఎదురైంది.

కోల్పోనున్న రూ.70వేల కోట్ల ఆదాయం 

భారతీయ విమానయాన పరిశ్రమకు ప్రయాణీకుల నుంచి వచ్చే ఆదాయం దాదాపు రూ.70 వేల కోట్లు దూరమైందని ఐఏటీఏ ఈ సందర్భంగా అంచనా వేసింది. ప్యాసింజర్‌ డిమాండ్‌ 36 శాతం పడిపోయిందన్న ఐఏటీఏ.. ఈ క్రమంలోనే 20 లక్షలకుపైగా ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయన్నది. ఈ కష్టకాలంలో ప్రభుత్వం పరిశ్రమను ఆదుకోవాలని ఐఏటీఏ ఆసియా-పసిఫిక్‌ కార్పొరేట్‌ కమ్యూనికేషన్స్‌ ఏడీ ఆల్బర్ట్‌ జోయెంగ్‌ కోరారు. కొత్త రుణాల మంజూరు, రుణాల పూచీకత్తు, కార్పొరేట్‌ బాండ్‌ మార్కెట్‌లో మద్దతు అవసరమని అభిప్రాయపడ్డారు. పన్నుల మినహాయింపులు, ప్రోత్సాహకాలతోపాటు ఏరోనాటికల్‌ చార్జీలను పూర్తిగా లేదంటే పాక్షికంగా రద్దు చేయాలని కేంద్రానికి సూచించారు.

నిమిషానికి రూ.3.77 కోట్ల  నష్టం

కరోనా వైరస్‌ సృష్టిస్తున్న బీభత్సంతో అంతర్జాతీయ విమానయాన కార్యకలాపాలు దాదాపుగా నిలిచిపోయాయి. దీనివల్ల విమాన పరిశ్రమకు నిమిషానికి సుమారు రూ.3.77 కోట్ల నష్టం వాటిల్లుతున్నదని ఐఏటీఏ ప్రకటించింది.  గత నెల 42,94,685 విమానాలు తిరిగినట్లుగా గుర్తించారు. గతేడాది మార్చితో పోల్చితే ఇది 21.9 శాతం తక్కువ. వాణిజ్య విమానాల విషయంలో ఈ తగ్గుదల 27.7 శాతంగా నమోదవడం గమనార్హం. మొత్తంగా పరిశ్రమ 314 బిలియన్‌ డాలర్ల ఆదాయం కోల్పోయిందని, జూన్‌కల్లా ఈ రంగానికి నగదు కొరత తప్పదని ఐఏటీఏ హెచ్చరిస్తున్నది. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకుగాను ప్రపంచవ్యాప్తంగా వందలాది దేశాలు లాక్‌డౌన్‌లోకి వెళ్లాయి. రాకపోకలపై ఆంక్షలు విధించాయి. ముఖ్యంగా మార్చి చివరి వారంలో మొదలైన ఈ ప్రభావం.. ఏప్రిల్‌ ప్రథమార్ధం పూర్తిగా కొనసాగింది. ద్వితీయార్ధంలోనూ ఇంతే అన్నట్లుగా ఉన్నది. దీంతో ప్రపంచ విమానయాన రంగం తీవ్ర సంక్షోభంలో పడటం ఖాయమన్న అభిప్రాయాలు విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నాయి.


logo