శనివారం 04 ఏప్రిల్ 2020
Business - Mar 06, 2020 , 00:47:15

రూ.8.29 లక్షల కోట్లు

రూ.8.29 లక్షల కోట్లు
  • ఈ ఏడాది విమానయాన రెవిన్యూ నష్టంపై ఐఏటీఏ అంచనా
  • కరోనా నేపథ్యంలో భారీగా తగ్గిన అంతర్జాతీయ ప్రయాణాలు
  • చాలా దేశాల రూట్లను నిలిపివేస్తున్న ఎయిర్‌లైన్స్‌
  • ఇప్పటివరకు 2లక్షలకుపైగా విమాన సర్వీసులు రద్దు

సింగపూర్‌, మార్చి 5: కరోనా వైరస్‌ ప్రభావం ప్రపంచ విమానయాన రంగంపై స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ అంటువ్యాధి ఒక దేశం నుంచి మరో దేశానికి వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో విమాన ప్రయాణాలు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఆయా దేశాల ప్రభుత్వాల ఆదేశాలతో ఎయిర్‌లైన్స్‌ సైతం తమతమ రూట్లను పెద్ద ఎత్తున తగ్గించేస్తున్నాయి. కొన్ని మార్గాలకైతే తాత్కాలికంగా సేవలను నిలిపివేస్తున్నాయి. దీంతో ఈ ఏడాది అంతర్జాతీయ విమానయాన పరిశ్రమకు రూ.8.29 లక్షల కోట్ల (113 బిలియన్‌ డాలర్లు) ఆదాయం వరకు పడిపోవచ్చని అంతర్జాతీయ వాయు రవాణా సంఘం (ఐఏటీఏ) గురువారం అంచనా వేసింది. రెండు వారాల క్రితం ఈ అంచనా కేవలం రూ.29.3 బిలియన్‌ డాలర్లుగానే ఉండటం గమనార్హం. 


కానీ ఇప్పుడది నాలుగింతలు పెరిగింది. వైరస్‌ నేపథ్యంలో 2లక్షలకుపైగా విమాన సర్వీసులు రద్దయ్యా యి. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి ధాటికి 3,200 మందికిపైగా చనిపోగా, 95వేల మందికిపైగా బాధితులున్నారు. మొదట్లో వైరస్‌ ప్రభావం చైనాలోనే ఎక్కువగా కనిపించింది. ప్రస్తుతం 80 దేశాలకు వ్యాపించింది. భారత్‌లోనూ 29 కేసులు నమోదైయ్యాయి. ఈ నేపథ్యంలో విదేశీ ప్రయాణాలు మానుకోవాలని కేంద్ర ప్రభుత్వం సైతం ప్రజలకు సూచిస్తున్నది. అన్ని దేశాల తీరూ ఇలాగే ఉండటంతో ఆ ప్రభావం విమానయాన రంగం రెవిన్యూను దెబ్బతీస్తున్నది. ఇదిలావుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్‌ ఇండియా వాటాల అమ్మకం కష్టమేనన్న అభిప్రాయాన్ని ఐఏటీఏ వ్యక్తం చేసింది.


భారత వాణిజ్యంపై ప్రభావం

భారత వాణిజ్యంపై కరోనా వైరస్‌ ప్రభావం దాదాపు రూ.2,556 కోట్లు (348 మిలియన్‌ డాలర్లు)గా ఉండొచ్చని ఐక్యరాజ్య సమితి (యూఎన్‌) అంచనా వేసింది. టాప్‌-15 వైరస్‌ ప్రభావిత దేశ ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌ కూడా ఉందని తెలిపింది. చైనా ఉత్పాదక రంగం కుప్పకూలిన నేపథ్యంలో ప్రపంచ వాణిజ్యం కూడా దెబ్బతిన్నదని చెప్పింది. చైనాయేతర దేశాల్లో అత్యధికంగా యూరోపియన్‌ యూనియన్‌ దేశాల ఆర్థిక వ్యవస్థలు 15.6 బిలియన్‌ డాలర్ల మేర నష్టపోతున్నాయని యూఎన్‌ వెల్లడించింది. ఆ తర్వాత అమెరికా (5.8 బిలియన్‌ డాలర్లు), జపాన్‌ (5.2 బిలియన్‌ డాలర్లు), దక్షిణ కొరియా (3.8 బిలియన్‌ డాలర్లు), తైవాన్‌ (2.6 బిలియన్‌ డాలర్లు), వియత్నాం (2.3 బిలియన్‌ డాలర్లు) దేశాలున్నాయి. ఇన్‌స్ట్రూమెంట్స్‌, మెషినరీ, ఆటోమోటివ్‌, క మ్యూనికేషన్‌ విడిభాగాల రంగాలు వైరస్‌ ప్రభావంతో చతికిలపడ్డట్లు యూఎన్‌ పేర్కొన్నది. భారత్‌లో రసాయన పరిశ్రమ 129 మిలియన్‌ డాలర్ల మేర ప్రభావితం కానుండగా, టెక్స్‌టైల్స్‌, దుస్తులు 64 మిలియన్‌ డాలర్లు, ఆటోమోటివ్‌ రంగం 34 మిలియన్‌ డాలర్లు, ఎలక్ట్రికల్‌ మెషినరీ 12 మిలియన్‌ డాలర్లు, తోలు ఉత్పత్తులు 13 మిలియన్‌ డాలర్లు, మెటల్స్‌, దాని ఆధారిత ఉత్పత్తులు 27 మిలియన్‌ డాలర్లు, కలప, ఫర్నీచర్‌ ఉత్పత్తులు 15 మిలియన్‌ డాలర్ల చొప్పున నష్టపోనున్నాయి.


logo