బుధవారం 03 జూన్ 2020
Business - Apr 12, 2020 , 00:58:11

పోస్టల్‌ జీవిత బీమాదారులకు ఊరట

పోస్టల్‌ జీవిత బీమాదారులకు ఊరట

  • మార్చి-మే ప్రీమియం చెల్లింపుల గడువు పెంపు  
  • జూన్‌ 30 వరకు చార్జీలుండవు
  • 3 కోట్ల మందికిపైగా లబ్ధి

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 11: తపాలా శాఖ తమ జీవిత బీమా పాలసీదారులకు గొప్ప ఊరటనిచ్చింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రీమియం చెల్లింపుల గడువును మూడు నెలలు పొడిగించింది. తపాలా జీవిత బీమా (పీఎల్‌ఐ), గ్రామీణ తపాలా జీవిత బీమా (ఆర్పీఎల్‌ఐ) పాలసీదారులు మార్చి, ఏప్రిల్‌, మే నెలల ప్రీమియంలను జూన్‌ 30 వరకు చెల్లించవచ్చని తెలిపింది. ఇందుకు ఎలాంటి జరిమానాలు, చార్జీలు ఉండబోవని శనివారం ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. దీంతో 3 కోట్ల మందికిపైగా లబ్ధి చేకూరింది. అధికారిక గణాంకాల ప్రకారం మార్చిలో 64.62 లక్షల పీఎల్‌ఐ పాలసీలు, 2.5 కోట్ల ఆర్పీఎల్‌ఐ పాలసీలు మనుగడలో ఉన్నాయి.  

మార్చి, ఏప్రిల్‌ ఎల్‌ఐసీ ప్రీమియంలపైనా..

కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో మార్చి, ఏప్రిల్‌ నెలల్లోని ప్రీమియంల చెల్లిం పు గడువును ఎల్‌ఐసీ 30 రోజులు పెంచింది. లాక్‌డౌన్‌ మధ్య పాలసీదారుల ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నది. ఉదాహరణకు ఫిబ్రవరి ప్రీమియంల చెల్లింపు గడువుకున్న గ్రేస్‌ పీరియడ్‌ మార్చి 22 తర్వాత కూడా ఉన్నైట్లెతే అవి ఈ నెల 15 వరకు చెల్లించవచ్చని ఎల్‌ఐసీ శనివారం ప్రకటించింది. అలాగే ఆరోగ్య పరిస్థితులతో నిమిత్తం లేకుండా పాలసీలను ఆన్‌లైన్‌లో పునరుద్ధరించుకోవచ్చని, సర్వీస్‌ చార్జీ లేకుండా ఎల్‌ఐసీ డిజిటల్‌ పేమెంట్‌ సదుపాయాల ద్వారా ప్రీమియంలను చెల్లించుకోవచ్చని చెప్పింది.  డిజిటల్‌ పేమెంట్స్‌ విధానాల ద్వారా ప్రీమియంలను చెల్లించవచ్చని వెల్లడించింది.logo