శనివారం 28 మార్చి 2020
Business - Jan 17, 2020 , 00:48:44

దక్షిణాదిలో ఓరియంట్‌ ప్లాంట్‌!

దక్షిణాదిలో ఓరియంట్‌ ప్లాంట్‌!


హైదరాబాద్‌, జనవరి 16: సీకే బిర్లా గ్రూపునకు చెందిన ఎలక్ట్రిక్‌ పరికరాల తయారీ సంస్థ ఓరియంట్‌..దక్షిణాదిలో ప్లాంట్‌ ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. ఇది వరకే దేశవ్యాప్తంగా ఉన్న ఐదు ప్లాంట్లు పూర్తి స్థాయి కెపాసిటీతో నడుస్తున్నాయని, దక్షిణాదిలో వ్యాపారాన్ని మరింత విస్తరించాలనే ఉద్దేశంలో ఇక్కడే యూనిట్‌ను నెలకొల్పాలని నిర్ణయించినట్లు కంపెనీ వైస్‌ ప్రెసిడెంట్‌ అతుల్‌ జైన్‌ తెలిపారు. ఈ ప్లాంట్‌ను ఎక్కడ, ఎంతమేర పెట్టుబడితో ఏర్పాటు చేసేదానిపై ఆయన స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. వచ్చే రెండు మూడు నెలల్లో ఇందుకు సంబంధించి ప్రకటన చేయనున్నట్లు రాష్ట్ర మార్కెట్లోకి విలాసవంతమైన షాండ్లియర్‌ను విడుదల చేసిన అనంతరం ఆయన ఈ విషయాలు వెల్లడించారు.


ఈ ప్లాంట్లోనే ఫ్యాన్లతోపాటు ఇతర ఎలక్ట్రిక్‌ ఉత్పత్తులను తయారు చేయనున్నది. నూతన ఎలిగాంజా పేరుతో విడుదల చేసిన మూడు రకాల్లో లభించనున్న ఎయిర్‌-సర్క్యూలేటింగ్‌ లగ్జరీ షాండ్లియర్‌ ప్రారంభ ధర రూ.17,500గా నిర్ణయించింది. గరిష్ఠంగా రూ.23,500 లోపు లభించనున్నాయి. వినియోగదారులు ప్రపంచ స్థాయి ఉత్పత్తులను కోరుకుంటున్నారని, వీటికోసం ఎంతైన ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉండటంతో వీటికి అనూహ్యంగా డిమాండ్‌ నెలకొంటుందన్నారు. రిమోట్‌ కంట్రోల్‌ ద్వారా ఈ షాండ్లియర్స్‌కు ఉన్న ఎల్‌ఈడీ లైట్లను సులభంగా నియంత్రించుకునే వీలుంటుంది. గతేడాది రూ.1,864 కోట్ల గ్రూపు ఆదాయాన్ని ఆర్జించిన సంస్థ.. ఏప్రిల్‌-సెప్టెంబర్‌ మధ్యకాలంలో 20 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నది.


logo