శుక్రవారం 14 ఆగస్టు 2020
Business - Jul 04, 2020 , 15:33:03

బంగారం తక్కువ ధరకు కావాలా? ఇలా ప్రయత్నించండి!

బంగారం తక్కువ ధరకు కావాలా? ఇలా ప్రయత్నించండి!

ముంబై : కరోనా సంక్షోభం ఉన్న ప్రస్తుత సమయంలో బంగారంపై పెట్టుబడి ధోరణి పెరిగింది. ఆర్థిక అనిశ్చితి కాలంలో ప్రజలు బంగారంలో భారీగా పెట్టుబడులు పెడతున్నారు. మీరు కూడా బంగారంలో పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఎల్లుండి అనగా 6 వ తేదీ నుంచి ఐదు రోజులపాటు అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే నాలుగో సిరీస్ సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2020-21లో పెట్టుబడి పెట్టే అవకాశం మీ ముందుకు రానున్నది. ఈ సిరీస్ బంగారు బాండ్ ధర గ్రాముకు రూ.4,852 గా నిర్ణయించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ఏప్రిల్ 20 నుంచి సెప్టెంబర్ వరకు ఆరు దశల్లో ప్రభుత్వం సావరిన్ గోల్డ్ బాండ్లను ప్రవేశపెడుతుందని ఆర్బీఐ.. ఏప్రిల్‌లో ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం తరపున రిజర్వ్ బ్యాంక్ సావరిన్ గోల్డ్ బాండ్ 2020-21 పథకాన్ని జారీ చేస్తుంది. 

బాండ్ తేదీకి ముందు మూడు పని రోజుల్లో సగటున 999 స్వచ్ఛత గల బంగారం ముగింపు ధర ఆధారంగా బంగారం ధర గ్రాముకు రూ.4,852 గా నిర్ణయించినట్లు ఆర్‌బిఐ తెలిపింది. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ ఇచ్చిన ముగింపు ధర సగటు ప్రకారం ఈ ధరను నిర్ణయిస్తారు. ఈ బంగారు బాండ్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొని ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించే వారికి గ్రాముకు రూ.50 రిబేటు కూడా ఇస్తున్నామని.. ఇలాంటి వారికి బంగారు బాండ్ల ఇష్యూ ధర గ్రాముకు రూ.4,802గా ఉంటుంది అని ఆర్బీఐ తెలిపింది. జూన్‌లో సెంట్రల్ బ్యాంక్ తీసుకువచ్చిన బాండ్ సమయంలో బంగారం ధర గ్రాముకు రూ.4,677 గా ఉన్నది. 

బాండ్‌ ప్రత్యేక లక్షణాలు:

భారతదేశంలో నివసిస్తున్న పౌరులు, హిందూ అవిభక్త కుటుంబాలు, ట్రస్టులు, విశ్వవిద్యాలయాలు, స్వచ్ఛంద సంస్థలు ఈ బంగారు బాండ్ పథకం కింద పెట్టుబడులు పెట్టవచ్చు. ఈ బాండ్‌ను కనీసం ఒక గ్రాముతో పెట్టుబడితో పొందవచ్చు. ఒక వ్యక్తి లేదా హిందూ అవిభక్త కుటుంబం ఆర్థిక సంవత్సరంలో ఈ పథకంలో నాలుగు కిలోల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ట్రస్ట్ వంటి సంస్థలు ఆర్థిక సంవత్సరంలో 20 కిలోల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. సావరిన్ బంగారు బాండ్ల వ్యవధి ఎనిమిది సంవత్సరాలు. గోల్డ్ బాండ్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2015 నవంబర్‌లో ప్రారంభించింది.


logo