శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Business - Dec 23, 2020 , 02:03:38

గ్లోబల్‌ 5జీ అనుభవాన్ని విస్తరించే దిశగా ఒప్పో

గ్లోబల్‌ 5జీ అనుభవాన్ని విస్తరించే దిశగా ఒప్పో

  • హైదరాబాద్‌ కేంద్రంగా దేశంలో నూతన పరిశోధనలు
  • ఇన్నోవేషన్‌ ల్యాబ్‌లపై స్మార్ట్‌ఫోన్‌ సంస్థల చూపు

హైదరాబాద్‌, డిసెంబర్‌ 22: సాంకేతిక విప్లవాన్ని కొత్త పుంతలు తొక్కిస్తూ వస్తున్న 5జీ టెక్నాలజీని మరింత వేగంగా విస్తారించాలని స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థలు భావిస్తున్నాయి. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో దేశంలో 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయన్న అంచనాల మధ్య గ్లోబల్‌ 5జీ అనుభవాన్ని భారత్‌కు తెచ్చే ప్రయత్నం చేస్తున్నది చైనా స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం ఒప్పో. ఇందులో భాగంగానే మంగళవారం హైదరాబాద్‌లోని తమ ఆర్‌అండ్‌డీ సెంటర్‌లో 5జీ ఇన్నోవేషన్‌ ల్యాబ్‌ను ప్రారంభించింది. దేశంలో ఒప్పోకిది తొలి ఇన్నోవేషన్‌ ల్యాబ్‌. చైనాలో కాకుండా కేవలం భారత్‌లోనే.. అదికూడా హైదరాబాద్‌లోనే తమ ఇన్నోవేషన్‌ ల్యాబ్‌ను ఒప్పో ఏర్పాటు చేయడం గమనార్హం.

ల్యాబ్‌లో ఏం చేయనున్నారు?

5జీ ఇన్నోవేషన్‌ ల్యాబ్‌ అనేది టెక్నాలజీ లీడర్లు, వైర్‌లెస్‌ సేవల సంస్థలు, డెవలపర్లు, టెలికం సంస్థల కోసం ఏర్పాటు చేసే ఓ గ్లోబల్‌ ఎకోసిస్టమ్‌. 5జీ శక్తి, సామర్థ్యాలను మరింత లోతుగా అధ్యయనం చేసి భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా దాన్ని రూపాంతరం చెందిస్తారు. కొత్తకొత్త పరిశోధనలకు ఇదో వేదికగా నిలుస్తుంది. హైదరాబాద్‌ ఆర్‌అండ్‌డీ సెంటర్‌ వద్ద ఇన్నోవేషన్‌ వర్క్‌లో భాగంగా కెమెరా, పవర్‌, బ్యాటరీ, పనితీరుల అధ్యయనం-రిసెర్చ్‌లకుగాను మరో మూడు ల్యాబ్‌లను తీసుకురావాలని ఒప్పో యోచిస్తున్నది.

హైదరాబాద్‌లోనే ఎందుకు?

హైదరాబాద్‌.. బహుళజాతి కంపెనీలకు చిరునామాగా నిలుస్తున్నది. ఇక్కడి మౌలిక సదుపాయాలు విదేశీ సంస్థలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. సుస్థిర ప్రభుత్వంతో వ్యాపార కార్యకలాపాలకు అనువైన వాతావరణం నెలకొన్నది. పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలా సహకరిస్తుండటం కూడా కలిసొస్తున్నది. ప్రతిభగల యువత అందుబాటులో ఉండటం, నైపుణ్యాభివృద్ధికి తెలంగాణ సర్కారు పెద్దపీట వేయడం కూడా ఆయా రంగాల్లోని సంస్థలను ముఖ్యంగా టెక్నాలజీ సంస్థలకు అనుకూలిస్తున్నదని నిపుణులు చెప్తున్నారు.


VIDEOS

logo