బుధవారం 02 డిసెంబర్ 2020
Business - Sep 13, 2020 , 00:53:11

ఈ కొనుగోళ్లకు జై

ఈ కొనుగోళ్లకు జై

  • భారీగా పెరిగిన ఆన్‌లైన్‌ కొనుగోళ్లు 
  • కరోనా నేపథ్యంలో ఈ-కామర్స్‌ బాట

నిత్యావసరాల కోసం సూపర్‌మార్కెట్లు, వస్ర్తాల కోసం షాపింగ్‌ మాళ్లు, ఎలక్ట్రానిక్‌, ఇతర వస్తువుల కోసం షోరూంలకు వెళ్లడం కరోనా ముందుకాలం.. కానీ, పరిస్థితి మారిపోయింది. చాక్లెట్‌ డబ్బా మొదలు పెద్ద టీవీల వరకు, కర్చిఫ్‌ మొదలు ఖరీదైన వస్ర్తాల వరకు అన్నింటికీ ఈ-కామర్స్‌ వేదికైంది. బయటకు వెళ్లి కొంటే ఏ రూపంలో వైరస్‌ ముంచుకొస్తుందోనని ప్రజలు ఆన్‌లైన్‌ కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు.

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా కాలం ఈ-కామర్స్‌ సంస్థల పంట పండించింది. ప్రజల్లో నెలకొన్న వైరస్‌ భయం సంస్థల పాలిట వరమైంది. సరుకులే మన ఇంటికి వచ్చేస్తే రిస్క్‌ కాస్తయినా తగ్గుతుందని చాలామంది వినియోగదారులు భావిస్తుండటంతో లాక్‌డౌన్‌ తర్వాత ఆన్‌లైన్‌ ఆర్డర్లు, డోర్‌ డెలివరీలు పెరిగిపోయాయి. ఒక్క జూన్‌లోనే ఈ-కామర్స్‌ సంస్థలకు ఆర్డర్లు సాధారణం కంటే 17 శాతం పెరిగినట్టు తాజా సర్వేల్లో వెల్లడయింది. గతంలో మెట్రో నగరాలు, ద్వితీయశ్రేణి పట్టణాలనుంచి ఎక్కువగా ఆర్డర్లు వచ్చేవి. లాక్‌డౌన్‌ తర్వాత తృతీయశ్రేణి పట్టణాల్లోనూ అనూహ్యంగా పెరిగింది. కరోనా నేపథ్యంలో నేరుగా ముట్టుకొనేందుకు అవకాశంలేని ప్యాకేజింగ్‌ ఫుడ్స్‌ను కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే ఆన్‌లైన్‌ ఆర్డర్లలో ప్యాకింగ్‌ చేసిన సరుకులతోపాటు బిస్కెట్లు, చాక్లెట్లు వంటి ఫాస్ట్‌ మూవింగ్‌ కన్స్యూమర్‌ గూడ్స్‌ (ఎఫ్‌ఎంసీజీ) ఎక్కువగా ఉంటున్నాయి.