బుధవారం 12 ఆగస్టు 2020
Business - Jun 29, 2020 , 18:47:16

కరోనా కాలంలోనూ ఉద్యోగాలున్నాయ్‌!

కరోనా కాలంలోనూ ఉద్యోగాలున్నాయ్‌!

కరోనా వైరస్ వ్యాప్తి ఆర్థిక, వ్యాపార ప్రపంచంపై గణనీయమైన ప్రభావం చూపింది. వరుసగా అనేక రోజుల లాక్‌డౌన్‌ కారణంగా వివిధ సంస్థల ఆర్థిక స్థితిగతుల్లో మార్పులు వచ్చాయి. పలు సంస్థలు తమ కార్యకలాపాలను కొనసాగించేందుకు వీలుగా వర్క్‌ ఫ్రం హోంకు శ్రీకారం చుట్టాయి. పలు కంపెనీలు ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు ఉద్యోగుల తొలగింపునకు పూనుకొన్నాయి. ఒకవైపు కరోనా వైరస్‌ వ్యాప్తి.. ఇంకోవైపు ఉద్యోగం లేక ఆర్థిక సమస్యలు.. వెరసి నిరుద్యోగులు అష్టకష్టాలు పడుతున్నారని చెప్పవచ్చు. అయితే, లాక్‌డౌన్‌, కరోనా వైరస్  సంక్షోభ సమయంలో కూడా ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకొనేందుకు వీలున్నది. పలు కంపెనీలు బంపర్‌ రిక్రూట్‌మెంట్‌ జరిపేందుకు సిద్ధమవుతున్నాయి.

ఆర్థిక సంక్షోభం మధ్య లాక్‌డౌన్‌ యుగం ఇంటర్నెట్ కంపెనీలకు భారీ అవకాశాన్ని సృష్టించిందని చెప్పవచ్చు. ప్రస్తుత పరిస్థితులను ఉపయోగించుకోవటానికి ఆన్‌లైన్ కంపెనీలు దాదాపు 40,000 మందిని నియమించనున్నట్టు సమచారం. ఈ ఉద్యోగాల్లో తక్కువగా చదువుకున్న యువత నుంచి అనుభవజ్ఞులైన వ్యక్తుల వరకు అందుబాటులో ఉన్నాయి.

అమెజాన్ ఇండియాలో 20 వేల ఉద్యోగాలు

అమెజాన్ ఇండియా ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సిద్ధమైంది. అమెజాన్ ఇండియా నియామకాలు కస్టమర్ సేవా రంగంలో ఉంటాయి. దేశంలోని వివిధ నగరాల్లో భర్తీ చేసేలా నియామకాలను చేపట్టింది. హైదరాబాద్, పూణే, కోయంబత్తూర్, నోయిడా, కోల్‌కతా, జైపూర్, చండీగఢ్‌, మంగళూరు, ఇండోర్, భోపాల్, లక్నో వంటి పెద్ద నగరాల్లో నియామకాలు జరుపనున్నది. ఈ ఉద్యోగాల్లో చేరేవారు ఇమెయిల్, చాట్, సోషల్ మీడియా, ఫోన్ ద్వారా వినియోగదారులకు సేవలందిస్తూ ఉండాలి.

బిగ్‌ బాస్కెట్‌, గ్రోవర్స్‌లో కూడా..

బిగ్ బాస్కెట్, గ్రోయర్స్, పేటీఎం, భారత్ పే వంటి సంస్థలు కూడా పెద్ద సంఖ్యలో కొత్త ఉద్యోగాలు కల్పించనున్నాయి. లాక్‌డౌన్‌ వేళ ఆన్‌లైన్ మార్కెటింగ్‌లో భారీ పెరుగుదలకు దారితీసింది. బిగ్ బాస్కెట్, గ్రోవర్స్‌ వ్యాపారంలో భారీ పెరుగుదల నమోదైంది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని బిగ్ బాస్కెట్ 10వేల కొత్త ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయించగా.. గ్రోవర్స్‌ సంస్థ కూడా 2 వేల మందిని నియమించబోతున్నారు. వాస్తవానికి ఇప్పటివరకు ఈ సంస్థల్లో అంతగా పనిలేదు. ఇప్పుడు వారి మార్కెట్ డిమాండ్‌ను తీర్చడానికి మానవశక్తి అవసరం. అదేవిధంగా, పేటీఎం మాల్ కూడా వందలాది ఉద్యోగాలను అందించబోతున్నది. మొదటి దశలో 300 మందికి పైగా నియామకాలు జరుపనున్నారు.

అదేబాటలో ఈకామ్ ఎక్స్‌ప్రెస్‌

థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ సంస్థ ఈకామ్ ఎక్స్‌ప్రెస్ కూడా వేలాది మందికి ఉపాధి కల్పించాలని నిర్ణయించింది. ఈ సంస్థ రాబోయే రెండు నెలల్లో 7 వేలకు పైగా ఉద్యోగాలు ఇవ్వనున్నది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, హైదరాబాద్, సూరత్, చండీగఢ్‌, ఇండోర్, పాట్నా, లక్నో, కాన్పూర్, భోపాల్, జైపూర్‌లో ఈ నియామకాలు జరుగనున్నాయి.

ఈ అర్హతలు ఉంటే చాలు..

అమెజాన్ ఇండియా, బిగ్ బాస్కెట్, గ్రోయర్స్, ఇతర ఈ కామర్స్‌ సంస్థలు జరిపే నియామకాలకు అర్హతలను నిర్ణయించాయి. అభ్యర్థులు కనీస అర్హత 12 వ తరగతి ఉత్తీర్ణత ఉంటే చాలు. స్థానిక భాష మాట్లాడగలిగి ఉండాలని, ఎంత కష్టపడి  పనిచేస్తే అంత ఎక్కువ డబ్బు సంపాదించే వీలుంటుందని ఈ కామర్స్‌ సంస్థలు సూచిస్తున్నాయి. 


logo