శుక్రవారం 27 నవంబర్ 2020
Business - Oct 31, 2020 , 01:53:11

రిలయన్స్‌కు చమురుసెగ

రిలయన్స్‌కు చమురుసెగ

  • క్యూ2లో లాభం 15% డౌన్‌
  • రూ.9,567 కోట్లకు పరిమితం

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సర రెండో త్రైమాసికం (జులై-సెప్టెంబర్‌)లో తమ నికర లాభం 15 శాతం తగ్గినట్టు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) ప్రకటించింది. టెలికం లాంటి కన్జ్యూమర్‌ ఫేసింగ్‌ విభాగాలు మంచి పనితీరును కనబరుస్తున్నప్పటికీ చమురు, రసాయనాల వ్యాపారం మందకొడిగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణమని వెల్లడించింది. గతేడాది జులై-సెప్టెంబర్‌ త్రైమాసికంలో రూ.11,262 కోట్లుగా ఉన్న నికర లాభం ఈసారి రూ.9,567 కోట్లకు తగ్గినట్టు స్టాక్‌ ఎక్సేంజీకి ఆర్‌ఐఎల్‌ తెలియజేసింది. లాక్‌డౌన్‌ అనంతరం మార్కెట్లు క్రమంగా తెరుచుకోవడంతో రిటైల్‌ వ్యాపారం దాదాపు ఫ్లాట్‌గా రూ.39,199 కోట్ల వద్దనే ఉన్నదని, ఈబీఐటీడీఏ (ఎర్నింగ్స్‌ బిఫోర్‌ ఇంటరెస్ట్‌, ట్యాక్స్‌, డిప్రీసియేషన్‌, అండ్‌ అమోైర్టెజేషన్‌) 14 శాతం తగ్గి రూ.2,009 కోట్లకు చేరిందని వివరించింది. పెట్రోకెమికల్స్‌ విభాగంలో ఆదాయం 23 శాతం తగ్గి రూ.29,665 కోట్లకు, ప్రీ-ట్యాక్స్‌ ప్రాఫిట్‌ 33 శాతం తగ్గి రూ.5,964 కోట్లకు పడిపోయినట్టు వెల్లడించింది. అలాగే రిఫైనింగ్‌ విభాగంలో ఆదాయం 36 శాతం తగ్గడంతో ఈబీఐటీఏ దాదాపు సగానికి (రూ.3,002 కోట్లకు) పడిపోయినట్టు తెలిపింది. సమీక్ష కాలంలో కంపెనీ ఆదాయం రూ. 1.52 లక్షల కోట్ల నుంచి రూ. 1.20 లక్షల కోట్లకు పడిపోయింది. జియో ప్లాట్‌ఫామ్స్‌లో వాటా అమ్మకం ద్వారా రూ.1.52 లక్షల కోట్లు సమీకరించుకున్న ఆర్‌ఐఎల్‌.. రిటైల్‌ విభాగంలో 8.48 శాతం వాటాను అమ్మి మరో రూ.37,710 కోట్లు సమీకరించుకున్నది. దీంతో సెప్టెంబర్‌ 30 నాటికి ఆర్‌ఐఎల్‌ తన నికర రుణ భారాన్ని రూ.2,79,251 కోట్లకు తగ్గించుకోగలిగింది. అంతకుముందు త్రైమాసికం (ఏప్రిల్‌-జూన్‌)లో ఆర్‌ఐఎల్‌పై రూ.3,36, 294 కోట్ల రుణ భారం ఉన్నది. 

జిల్‌.. జిల్‌.. జియో 

దేశీయ టెలికం దిగ్గజం జియో లాభాలు వాయువేగంతో దూసుకుపోయాయి. గడిచిన త్రైమాసికంలో సంస్థ రూ. 2,844 కోట్ల లాభాన్ని గడించింది. 2019-20 ఏడాది ఇదే సమయంలో ఆర్జించిన రూ.990 కోట్లతో పోలిస్తే మూడింతలు పెరిగినట్లు వెల్లడించింది. అటు ఆదాయంలోనూ దూసుకుపోయింది. ఏడాది ప్రాతిపదికన కంపెనీ ఆదాయం 33 శాతం ఎగిసి రూ. 17,481 కోట్లు ఆర్జించింది. గతేడాది ఇది రూ.13,130 కోట్లుగా ఉన్నది. 

ఈ ఏడాది తొలి త్రైమాసికంతో పోలిస్తే రెండో త్రైమాసికంలో మేము మొత్తంగా మెరుగైన పనితీరు కనబర్చాం. రిటైల్‌, డిజిటల్‌ సేవల రంగాల్లో స్థిరమైన వృద్ధిని సాధించడమే ఇందుకు కారణం. దేశంలో ఇంధన వినియోగం పెరుగడంతో మా ఆయిల్‌ టు కెమికల్‌ (ఓ2సీ) వ్యాపారం కోలుకున్నది. ప్రస్తుతం ఇది కొవిడ్‌-19 పూర్వ స్థితికి చేరింది.   

-ముకేశ్‌ అంబానీ, ఆర్‌ఐఎల్‌ చైర్మన్‌