బుధవారం 03 జూన్ 2020
Business - Apr 10, 2020 , 00:04:00

కరోనా దెబ్బ ఇది..

కరోనా దెబ్బ ఇది..

66% తగ్గిన చమురు డిమాండ్‌ 

దేశవ్యాప్తంగా చమురు డిమాండ్‌ భారీగా పడిపోయింది. ప్రస్తుత నెలలో ఇప్పటి వరకు చమురు వినిమయం 66% తగ్గింది. పదేండ్ల తర్వాత భారీగా పతనమవడం ఇదే తొలిసారి. లాక్‌డౌన్‌తో పెట్రోల్‌, డీజిల్‌ వాడకం 66% తగ్గగా, అదే  విమాన ఇంధనం వాడకం 90% పడిపోయినట్లు ఇండస్ట్రీ వర్గాలు వెల్లడించాయి. 17.79% తగ్గి 16.08 మిలియన్‌ టన్నులకు పడిపోయింది.  

లాక్‌డౌన్‌ను పొడిగించండి: సీఏఐటీ 

కరోనా వైరస్‌ను కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌ను ఈ నెల చివరి వరకు పొడిగించాలని అఖిల భారత వర్తకుల సంఘం(సీఏఐటీ) కోరింది. ఇందుకు సంబంధించి ప్రధానికి లేఖకూడా రాసింది. 40 కోట్ల మంది ఉపాధి పొందుతున్న ఏడు కోట్ల చిన్న వ్యాపార సంస్థలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పటికీ కేంద్ర నిర్ణయానికి అనుగుణంగా నడుచుకుంటామని ప్రకటించింది.  

తగ్గిన రైల్వే సరుకు రవాణా

సరుకు రవాణాతో ఎప్పుడు కళకళలాడిన రైల్వేకు కష్టకాలం వచ్చింది. కరోనా వైరస్‌ దెబ్బకు గత ఆర్థిక సంవత్సరంలో 1,209 మిలియన్‌ టన్నుల సరుకును మా త్రమే చేరవేసింది. అంతక్రితం ఏడాదితో పోలిస్తే 14 మిలియన్‌ టన్నులు తక్కువ. గత 40 ఏండ్లలో ఇలా తక్కువకు పడిపోవడం ఇదే తొలిసారి. లాక్‌డౌన్‌ నేపథ్యంలో గత నెలలో వ్యాగెన్ల సంఖ్య రోజుకు 61 వేల నుంచి 34 వేలకు పడిపోయింది. 

రోడ్డుపైనే రూ.35 వేల కోట్ల సరుకు

లాక్‌డౌన్‌తో దేశవ్యాప్తంగా రోడ్లపై నిలిచిపోయిన 3.5 లక్షల ట్రక్కుల్లో రూ.35 వేల కోట్ల విలువైన సరుకు నిలిచిపోయింది. వీటిలో కార్లు, ద్విచక్ర వాహనాలు, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్‌మెషిన్లు, ఎలక్ట్రికల్‌ ఐటమ్స్‌, పారిశ్రామిక ముడి సరుకులు ఉన్నాయి. ఇది ట్రక్కులకు, సరుకు యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తున్నది. 

ఆరోగ్య పాలసీలు ప్రియం!

 ఆరోగ్య పాలసీల ప్రీమియం మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయా సంస్థలు, ప్రాడక్ట్‌ ఫీచర్స్‌లను బట్టి ప్రీమియం 5% నుంచి 25% వరకు పెరిగే అవకాశం ఉన్నదని పాలసీ బజార్‌ తాజాగా వెల్లడించింది. గతేడాది ఆయా సంస్థల ప్రకటనకు అనుగుణంగా ప్రీమియం మరింత పెంచడానికి సిద్దమయ్యాయి. 

మొబైల్‌ ఇంటర్నెట్‌ స్పీడ్‌ డౌన్‌

భారత్‌లో  మొబైల్‌ ఇంటర్నెట్‌ స్పీడ్‌ వేగం తగ్గుతున్నది. లాక్‌డౌన్‌తో ఇండ్లళ్లలోనే ప్రజలు ఉండిపోవడంతో ఇంటర్నెట్‌ వాడకం భారీగా పెరుగడంతో డౌన్‌లోడ్‌ భారీగా పడిపోయిందని ఓక్లా స్పీడ్‌టెస్ట్‌ గ్లోబల్‌ ఇండెక్స్‌ తాజాగా వెల్లడించింది. ఫిబ్రవరిలో సరాసరిగా 39.65 ఎంబీపీఎస్‌గా ఉన్న డౌన్‌లోడ్‌ స్పీడ్‌ ఆ మరుసటి నెలకుగాను 35.98 ఎంబీపీఎస్‌కు పడిపోయింది. సరాసరి మొబైల్‌ నెట్‌వర్క్‌ వేగం కూడా 11.83 ఎంబీపీఎస్‌ నుంచి 10.15 ఎంబీపీఎస్‌కు జారుకున్నది. 

వెంటిలేటర్లపై కస్టమ్స్‌ సుంకం ఎత్తివేత

కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. వెంటిలేటర్లు, ఫేస్‌, సర్జికల్‌ మాస్క్‌, వ్యక్తిగత భద్రత పరికరాలపై కస్టమ్స్‌ సుంకాన్ని ఎత్తివేస్తున్నట్లు గురువారం ప్రకటించింది. కరోనా వైరస్‌ మరింత విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో దేశవ్యాప్తంగా వీటి లభ్యత పెంచే ఉద్దేశంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నది. అలాగే దేశీయంగా తయారీ చేస్తున్న సంస్థలకు కూడా ఇది వర్తించనున్నదని పేర్కొంది. సెప్టెంబర్‌ 30 వరకు ఇది అమలులో ఉండనున్నది. 


logo