సోమవారం 06 ఏప్రిల్ 2020
Business - Mar 11, 2020 , 00:24:53

ఇక చమురు వరదే

ఇక చమురు వరదే
  • ఉత్పత్తిని పెంచుతున్న సౌదీ ఆరామ్కో
  • వచ్చే నెల నుంచి కస్టమర్లకు రోజుకు 12.3 మిలియన్‌ బ్యారెళ్ల సరఫరా

రియాద్‌, మార్చి 10: అంతర్జాతీయ మార్కెట్‌కు ముడి చమురు పోటెత్తనున్నది. క్రూడాయిల్‌ ఉత్పత్తిని పెంచుతున్నామని, తమ కస్టమర్లకు వచ్చే నెలలో రోజుకు 12.3 మిలియన్‌ బ్యారెళ్ల చమురును సరఫరా చేస్తామని మంగళవారం సౌదీ ఆరామ్కో ప్రకటించింది. రష్యాతో రాజుకున్న ధరల యుద్ధం నేపథ్యంలో ఏప్రిల్‌ నెల కోసం ముడి చమురు ధరల్ని సౌదీ అరేబియా ఇప్పటికే తగ్గించిన విషయం తెలిసిందే. వచ్చే నెల అమ్మకాల్లో భాగంగా బ్యారెల్‌ ధరపై 6 నుంచి 8 డాలర్ల రాయితీని ప్రకటించింది. అందుకు తగ్గట్లే ఇప్పుడు సౌదీ ప్రభుత్వ రంగ చమురు ఉత్పాదక దిగ్గజం ఆరామ్కో తమ ఉత్పత్తి, సరఫరాల్ని పెంచుతున్నట్లు వెల్లడించింది. దీంతో ధరల యుద్ధం ముదిరినైట్లెంది. మార్కెట్‌లోకి ముడి చమురు సరఫరా పెరిగితే ధరలు మరింత పడిపోవడం ఖాయం. ఈ పరిణామం మిగతా చమురు ఉత్పాదక దేశాలను పెద్ద ఎత్తునే నష్టపరుస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం రోజుకు సౌదీ అరేబియా క్రూడ్‌ ఉత్పత్తి 9.8 మిలియన్‌ బ్యారెళ్లుగా ఉన్నది. గ్లోబల్‌ క్రూడ్‌ మార్కెట్‌ను శాసిస్తున్న సౌదీ అరేబియాకు చమురు అమ్మకాల ద్వారానే దేశ ఆదాయంలో దాదాపు 70 శాతం వస్తున్నది.


ఒపెక్‌ దేశాల్లో చీలిక?

రష్యా-సౌదీ అరేబియా ధరల యుద్ధంతో ఒపెక్‌ దేశాలు రెండుగా చీలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ధరల క్షీణతతో మార్కెట్‌ నష్టాల్లో ఉందని, ఈ సమయంలో దుందుడుకు నిర్ణయాలు ప్రమాదమని కొన్ని దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో గ్లోబల్‌ మార్కెట్‌లో ముడి చమురు ధరలు రికార్డు స్థాయిలో పతనమవుతున్న విషయం తెలిసిందే. ధరల క్షీణతను అడ్డుకోవడంలో భాగంగా ఉత్పత్తిని తగ్గించాలన్న సౌదీసహా ఒపెక్‌ దేశాల ప్రతిపాదనను రష్యా తోసిపుచ్చింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన సౌదీ అరేబియా ధరల యుద్ధానికి తెరతీసింది. ఉత్పత్తిని పెంచి, ముడి చమురును మరింతగా మార్కెట్‌కు అందుబాటులోకి తెస్తామని ప్రకటించింది. తమ క్రూడ్‌ కొనుగోలుదారుల కోసం ధరలపై గొప్ప రాయితీలనూ ప్రకటించింది. 


logo