శనివారం 04 ఏప్రిల్ 2020
Business - Feb 03, 2020 , 23:37:20

7.27 లక్షల కోట్లు

7.27 లక్షల కోట్లు
  • గతేడాదిసెప్టెంబర్‌ నాటికి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎన్‌పీఏలు
  • 2018 మార్చితో పోల్చితే రూ.1.68 లక్షల కోట్లు తగ్గుదల
  • లోక్‌సభలో వెల్లడించిన ఆర్థిక మంత్రిత్వ శాఖ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3:  ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మొండి బకాయిలు (నిరర్థక ఆస్తులు లేదా ఎన్‌పీఏ) గతేడాది సెప్టెంబర్‌ ఆఖరుకు రూ.7.27 లక్షల కోట్లుగా ఉన్నాయని సోమవారం కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ లోక్‌సభలో ప్రకటించారు. మార్చి 31, 2018 నాటికి రూ.8,95,601 కోట్లుగా ఉన్న ఎన్‌పీఏలు.. సెప్టెంబర్‌ 30, 2019 నాటికి రూ.7,27,296 కోట్లకు వచ్చాయని, దీనివల్ల రూ.1,68,305 కోట్లు తగ్గాయని వివరించారు. తమ ప్రభుత్వం బ్యాంకింగ్‌ రంగంలో చేపట్టిన తీర్మానాలు, సంస్కరణలు, మూలధన సాయం వంటివి ఇందుకు దోహదం చేశాయని కొశ్చన్‌ అవర్‌ సందర్భంగా చెప్పారు. అయితే మార్చి 31, 2015 నాటికి రూ.2,79,016 కోట్లుగానే ఉన్న మొండి బకాయిలు.. మార్చి 31, 2017 నాటికి రూ.6,84,732 కోట్లకు పెరుగడం గమనార్హం. 


పెరిగిన మోసాలు

మరోవైపు షెడ్యూల్డ్‌ కమర్షియల్‌ బ్యాంకులు, కొన్ని ఆర్థిక సంస్థలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) ప్రథమార్ధం (ఏప్రిల్‌-సెప్టెంబర్‌)లో రూ.1,13,374 కోట్ల విలువైన మోసాలను నివేదించాయని ఠాకూర్‌ తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం (2018-19) రూ.71,543 కోట్ల విలువైన మోసాలు జరిగాయన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ సైతం ఈ అంశంపై పార్లమెంట్‌లో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. మోసాలను అరికట్టేందుకు అన్ని కోణాల్లో తగు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.


ఆర్థిక మాంద్యం కాదు

దేశ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలో పడిపోలేదని ఠాకూర్‌ ఓ లిఖితపూర్వక సమాధానంగా లోక్‌సభకు స్పష్టం చేశారు. జీ-20 దేశాల్లో 2014-19 కాలంలో అత్యధిక సగటు వృద్ధిరేటు నమోదు చేసింది భారతేనని గుర్తుచేశారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) అంచనాల ప్రకారం వేగవంతమైన జీడీపీ కలిగిన దేశాల్లో భారత్‌ కూడా ఉందని చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరం (2020-21) దేశ జీడీపీ 5.8 శాతంగా ఉండొచ్చన్న ఐఎంఎఫ్‌.. 2021-22 నాటికి చైనా జీడీపీని అధిగమిస్తూ 6.5 శాతంగా ఉండొచ్చన్నదని తెలియజేశారు. గతేడాది నవంబర్‌లో పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) 1.8 శాతానికి పెరిగిందని, అంతకుముందు రెండు నెలల్లో ఇది మైనస్‌ 4 శాతం, 4.3 శాతంగా ఉన్నదని వివరించారు. దేశ ఆర్థిక ప్రగతికి తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు సత్ఫలితాలు వస్తున్నాయన్నారు.


logo