శనివారం 05 డిసెంబర్ 2020
Business - Oct 20, 2020 , 01:09:18

ఇక స్టాక్‌ మార్కెట్‌లో తెలంగాణ దూకుడు

ఇక స్టాక్‌ మార్కెట్‌లో తెలంగాణ దూకుడు

బీఎస్‌ఈతో రాష్ట్ర ప్రభుత్వం జట్టు 

ఎంఎస్‌ఎంఈలకు ప్రోత్సాహం

పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ సమక్షంలో ఎంవోయూ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ (ఎంఎస్‌ఎంఈ)లు స్టాక్‌ ఎక్సేంజీల్లో నమోదయ్యేలా ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌తో (బీఎస్‌ఈ) చేతులు కలిపింది. ఇందుకు సంబంధించిన ఎంవోయూపై రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ సమక్షంలో పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రతినిధులు, బీఎస్‌ఈ, గ్లోబల్‌ లింకర్‌ ప్రతినిధులు సోమవారం సంతకాలు చేశారు. ఈ సందర్భంగా జయేశ్‌ రంజన్‌ మాట్లాడుతూ.. ఎంఎస్‌ఎంఈల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలు చేపట్టి ఇతరులకు ఆదర్శంగా నిలిచిందన్నారు. ప్రస్తుతం స్టాక్‌ ఎక్సేంజీల్లో నమోదైన ఎంఎస్‌ఎంఈల సంఖ్య చాలా తక్కువగా ఉన్నదని, తాజా ఒప్పందంతో ఈ సంఖ్య పెరుగుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం ప్రకారం స్టాక్‌ ఎక్చేంజీల్లో లిస్టింగ్‌ చేయడం వల్ల కలిగే లాభాలను పారిశ్రామికవేత్తలకు బీఎస్‌ఈ వివరించనున్నది. ఇందుకోసం అవసరమైన సాంకేతిక, మానవ వనరులను సమకూర్చుతుంది. రాష్ట్రంలోని ఎంఎస్‌ఎంఈల అభివృద్ధికి ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలు చేపట్టింది. ఉత్పత్తులకు మార్కెటింగ్‌ అవకాశాలను పెంచేందుకు ప్రత్యేక పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఉత్పత్తిదారులు, కొనుగోలుదారులను ఒకే వేదిక మీదికి తీసుకొచ్చింది. ఎంఎస్‌ఎంఈలను డిజిటలైజ్‌ చేయడం, వాటి వ్యాపారాభివృద్ధికి తోడ్పడేందుకు ప్రభుత్వం గతేడాదే ప్రఖ్యాత గ్లోబల్‌ లింకర్‌ సంస్థతో చేతులు కలిపింది. కార్యక్రమంలో గ్లోబల్‌ లింకర్‌ సీఈవో సమీర్‌ వకిల్‌,  బీఎస్‌ఈ ఎండీ, సీఈవో ఆశిశ్‌ కుమార్‌ చౌహాన్‌  పాల్గొన్నారు.