Future in Supreme Court | గడువులోగా రుణ బకాయిలు చెల్లించలేదనే సాకుతో తమను ఎగవేతదారుగా ప్రకటించొద్దని రుణదాతలైన బ్యాంకర్లను ఫ్యూచర్ రిటైల్ కోరింది. రిలయన్స్ రిటైల్‌లో తమ సంస్థ విలీనంపై గ్లోబల్ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌తో న్యాయ పోరాటం చేస్తున్నందున తమ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. తమ సంస్థను ఎగవేతదారుగా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
రూ.24,713 కోట్లకు రిలయన్స్రిటైల్లో ఫ్యూచర్ రిటైల్ విలీనానికి 2020 ఆగస్టులో రెండు సంస్థల మధ్య అంగీకారం కుదిరింది. కానీ, 2019కి ముందే ఫ్యూచర్ కూపన్స్‌లో పెట్టుబడులు పెట్టినప్పుడే అమెజాన్‌కు విక్రయించేందుకు ఫ్యూచర్ రిటైల్-అమెజాన్ మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందాన్ని అడ్డం పెట్టుకుని అమెజాన్.. సింగపూర్ అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానం నుంచి ఆర్బిట్రేషన్ కోరింది. సింగపూర్ కోర్టు ఆదేశాలతో రిలయన్స్‌తో ఫ్యూచర్ ఒప్పందం నిలిచిపోయింది.
ఫలితంగా గత నెలాఖరులోగా రూ.3,500 కోట్ల రుణ బకాయిలను ఫ్యూచర్ రిటైల్ చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకు బ్యాంకులు పెట్టిన షరతులు అమలు చేయడంలో ఫ్యూచర్ విఫలమైంది. కానీ తమ తప్పేమీ లేదని ఫ్యూచర్ వాదిస్తున్నది. తాజా పరిణామాల నేపథ్యంలో తమకు మరికొంత టైం ఇవ్వాలని ఆర్బీఐతోపాటు బ్యాంకర్లను ఆదేశించాలని సుప్రీంకోర్టును ఫ్యూచర్ రిటైల్ కోరింది.