పన్ను చెల్లింపులకు కాదు.. రిటర్నులకు మాత్రమే!

అదికూడా నిబంధనలకు లోబడితేనే మినహాయింపు
సీనియర్ సిటిజన్లలో కేవలం కొందరికే ప్రయోజనం
ఆదాయ పన్ను రిటర్నుల దాఖలు విషయంలో సీనియర్ సిటిజన్లకు మినహాయింపు ఇవ్వాలన్న నిర్ణయం పట్ల సర్వత్రా సంతోషం వ్యక్తమైంది. ఈ మేరకు సార్వత్రిక బడ్జెట్లో కేంద్రం చేసిన ప్రకటనతో 75 ఏండ్ల వయసు దాటిన వారందరికీ ఎంతో ఊరట లభిస్తుందని, వృద్ధులకు ప్రయాస తప్పుతుందని చాలా మంది ఆశించారు.
కానీ వాస్తవంలో అలా జరిగేలా కనిపించడంలేదు. ఈ ప్రయోజనాన్ని కల్పించేందుకు ప్రభుత్వం పలు నిబంధనలు విధించడమే ఇందుకు కారణం. ఈ నిబంధనలు చాలా మందికి ఆచరణ సాధ్యం కావని, దీంతో కేవలం కొద్ది మంది సీనియర్ సిటిజన్లకు మాత్రమే ప్రయోజనం చేకూరుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
ఆదాయ పన్ను (ఐటీ) చెల్లింపుల విషయంలో సీనియర్ సిటిజన్లకు ఊరట కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిశ్చయించింది. 75 ఏండ్లు లేదా కంటే ఎక్కువ వయసున్న సీనియర్ సిటిజన్లకు ఐటీ రిటర్ను (ఐటీఆర్)ల దాఖలు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఇటీవల సార్వత్రిక బడ్జెట్-2021లో ప్రతిపాదించింది. దేశానికి స్వాతంత్య్రం లభించి 75 ఏండ్లు దాటిన సందర్భంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. ఇది కేవలం రిటర్నుల దాఖలులో మినహాయింపే తప్ప పన్ను చెల్లింపులో కాదని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. ఈ ప్రయోజనాన్ని కల్పించేందుకు కూడా ప్రభుత్వం పలు నిబంధనలు విధించింది. కేవలం పెన్షన్, వడ్డీపై వచ్చే ఆదాయంతో జీవించే సీనియర్ సిటిజన్లు మాత్రమే ఐటీఆర్ దాఖలు నుంచి మినహాయింపు పొందేందుకు వీలుంటుంది. పైపెచ్చు ప్రభుత్వం నిర్దేశించిన బ్యాంకుల నుంచే పెన్షన్‌ను, వడ్డీ ఆదాయాన్ని పొందేవారే ఈ ప్రయోజనాన్ని పొందేందుకు అర్హులు. ఈ రెండు ఖాతాలు ఒకే బ్యాంకులో ఉండాలి. వీటితోపాటు ప్రభుత్వం మరికొన్ని నిబంధనలను కూడా విధించింది.
చాలా మందికి నిరాశే..
ఏది ఏమైనప్పటికీ ఆదాయ పన్ను రిటర్నుల దాఖలు నుంచి సీనియర్ సిటిజన్లకు మినహాయింపు ఇవ్వాలన్న ఉద్దేశం మంచిదే. అయినప్పటికీ ప్రభుత్వం నిర్దేశించిన అన్ని నిబంధనలకు లోబడి ఉండటం ఎవరికైనా కష్టమే. దీంతో చాలా మంది సీనియర్ సిటిజన్లు ఈ ప్రయోజనాన్ని పొందలేరని మనోహర్ చౌదరి అండ్ అసోసియేట్స్ పార్ట్నర్ అమీత్ పటేల్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా పెన్షన్‌ను, వడ్డీ ఆదాయాన్ని ఒకే బ్యాంకు నుంచి పొందుతూ ఉండాలన్న నిబంధన ఆచరణలో చాలా మందికి సాధ్యం కాదని, ఫలితంగా ఎంతో మంది సీనియర్ సిటిజన్లు ఐటీఆర్ దాఖలులో మినహాయింపు పొందలేరని ఆయన స్పష్టం చేశారు.
నిబంధనలు
- ఐటీఆర్ దాఖలు నుంచి మినహాయింపు పొందాలనుకునే సీనియర్ సిటిజన్ల వయసు 75 ఏండ్లు లేదా అంతకంటే ఎక్కువగా ఉండాలి. వీరు భారత్‌లో నివసించేవారై ఉండాలి.
- కేవలం పెన్షన్, వడ్డీపై వచ్చే ఆదాయంతో జీవించేవారే ఈ మినహాయింపును పొందేందుకు అర్హులు. వీరు తమ పెన్షన్‌ను, వడ్డీ ఆదాయాన్ని వేర్వేరు బ్యాంకుల నుంచి కాకుండా ఒకే బ్యాంకు నుంచి పొందుతూ ఉండాలి. ఈ రెండు ఖాతాలు ఒకే బ్యాంకులో ఉండాలి. అది కూడా ప్రభుత్వం నిర్దేశించిన బ్యాంకు అయి ఉండాలి.
- ఇలాంటి బ్యాంకులు ఏవన్నది ప్రభుత్వమే నిర్దేశిస్తుంది. ఈ బ్యాంకుల నుంచి పెన్షన్, వడ్డీ ఆదాయాన్ని పొందే సీనియర్ సిటిజన్లే ఐటీఆర్ దాఖలు నుంచి మినహాయింపు పొందేందుకు వీలుంటుంది.
- పై అర్హతలన్నీ ఉన్న సీనియర్ సిటిజన్లు తమ వివరాలతో ప్రభుత్వం నిర్దేశించిన బ్యాంకులకు విధిగా డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. కేవలం పెన్షన్, వడ్డీ ఆదాయంతోనే జీవిస్తున్నామని, మరే ఇతర ఆదాయాన్ని పొందడంలేదని ఆ డిక్లరేషన్‌లో ధ్రువీకరిచాల్సి ఉంటుంది. ఈ డిక్లరేషన్ కూడా ప్రభుత్వం నిర్దేశించిన రూపం (ఫార్మాట్)లోనే ఉండాలి. లేకపోతే ఐటీఆర్ దాఖలులో మినహాయింపు లభించదు.
తాజావార్తలు
- గల్ఫ్‌లో భారతీయుల కోసం ప్రత్యేక విమానాలు
- రాష్ట్రంలో ముదురుతున్న ఎండలు
- 03-03-2021 బుధవారం.. మీ రాశి ఫలాలు
- నమో నారసింహ
- డాలర్ మోసం
- కేసీఆర్ ఆధ్వర్యంలోనే పర్యాటకం రంగం అభివృద్ధి
- కళాకారులకు ఆర్థికంగా చేయూతనివ్వాలి
- విద్యుత్ వినియోగం..క్రమంగా అధికం!
- బీజేపీ ఇస్తామన్న ఉద్యోగాలు ఎక్కడ..?
- విద్యాసంస్థల 'వాణి'ని వినిపిస్తుంది..