గురువారం 02 ఏప్రిల్ 2020
Business - Jan 31, 2020 , 01:32:50

ఆర్థిక ఉద్దీపన అసాధ్యం

ఆర్థిక ఉద్దీపన అసాధ్యం
  • బడ్జెట్‌లో ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టి పెట్టాలి
  • కేంద్రానికి నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌ సూచన

న్యూఢిల్లీ, జనవరి 30: మందగించిన దేశ ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరిచేందుకు ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టి పెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌ సూచించారు. ఆర్థిక ఉద్దీపన అసాధ్యమన్న ఆయన 7-8 శాతం వార్షిక వృద్ధిరేటు లక్ష్యంగా వృద్ధిదాయక చర్యలు అవసరమని అభిప్రాయపడ్డారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2020-21)గాను ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలో కుమార్‌ సూచనలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న మందగమనాన్ని ఆర్థిక ఉద్దీపనలతో పోగొట్టాలని పలువురు ఆర్థిక నిపుణులు సలహాలు ఇస్తున్న నేపథ్యంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్థిక ఉద్దీపనలు ఇవ్వడం కుదరదని, ఇతర మార్గాల్లో ఆర్థిక సాయం మంచిదని కుమార్‌ చెబుతున్నారు. ఆర్థిక మందగమనాన్ని నిరోధించడానికి లేదా ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కోవడానికి వివిధ రకాల ప్రోత్సాహకాలు, పన్ను రిబేట్లతో వ్యాపార, పారిశ్రామిక రంగాలకు ప్యాకేజీని ఇవ్వడమే ఆర్థిక ఉద్దీపన. క్షీణించిన పన్ను వసూళ్లు, పడిపోయిన ఎగుమతులు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, దిగజారుతున్న ఉత్పత్తి, నిరాశపరుస్తున్న కొనుగోళ్లు, పెచ్చుమీరుతున్న నిరుద్యోగం మధ్య ఆర్థిక ఉద్దీపన అసాధ్యమని కుమార్‌ అంటున్నారు. మరోలా వ్యాపార, పారిశ్రామిక రంగాలకు చేయూతనివ్వాలని కోరుతున్నారు.


logo
>>>>>>