శుక్రవారం 05 మార్చి 2021
Business - Feb 12, 2021 , 02:53:13

కార్పొరేట్లకు నో ఛాన్స్‌?

కార్పొరేట్లకు నో ఛాన్స్‌?

  • వ్యక్తులకూ జరిమానా తప్పదు
  • క్రిప్టోకరెన్సీ వినియోగంపై కొత్త చట్టం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: దేశీయ సంస్థలు, వ్యక్తులకు క్రిప్టోకరెన్సీల వినియోగాన్ని కొత్త చట్టం దూరం చేయనుందని తెలుస్తున్నది. డిజిటల్‌ కరెన్సీలపై కేంద్ర ప్రభుత్వం ఓ చట్టాన్ని తీసుకువస్తుండగా, ఈ పార్లమెంట్‌ సమావేశాల్లోనే దీనికి సంబంధించిన ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టవచ్చని సమాచారం. ఈ బిల్లు ఆమోదం పొందితే క్రిప్టోకరెన్సీల్లో ఇక ఎడాపెడా నగదు నిల్వలను పెంచుకునే అవకాశం అటు కార్పొరేట్‌ సంస్థలకు, ఇటు వ్యక్తులకు ఉండదు. ఎక్సేంజీలు, ట్రేడర్లు, ఇతర ఆర్థిక వ్యవస్థలూ క్రిప్టోకరెన్సీల జోలికి వెళ్లరాదు. ఈ మేరకు చట్టంలో స్పష్టమైన నిబంధనలు రానున్నాయి. 

వీటిని మీరితే జరిమానాలూ ఉండనున్నాయి. బిట్‌కాయిన్‌లో అమెరికా సంస్థ టెస్లా 1.5 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులను ప్రకటించగా, తమ విద్యుత్‌ వాహనాల కొనుగోలుకు బిట్‌కాయిన్లను వాడుకునే అవకాశాన్ని ఇవ్వాలని చూస్తున్నది. ఈ నేపథ్యంలోనే ఈ బిల్లు వస్తుండటం గమనార్హం. మరోవైపు అన్ని ప్రైవేట్‌ క్రిప్టోకరెన్సీలపైనా పూర్తి నిషేధం.. ఈ ముసాయిదా బిల్లుతో రానున్నది. ఇప్పటికే బిట్‌కాయిన్‌ తదితర క్రిప్టోకరెన్సీల లావాదేవీల్లో తలదూర్చ వద్దని అన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థలను కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇక ప్రభుత్వం ఓ డిజిటల్‌ కరెన్సీని పరిచయం చేసే వీలుండగా, దీన్ని ఆర్బీఐ నియంత్రించే అవకాశాలున్నాయి.


రూ.7,271 కోట్లపైనే..

ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీలకు విపరీతమైన క్రేజ్‌ కనిపిస్తున్నది. భారతీయులూ ఈ డిజిటల్‌ కరెన్సీల వైపు ఆకర్షితులవుతున్నారు. దేశంలోని దాదాపు 70 లక్షల మంది వద్ద రూ.7,271 కోట్లకుపైగా విలువైన క్రిప్టోకరెన్సీ ఉండటమే ఇందుకు నిదర్శనం. ఏడాది కాలంలో ఈ విలువ ఏకంగా 700 శాతానికిపైగా పెరిగినట్లు అధికారిక గణాంకాలే చెప్తున్నాయి. 2019లో అన్ని ప్రైవేట్‌ క్రిప్టోకరెన్సీలను నిషేధించాలని సిఫార్సు చేసిన ఓ ప్రభుత్వ కమిటీ.. ఈ లావాదేవీలను ఎవరు జరిపినా పదేండ్ల జైలు, భారీ జరిమానాలను వేయాలని సూచించింది. 2018 ఏప్రిల్‌లో ఆర్బీఐ కూడా బ్యాంకులపై ఇదే తరహా నిషేధం విధించగా, గతేడాది మార్చిలో సుప్రీం కోర్టు దాన్ని కొట్టేసింది.

VIDEOS

logo