శుక్రవారం 23 అక్టోబర్ 2020
Business - Sep 27, 2020 , 02:01:46

మన ఎగుమతులు2 లక్షల కోట్లు

మన ఎగుమతులు2 లక్షల కోట్లు

  • 190 దేశాలకు పైగా ఐటీ, మర్కండైజ్‌ ఎగుమతులు 
  • ఐదేండ్లలో 70 వేల కోట్లు పెరిగిన ఎగుమతుల విలువ 
  • నీతి ఆయోగ్‌ విడుదలచేసిన సూచిలో వెల్లడి

పరుగుపందెం ఏదైనా సరే.. తెలంగాణ వేగాన్ని ఆపడం ఎవరితరం కాదన్నది మరోసారి రుజువైంది. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఏ రంగంలోనైనా తెలంగాణతో పోటీ పడటంలో పెద్ద పెద్ద రాష్టాలు సైతం వెనుకబడిపోతున్నాయి. సంక్షేమంలో.. వ్యవసాయంలో.. నీళ్లలో.. కరెంట్‌లో, విద్యలో.. ఇలా ఒక్కో రంగంలో దూసుకుపోతున్న తెలంగాణ ఇప్పుడు ఎగుమతుల్లోనూ దేశంలో అగ్రస్థానంలో నిలుస్తున్నది. గత ఆరేండ్ల కాలంలో దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయల విలువైన ఎగుమతులు తెలంగాణ నుంచి జరగటం ఇందుకు తార్కాణం. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో నేడు తెలంగాణ.. ఎగుమతులు అధికంగా చేస్తున్న రాష్ర్టాల జాబితాలో ఆరోస్థానంలో నిలిచింది. అదేవిధంగా లాండ్‌ లాక్డ్‌ స్టేట్స్‌ విభాగంలో రెండోస్థానానికి చేరుకొన్నది. 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రం ఎగుమతుల్లో గణనీయమైన వృద్ధి సాధిస్తున్నది. రాష్ట్రం ఏర్పడిన ఐదేండ్లలోనే 64 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నది. రాష్ట్రం నుంచి 1.80 లక్షల కోట్ల విలువైన వివిధ రకాల వస్తువులు, ఐటీ ఎగుమతులు ప్రపంచంలోని దాదాపు 190 దేశాలకు రవాణా అవుతున్నాయి. ఎగుమతులను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఇందుకు తార్కాణంగా నిలుస్తున్నాయి. దేశీయ ఎగుమతుల్లో 70 శాతానికిపైగా వాటా కలిగిన రాష్ర్టాల జాబితాలో తెలంగాణ ఒకటిగా నిలిచింది. తాజాగా నీతిఆయోగ్‌ విడుదల చేసిన ఎగుమతుల సన్నద్ధత సూచీ 2020 ర్యాంకుల్లో తెలంగాణ ఆరోస్థానంలో నిలిచింది. మరోవైపు లాండ్‌ లాక్డ్‌ స్టేట్స్‌ విభాగంలో రెండోస్థానంలో నిలిచింది. టీఎస్‌ఐపాస్‌ ద్వారా రాష్ర్టానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చాయి. ఫలితంగా పారిశ్రామిక ఉత్పత్తులు పెరిగాయి. ఎగుమతి అయ్యే వస్తువులూ పెరిగాయి.

ఎగుమతులు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నా.. రాష్ట్రం నుంచి ఆ యా రంగాల పరిశ్రమలకు అనువైన వసతులు, మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నది. అలాగే నిరుద్యోగులను నైపుణ్యమున్న వారిగా తీర్చిదిద్ది పరిశ్రమలకు ఉపయోగపడే విధంగా తయారుచేస్తున్నది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం నుంచి రూ.1.10 లక్షల కోట్లు ఎగుమతులు జరుగగా.. 2019-20 మార్చితో ముగిసిన సంవత్సరానికి రూ.1.80లక్షల కోట్ల విలువైన ఎగుమతులు జరిగాయి. రాష్ట్రంలో ఎగుమతుల ప్రోత్సాహక విధానం, వ్యవస్థాగత నిబంధనలు, వాణిజ్యపరంగా ఉన్న సానుకూల వాతావరణం, మౌలిక వసతులు, రవాణా అనుసంధానం, ద్రవ్యలభ్యత, మౌలిక వసతులు, వాణిజ్య మద్దతు, ఆర్‌ అండ్‌ డీకి అనువైన వాతావరణం తదితర అంశాల్లో తెలంగాణ మెరుగైన స్థానాల్లో ఉంది. 

ఐటీ, ఫార్మాలే కీలకం

వివిధరకాల మర్కండైజ్‌ ఎగుమతుల్లో తెలంగాణ ప్రతిఏడాది గణనీయమైన వృద్ధిని సాధిస్తూ ముందుకు సాగుతున్నది. ఈ విభాగంలో 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ.35,444 కోట్ల ఎగుమతులు జరగ్గా .. 2019-20లో రూ.52,170 కోట్లకు పెరిగాయి. ఇందులో ఫార్మా ఆర్గానిక్‌ కెమికల్స్‌ వాటా రూ.32,631 కోట్లు. ఇక ఐటీ రంగంలో 2015-16లో రూ.75,070 కోట్లు, 2019-20లో రూ.1,28,807 కోట్ల ఎగుమతులు అయ్యాయి. తెలంగాణ నుంచి జరిగే ఎగుమతుల్లో ఐటీ, ఫార్మా రంగానికి చెందిన ఉత్పత్తులు ఎక్కువగా ఉంటున్నాయి. ఫార్మా ఉత్పత్తుల ఎగుమతుల ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రపంచంలోనే అతి పెద్ద ఫార్మా క్లస్టర్‌ను తెలంగాణలో ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు ఐటీని ప్రోత్సహించేందుకు, హైదరాబాద్‌లోని ఒక ప్రాంతానికి పరిమితం కాకుండా అన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు ప్రత్యేక ప్రోత్సహాక పాలసీలను ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా అవసరమైన వ్యాక్సిన్‌ల ఎగుమతుల్లో మూడోవంతు తెలంగాణ నుంచే అవుతున్నాయి. వంద దేశాలకు ఇక్కడి నుంచి వ్యాక్సిన్‌లు పంపిణీ అవుతున్నాయి. వివిధ జబ్బులకు చికిత్స అందించేందుకు అవసరమైన ముందులు కూడా ఇక్కడే తయారై ఎగుమతి అవుతున్నాయి.


logo