సోమవారం 10 ఆగస్టు 2020
Business - Jul 15, 2020 , 20:52:37

భార‌తీయుల సేవ‌లో రిల‌య‌న్స్ ఫౌండేష‌న్‌: నీతా అంబానీ‌

భార‌తీయుల సేవ‌లో రిల‌య‌న్స్ ఫౌండేష‌న్‌: నీతా అంబానీ‌

ముంబై: క‌రోనా మ‌హ‌మ్మారిపై పోరాటంలో రిల‌య‌న్స్ ఫౌండేష‌న్ త‌న‌వంతుగా కీల‌కపాత్ర పోషిస్తున్న‌ద‌ని ఆ ఫౌండేష‌న్ వ్య‌వ‌స్థాప‌కురాలు, చైర్మ‌న్ నీతా అంబానీ చెప్పారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ 43వ ఏజీఎం సమావేశంలో ఆమె ప్రసంగించారు. కరోనా ప్రబలిన తర్వాత మన మొట్టమొదటి ఛాలెంజ్ పీపీఈ కిట్లు అని, రికార్డు సమయంలో వాటిని తయారు చేశామ‌ని ఆమె తెలిపారు. రోజుకు లక్ష పీపీఈ కిట్లు, ఎన్ 95 మాస్క్‌లు తయారు చేశామ‌న్నారు. 

ఈ దశాబ్దకాలంలో గ్రామీణ ప్రాంతాల్లోని 36 మిలియన్ల మందికి రిల‌య‌న్స్ ఫౌండేష‌న్‌ సేవలందించింద‌ని నీతా అంబానీ చెప్పారు. కరోనా సమయంలో ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న వాహనాలకు రిలయన్స్ పెట్రోల్ బంకుల్లో ఉచితంగా చమురు కూడా అందించామ‌న్నారు. దేశానికి సేవ చేయ‌డం త‌మ బాధ్యతని, ధర్మమ‌ని ఆమె చెప్పారు. కరోనా వైరస్ ప్రబలిన త‌ర్వాత‌ రెండు వారాల్లోనే ముంబైలో 100 పడకల ప్రత్యేక క‌రోనా ఆస్పత్రిని ఏర్పాటు చేశామ‌న్నారు. 

రిలయన్స్ ఫౌండేషన్ చేపట్టిన మిషన్ అన్నసేవ కార్య‌క్ర‌మాన్ని ఒక‌ కార్పొరేట్ ఫౌండేషన్ చేపట్టడం ఇదే మొదటిసారన్నారు. పేదలు, రోజు కూలీలు, ఫ్రంట్ లైన్ వర్కర్లు ఇలా మొత్తం 5 కోట్ల మందికి మిష‌న్‌ అన్నసేవ ద్వారా భోజనాలు అందించామ‌ని చెప్పారు. విద్య, క్రీడల్లో కలపి మొత్తం 21.5 మిలియన్‌ల మంది పిల్లలకు రిలయన్స్ ఫౌండేషన్ సాయం చేసింద‌న్నారు. రిలయన్స్ జియో 40 కోట్ల మంది భారతీయులకు డిజిటల్ కనెక్టివిటీ అందిస్తున్న‌ద‌ని, లక్షలాది మంది విద్యార్థులు ఇంటి వద్ద నుంచి చదువుకుంటున్నారని నీతా అంబానీ చెప్పారు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo