బుధవారం 05 ఆగస్టు 2020
Business - Jul 15, 2020 , 23:14:57

రిలయన్స్ ఏజీఎంలో నీతా అంబానీ తొలి ప్రసంగం

రిలయన్స్ ఏజీఎంలో నీతా అంబానీ తొలి ప్రసంగం

ముంబై : రిలయన్స్ ఏజీఎం సమావేశంలో నీతా అంబానీ తొలిసారి ప్రసంగించారు. కరోనా వైరస్ నివారణలో తమవంతు సహకారం ఉంటుందని ఆమె చెప్పారు. కొవిడ్-19 కు వ్యతిరేకంగా ప్రభుత్వం జరుపుతున్న పోరాటానికి రిలయన్స్ ఫౌండేషన్ పూర్తి మద్దతు ఉంటుందని తన ప్రసంగంలో హామీ ఇచ్చారు.

"భారతదేశం ఏదైనా కష్టాలను ఎదుర్కొన్నప్పుడల్లా భారతీయులైన మనం ఎల్లప్పుడూ సంపూర్ణ ఐక్యత మరియు దృఢ నిశ్చయంతో అధిగమించాం. భిన్నంగా ఉన్న ఈ సంక్షోభాన్ని నివారించేందుకు మనమంతా ఐకమత్యంగా పోరాటం చేద్దాం. ఈ పోరాటంలో అంతిమ విజయం మనదే " అని నీతా అంబానీ చెప్పారు.

కరోనా మహమ్మారి సంక్షోభం మధ్య రిలయన్స్ ఫౌండేషన్, రిలయన్స్ రిటైల్ చేసిన ప్రయత్నాలను ఆమె స్పష్టంచేశారు. "మహమ్మారి సంభవించినప్పుడు ప్రారంభ సవాళ్ళలో ఒకటి పీపీఈల కొరత. రికార్డు సమయంలో మేము నిత్యం లక్షకు పైగా పీపీఈలు, ఎన్ 95 మాస్కులు ఉత్పత్తి చేయగలిగాం" అని ఆమె తెలిపారు. "రిలయన్స్ దేశవ్యాప్తంగా అత్యవసర సేవా వాహనాలకు ఉచిత ఇంధనాన్ని అందిస్తున్నది. ఇది మాకు వ్యాపారం మాత్రమే కాదు. ఇది మా కర్తవ్యం, మన ధర్మం, దేశానికి మన సేవ. 200 నగరాల్లోని మిలియన్ల మంది భారతీయ కుటుంబాలకు రోజూ అవసరమైన సామాగ్రిని అందించడానికి రిలయన్స్ రిటైల్ ఓవర్ టైం పనిచేస్తోంది" అని పేర్కొన్నారు.


logo