సోమవారం 30 నవంబర్ 2020
Business - Oct 21, 2020 , 19:14:46

కొత్త బి-ఎస్‌యూవీ మాగ్నైట్..‌ లాంచ్‌ చేసిన నిస్సాన్

కొత్త బి-ఎస్‌యూవీ మాగ్నైట్..‌ లాంచ్‌ చేసిన నిస్సాన్

హైదరాబాద్: కొత్త బి-ఎస్‌యూవీ మాగ్నైట్‌ను నిస్సాన్ లాంచ్‌ చేసింది. మారుతి సుజుకి విటారా బ్రెజ్జా, కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ వంటి కార్లకు ప్రత్యక్ష పోటీని ఇస్తూ, నిస్సాన్ మోటార్ కార్ప్ బుధవారం నిస్సాన్ మాగ్నైట్ అనే బి-ఎస్‌యూవీ (దిగువ కాంపాక్ట్ ఎస్‌యూవీ) విభాగంలో కొత్త కారును ఆవిష్కరించింది. వాహన తయారీదారుల ‘ఆల్-న్యూ నెక్స్ట్ స్ట్రాటజీ’లో భాగమైన ఈ కారు, భవిష్యత్తులో నిస్సాన్ భారతదేశంలో విడుదల చేయబోయే ఎనిమిది కొత్త మోడళ్లలో మొదటిది. జపా‌న్‌ కార్ల తయారీ సంస్థ అయిన నిస్సాన్‌ కొన్ని నెలలపాటు టీజర్ చిత్రాలు, భారీ అంఛనాలతో అదరగొడుతూ చివరకు కొత్త వెర్షన్‌ కారు ‘బి-ఎస్‌యూవీ మాగ్నైట్‌’ను ఆవిష్కరించింది. భారతీయ మార్కెట్ కోసం నిస్సాన్ నెక్స్ట్ స్ట్రాటజీ క్రింద కంపెనీ ప్రవేశపెట్టనున్న మొట్టమొదటి ఉత్పత్తి ఇది. 2020-21 ఆర్థిక సంవత్సరం రెండవ భాగంలో కొత్త బి-ఎస్‌యూవీ మాగ్నైట్‌ అందుబాటులోకి రానున్నది.

నిస్సాన్ మోటార్ ఇండియా అధ్యక్షుడు సినాన్ ఓజ్కోక్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘భారతదేశంలో విస్తరించడానికి, వ్యాపారాన్ని బలోపేతం చేయడానికి కొత్త మాగ్నైట్ మా నిబద్ధతను తెలియజేస్తుంది. దేశంలో రూ.6,100 కోట్ల పెట్టుబడుల ప్రణాళిక ఇందులో భాగమే. ఈ కారు భారతదేశంలోనే తయారవుతుంది. భారత వినియోగదారులకే తొలుత అందుబాటులోకి వస్తుంది. అనంతరం భారతదేశం నుండి ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’ అని తెలిపారు. సమీప భవిష్యత్తులో ఎనిమిది కొత్త మోడళ్లను లాంచ్ చేయాలని జపాన్ ఆటో మేజర్ యోచిస్తోందని, భారత మార్కెట్ కోసం ప్లాన్ చేసిన కొత్త మోడళ్లలో మాగ్నైట్ మొదటిదని ఓజ్కాక్ తెలిపారు.

నిస్సాన్ మోటార్ ఇండియా, ఎండీ రాకేశ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా కంపెనీ డిజిటల్ ప్లాట్‌ఫామ్ వైపు పయనిస్తోందని చెప్పారు. దీంతో మొత్తం వాహనాల పోర్ట్‌ఫోలియోను ఆన్‌లైన్‌లోకి మార్చినట్లు తెలిపారు. ఇప్పుడు వినియోగదారులు తమ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ ద్వారా వారికి నచ్చిన నిస్సాన్‌ కారును ఎంచుకోవడం, బుక్ చేసుకోవడంతోపాటు కొనుగోలు చేయవచ్చని చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలం­గాణ ఆండ్రా­యిడ్ యాప్ డౌన్‌­లోడ్ చేసు­కోండి